Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాదం చీజ్ బిస్కెట్స్
కావలసిన పదార్థాలు: గోధుమపిండి - 2 కప్పులు, చీజ్ తురుము - 1కప్పు, బాదం - 1కప్పు(సన్నగా తురుముకోవాలి), పంచదార - పావుకప్పు, బట్టర్ - అర కప్పు ,పాలు - అర కప్పు, బేకింగ్ సాల్ట్: పావు టీస్పూన్
తయారు చేయు విధానం:
ఒక గిన్నెలో గోధుమపిండి, బట్టర్, ఫైన్ షుగర్, బేకింగ్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత చీజ్, బాదం తురుము కూడా అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులోనే పాలు వేసి మొత్తం మిశ్రమాన్ని పిండిని మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కలిపి పెట్టుకొన్న మిశ్రమాన్ని పోసి ఒక అంగుళం మందంగా ఒకే లెవల్లో పాన్ మొత్తం సర్ధాలి . ఇప్పుడు కుక్కీస్ కటర్ ఉపయోగించి పిండిని సమంగా కట్ చేసుకోవాలి. వీటిని బిస్కెట్ ట్రే లేదా బేకింగ్ ట్రేలోకి మార్చుకోవాలి. ఈ ట్రేను ఓవెన్లో పెట్టి 180 డిగ్రీల్లో 15-18నిముషాలు బేక్ చేసుకోవాలి. అంతే 15 నిమిషాల్లో నోరూరించే బాదం చీజ్ బిస్కెట్స్ రెడీ. పిల్లలకు ఇవి ఎంతో ఆరోగ్యకరమైన స్నాక్స్.
స్ట్రాబెర్రీ బిస్కెట్ పుడ్డింగ్
కావలసిన పదార్థాలు: స్ట్రాబెర్రీ: 2-4, బిస్కెట్లు(స్వీట్): 100గ్రాములు, వెన్న: 2టీస్పూన్స్, పంచదార పొడి: 6టీస్పూన్స్, కోడిగుడ్లు: 2, పాలు: 2కప్పులు, నిమ్మకాయలు: 2, క్రీమ్: అరకప్పు
తయారు చేయు విధానం:
ముందుగా స్ట్రాబెర్రీస్‌ను కట్ చేసి కొద్దిగా నీళ్ళుపోసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. అలాగే బిస్కెట్లను పొడిపొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత స్ట్రాబెరీ పేస్ట్, వెన్న, ఒక స్పూను పంచదార కలపాలి. అందులో బిస్కెట్ పొడి కూడా వేసి బాగా కలపాలి. బేకింగ్ పాన్‌లో ఈ పొడిని పోసి 10 నిమిషాలు బేక్ చేయాలి. మరో గిన్నెలో కోడిగుడ్లు పగలకొట్టి బాగా గిలక్కొట్టాలి. ఒక గిన్నెలో పాలు పోసి బాగా మరిగిన తర్వాత పంచదార, గుడ్డులోని తెల్లసొన వేసి కలియబెడుతూ రెండు నిమిషాలు ఉడికించి దించుకోవాలి.
వెన్న, పంచదార వేసిన క్రీమును పాలలో కలపాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. చివరకు నిమ్మరసం కలిపి బేకింగ్ టిన్‌లో పోసి రెండు గంటలు ఫ్రిజ్‌లో వుంచాలి. అంతే బిస్కెట్ పుడ్డింగ్ రెడీ. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
ఆలూ పన్నీర్ కోఫ్తా
కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు (చెక్కుతీసినవి) - 100 గ్రాములు, పన్నీర్ - 100గ్రాములు, ఉప్పు - 2 టీస్పూన్స్
పాలపొడి -1టీ స్పూన్, మిరియాల పొడి - 1 టీస్పూన్, ఎర్ర కారం - 1టీ స్పూన్, పచ్చిమిర్చి (సన్నగా తరిగిన) - 1టీ స్పూన్, కొత్తిమీర (సన్నగా తరిగిన) - 1టీ స్పూన్, మొక్కజొన్న పిండి -2 టీ స్పూన్స్ , నూనె - వేయించటానికి సరిపోయినంత
తయారు చేయు విధానం:
ఉడికించిన బంగాళదుంపలను ఒక బౌల్లో తీసుకోవాలి. ఇందులో పన్నీర్ వేసి బాగా కలపాలి. ఉప్పు, పాలపొడి, మిరియాలపొడి, ఎండుకారం, మొక్కజొన్న పొడి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా తీసుకుని..కోఫ్తాలుగా చేసుకోవాలి. ఒక ప్లేట్లో మొక్కజొన్న పిండిని కోటింగ్‌లా రాయండి. కోఫ్తాలపై కూడా ఈ పిండిని రాయండి. ఆ తర్వాత కోఫ్తాలను ఫ్రిజ్‌లో అరగంట పెట్టాలి. స్టావ్పై బాణలి పెట్టి వేయించడానికి సరిపోయే నూనె పోయాలి. నూనె కాగిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న కోఫ్తాలను ఒకదాని తర్వాత మరొకటి వేసి వేయించాలి. రెండు వైపులా గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి బయటకి తీయాలి. వేడివేడిగా పుదీనా చట్నీతో కలిపి తింటే చాలా బాగుంటాయి.
గ్రిల్డ్ ఆమ్లెట్ శాండ్విచ్
కావలసిన పదార్థాలు: పుదీనా చట్నీ తయారు చేసుకోవడానికి కావల్సినవి: పుదీనా ఆకులు - 2 కప్పులు, కొత్తిమీర - 1 కప్పు, పచ్చిమిర్చి - 2, వెల్లుల్లి - 3,4రెబ్బలు, అల్లం- చిన్న ముక్క, నిమ్మరసం - 1టీ స్పూన్, పంచదార- 1 టీ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నీళ్ళు - కప్పు, గ్రిల్డ్ ఆమ్లెట్ శాండ్విచ్ తయారీకి కావల్సినవి, బ్రెడ్ స్లైస్ - 3, చీస్ స్లైస్ - 2, మింట్ చట్నీ - 1టేబుల్ స్పూన్, గుడ్లు - 4, ఉప్పు : రుచికి సరిపడా, బ్లాక్ పెప్పర్: రుచికి సరిపడా, పుదీనా చట్నీ తయారు చేయు విధానం: ,చట్నీకోసం సిద్ధం చేసుకున్న పదార్థాలన్నింటనీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ చట్నీని ఫ్రిజ్‌లో పెడితే, రెండు రోజుల పాటు నిల్వ ఉంటుంది.
గ్రిల్డ్ ఆమ్లెట్ శాండ్విచ్ ను తయారు చేయు విధానం :
ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని, అందులో ఉప్పు, పెప్పర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఫ్రైయింగ్ పాన్‌ను స్టౌ మీద పెట్టి ఎగ్ మిశ్రమాన్ని పోయాలి. పాన్‌లో ఎగ్ మిశ్రమం ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ అవ్వాలి. సన్నని మంటలో ఎగ్ ఆమ్లెట్ కాలుతుండగా, దాని మీద బ్రెడ్ స్లైస్ పెట్టాలి. ఆమ్లెట్ కాలిన తర్వాత ఆమ్లెట్‌తో బ్రెడ్ స్లైస్‌ను ఫోల్డ్ చేసి అన్ని ప్రక్కలా కవర్ చేయాలి. రెండు, మూడు నిముషాలు ఉడికించి తర్వాత పాన్‌లో నుండి దీన్ని తొలగించాలి. ఇప్పుడు బ్రెడ్ మీద చీజ్ అప్లై చేయాలి. తిరిగి సైడ్స్‌లో ఆమ్లెట్‌తో కవర్ చేయాలి.
ఆ తర్వాత మరో రెండు బ్రెడ్ స్లైస్ తీసుకుని, దాని మీద పుదీనా చట్నీని అప్లై చేయాలి. పుదీనా రాసిన బ్రెడ్ శాండ్విచ్ను ఆమ్లెట్ లోపల ఉన్న బ్రెడ్ స్లైస్ మీద ఉంచాలి. తిరిగి అన్ని పక్కల ఆమ్లెట్ తో కవర్ చేయాలి. ఈ మూడు బ్రెడ్ స్లైస్ విత్ ఆమ్లెట్ తో గ్రిల్డ్ చేయాలి. గ్రిల్ చేసిన తర్వాత బ్రెడ్ స్లైస్ ను ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసి, వేడి వేడిగా పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి. అంతే వేడివేడి ఆమ్లెట్ శాండ్విచ్ రెడీ..