Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలబంద వల్ల చర్మానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలిసిన విషయమే. అయితే కలబంద సబ్బును ఎప్పుడైనా వాడారా? మార్కెట్లో లభించే ఖరీదైన సబ్బులకు బదులు కలబంద సబ్బును వాడితే మరెన్నో లాభాలు. మరి ఈ కలబంద సోపును భయట మార్కెట్లో కాకుండా మన ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు: ఒక కిలో కలబంద సబ్బు తయారు చేసుకోవడానికి 110 గ్రాముల కలబంద గుజ్జు, 110 మిల్లీ లీటర్ల కాస్టిక్ సోడా (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది), 750 మిల్లి లీటర్ల ఆలివ్ ఆయిల్, 250 మిల్లి లీటర్ల నీరు, ఎస్సేన్శియాల్ ఆయిల్
తయారీ విధానం: నీటిని వేడి చేసి, ప్లాస్టిక్ డబ్బాలో పోయండి. దీనికి కాస్టిక్ సోడా పోసి బాగా కలపండి. ఈ మిశ్రమం చల్లబడటానికి కనీసం ఒక గంట సేపు అలాగే ఉంచండి. ఈ పద్ధ్దతిని గాలి వీచే ప్రాంతంలో చేయటం మంచిది. సబ్బు తయారు చేసే ముందు గ్లౌస్‌ను ధరించండి. మిశ్రమం చల్లారే లోపు చెంచా లేదా చాకు సహాయంతో కలబంద ఆకుల నుండి తాజా గుజ్జును వేరు చేయండి. ఈ గుజ్జు జెల్ రూపంలో మారే వరకు గ్రైండ్ చేయండి. ఆలివ్ ఆయిల్‌ను కొద్దిసేపు మైక్రోవేవ్‌లో ఉంచండి. కాస్టిక్ సోడా కలిపిన నీటికి ఆలివ్ ఆయిల్‌ను కలిపి బాగా కలపండి. మిశ్రమం మందంగా మారే వరకు కలుపుతూనే ఉండండి. తరువాత దీనికి కలబంద గుజ్జును కలిపి, బాగా కలపండి. లావెండర్ ఆయిల్, రోజ్ వాటర్ వంటి ఆయిల్ లను కలపటం వలన మిశ్రమం సువాసనను వెదజల్లుతుంది.ఇలా సిద్ధం అయిన మిశ్రమాన్ని అచ్చు ఉన్న లోతు తక్కువగా ఉన్న మూసాలో పోసి ఉంచి, ఒక రోజు వరకు ఆలాగే వదిలివేయండి. మరుసటి రోజు, ఘన రూపంలోకి మారిన కలబంద సబ్బును ముక్కలుగా కత్తిరించవచ్చు. ఈ ముక్కలను15 నుండి 30 రోజుల వరకి అలాగే ఉంచటం వలన గట్టి పడతాయి. తర్వాత ఉపయోగించుకోవచ్చు.