Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్టయిల్‌గా కనిపించటం కోసం 'హై హీల్స్' వేసుకుంటూ ఉంటాం. అయితే ఇలాంటి హైహీల్స్ అరుదుగా వాడుతూ ఉంటే ఫర్వాలేదు. కానీ ఎప్పుడూ అలాంటి చెప్పులే వేసుకుంటే పాదాల సమస్యలు మొదలవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనల్లో ఎక్కువ కాలం హైహీల్స్ వాడటం వల్ల ఆర్థోఫెడిక్ లాంటి సీరియస్ సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముందని, కొన్ని సందర్భాల్లో మోకాలు చిప్ప మార్చాల్సిన అవసరం కూడా పడవచ్చని తేలింది. ఎత్తు మడమల చెప్పుల వల్ల మోకాళ్ల మీద అధిక భారం పడి ఆ ప్రదేశంలోని మృదులాస్థి క్రమేపీ దెబ్బతిని ఆస్టియో ఆర్థ్రయిటిస్ వచ్చే అవకాశముందని కూడా తేలింది. ఆరోగ్యవంతమైన యువతుల చేత 1.5 నుంచి 3.5 అంగుళాల ఎత్తుండే చెప్పులను వేయించి నడిపించి పరిశీలించినప్పుడు వాళ్ల మోకాళ్లు ముందుకు వంగిన కోణంలోకి మారిపోవటాన్ని పరిశోధకులు గమనించారు. ఇలాంటి యాంగిల్లో మోకాలిలోని కీళ్ల మీద ఎక్కువ భారం పడటంతో సదరు మహిళలు వృద్ధులు లేదా మోకాలి సమస్యలున్నవాళ్లలా తేడాగా నడవటం కనిపించింది. ఇలా మోకాళ్లలో చోటుచేసుకున్న మార్పు ఫలితంగా ఆస్టియో ఆర్థ్రయిటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని వారంటున్నారు. అంతేకాకుండా మోకాళ్ల నొప్పులతోపాటు వీపు నొప్పి, మెడ నొప్పులు కూడా బాధిస్తున్నాయని వైద్యులంటున్నారు. మడమ బంతి మీద నిలబడటం వల్ల స్కెలెటన్ స్థిరంగా ఉండలేదు. దాంతో అలైన్మెంట్ దెబ్బతింటుంది. ఫలితంగా శరీరంలోని కండరాలు, కీళ్లు శరీరాన్ని బ్యాలెన్స్ చేయటం కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంటుంది. ప్రతిరోజూ 3 అంగుళాల ఎత్తుండే హీల్స్ వేసుకునేవారు పాదంలోని అఖిలిస్ టెండాన్కి గాయమయ్యే 'టెండనైటిస్' సమస్యకు గురయ్యే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.