Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్ని క్రీములు వాడినా మొటిమల బాధ తగ్గడంలేదా? మొటిమల నుంచి విముక్తి పొందడానికి పదే పదే ముఖం కడుక్కుంటున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభంలేకుండా పోతుందా? మొటిమలు రావడానికి జిడ్డు, దుమ్ము, ధూళి మాత్రమే కారణాలనుకుంటే పొరపాటు. మనం తీసుకునే విటమిన్ 'బి-12' వల్ల కూడా మొటిమలు వస్తాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఎంజిలిస్ శాస్త్రవేత్తలు అంటున్నారు. ''ఈ పరిశోధనా ఫలితాల్ని చూసిన తరువాత చాలామందికి విటమిన్ 'బి12' ఆరోగ్యానికి మంచిది కాదనే భావన కలుగుతుంది. కానీ అది నిజం కాదు. ఆ విటమిన్ శరీరానికి చాలా అవసరం'' అని శాస్త్రవేత్త లీ హుయీంగ్ అన్నారు. ''ముఖం మీద ఎప్పుడూ ఓ బ్యాక్టీరియా ఉంటుంది. తిన్న ఆహారం జీర్ణం కావడానికి పేగులోని బ్యాక్టీరియా ఏ విధంగా సహాయపడుతుందో అదేవిధంగా ఫేషియల్ బ్యాక్టీరియా ముఖం కాంతివంతం కావడానికి ఉపయోగపడుతుంది'' అని ఆయన అంటున్నారు.
కానీ మనం తీసుకునే విటమిన్ 'బి-12' వల్ల ఈ బ్యాక్టీరియ క్షీణిస్తుంది. తద్వారా ముఖంపై దుమ్ము, ధూళి పడినప్పుడు మొటిమలు వస్తాయి. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు మొటిమలులేని ఆరోగ్యవంతమైన మహిళలను ఎంచుకున్నారు. వాళ్లకి ఒక వారంపాటు విటమిన్ 'బి-12' ని అదనంగా అందించారు. వాళ్లలో చాలామందికి వారంలోపులోనే మొటిమలు వచ్చాయి. అప్పుడు మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాని తీసుకొని దానికి అదనంగా విటమిన్ 'బి-12' చేర్చారు. దాంతో మొటిమలకి కారణమైన బ్యాక్టీరియా సంఖ్య పెరిగిందని పరిశోధనలో వెల్లడైంది.