Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీకు పొట్ట అధికంగా ఉందా ? అయితే మీకు విటమిన్ 'డి' లోపం ఉన్నట్లే. అవును, మీరు విన్నది కరెక్టే. ఈ విషయం మేం చెప్పడం లేదు. సైంటిస్టులు తాజాగా చేసిన పరిశోధనలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. అధికంగా పొట్ట ఉన్నవారిలో విటమిన్ 'డి' తక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
నెదర్లాండ్స్ ఎపిడెమియాలజీ ఆఫ్ ఒబెసిటీ స్టడీ నుంచి వీయూ యూనివర్సిటీ మెడికల్ సెంటర్, లెయిడెన్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు డేటాను సేకరించారు. ఆ డేటాలో ఉన్న అనేక అంశాలను పరిశోధకులు పరిశీలించారు. 45 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు, పురుషుల్లో పొట్ట అధికంగా ఉన్న వారిలో విటమిన్ 'డి' లోపం ఉన్నట్లు వారు గుర్తించారు. కనుక పొట్ట అధికంగా ఉన్న వారు విటమిన్ 'డి' టెస్టు చేయించుకుని లోపం ఉంటే మందులను వాడడం లేదా విటమిన్ 'డి' ఉన్న ఆహారం తీసుకోవలని సైంటిస్టులు సూచిస్తున్నారు.
సాధారణంగా మనకు విటమిన్ 'డి' సూర్యకాంతి ద్వారా లభిస్తుంది. నిత్యం ఉదయాన్నే 20 నిమిషాల పాటు దేహానికి సూర్యకాంతి తగిలేలా చూడాలి. దీంతో శరీరంలో చర్మం కింద ఉండే కొవ్వులో విటమిన్ 'డి' తయారవుతుంది. ఇది మన శరీరంలోని ఎముకలకు, కండరాలకు అవసరం. అలాగే ఎముకల పెరుగుదలకు అవసరం అయ్యే కాల్షియం స్థాయిలను కూడా విటమిన్ 'డి' నియంత్రిస్తుంది. కనుక విటమిన్ 'డి' మనకు అత్యంత ఆవశ్యకం. ఇక ఇదే కాకుండా పుట్టగొడుగులు, కాడ్ లివర్ ఆయిల్, అవకాడో, గుడ్లు, నట్స్, చేపలు, నెయ్యి, క్యారెట్స్ తదితర ఆహారాలను తరచూ తీసుకుంటుంటే విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు.