Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జ్వరం, దగ్గు, గాయం... ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ... మనసుకు అయ్యే గాయాలనే పట్టించుకోం. మహిళల భావోద్వేగాలను కేవలం... హార్మోన్ల అసమతుల్యతగా చూస్తున్నాం. అదొక్కటే కాదు అనేక కారణాలు మహిళలపై మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఇది చాలా తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. మానసిక ఆందోళన డిప్రెషన్‌గా మారుతోంది. డిప్రెషన్ కాస్తా
ఆత్మహత్యకు దారి తీస్తోంది. ఇంత తీవ్రమైన మానసిక ఆందోళనను పట్టించుకోవడం లేదు మహిళలు. దీనికోసం డాక్టర్ దగ్గరకు వెళితే... ఏమనుకుంటారోనని జంకుతున్నారు. అన్ని అనారోగ్యాల్లాగే ఇదో అనారోగ్యం... దాని గురించి తెలుసుకోవడం సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. నేడు ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగానైనా వీటి గురించి
మాట్లాడుకుందాం...
ప్రపంచంలో సుమారు యాభై కోట్లమంది రకరకాల మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు. వీరిలో సగానికి పైగా మహిళలే. చాలామంది గుర్తించలేరు గానీ ప్రతీ నలుగురిలో ఒకరు, జీవితంలో ఏదో ఒక దశలో, ఏదో ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. మానసిక వ్యాధుల్లో ఎక్కువమందిని వేధించేది డిప్రెషన్ కాగా స్క్రీజోఫీనియా, బైపోలార్ డిజార్డర్ వంటివి తరువాతి స్థానాల్లో ఉన్నాయి. చాలామంది మహిళలు తమ మానసిక వ్యాధుల గురించి బయటకు చెప్పడం లేదు. దీంతో ఏటికేడు మహిళల్లో ఈ తరహా సమస్యలు పెరుగుతున్నాయి.
డిప్రెషన్‌కి దారి...
ఒక పక్క ఇంటి బాధ్యతలు, మరో పక్క ఉద్యోగం. రెండింటిలోనూ మహిళలు నెగ్గుకువస్తున్నా, ఆ పోరాటంలో వారి మీద ఒత్తిడి అంతకంతకూ పెరిగిపోతోంది. అది వారి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతోంది. మానసిక సమస్యలను సృష్టిస్తోంది. ఈ విషయాన్నే ప్రతిబింబిస్తోంది నేషనల్ హెల్త్ సర్విస్ జరిపిన ఓ పరిశోధన. ఈ సంస్థ ప్రతి ఏడేళ్లకోసారి దేశంలోని పౌరుల మానసిక స్థితిగతుల మీద ఓ నివేదికను రూపొందిస్తూ వస్తోంది. అలా తాజాగా రూపొందిన నివేదికలో పురుషులతో పోలిస్తే మహిళల మానసిక ఆరోగ్యం చాలా ఆటుపోట్లలో ఉన్నట్లు తేలింది. ఉదాహరణకు 16-24 వయసు మధ్యగల స్త్రీలలో 26 శాతం మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఇందులో 14 శాతం మహిళలు ఒత్తిడి నుంచి నిదానంగా డిప్రెషన్లోకి జారుకుంటున్నారు. 4 శాతం మహిళలు తీవ్రమైన బైపోలార్ డిజార్డర్‌ను ఎదుర్కొంటున్నారు. ఇక 10 శాతం మహిళలు మాత్రమే చికిత్సను తీసుకుంటున్నారు. డిప్రెషన్లోకి వెళ్లి తమకు తాము హాని కలిగించుకుంటున్నవారి సంఖ్య 19 శాతానికి చేరుకుంది.
అన్నింటా ఆందోళనే...
పొద్దున లేవగానే పిల్లలను స్కూల్‌కు పంపించాలన్న టెన్షన్. తరువాత ఆఫీస్‌కు బయల్దేరాలి. కాస్త లేటయినా బాస్‌తో తిట్లు పడాల్సి వస్తుందేమోనని బాధ. ట్రాఫిక్ జామ్ కూడా టెన్షన్. వివిధ వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక, వ త్తిపరమైన, భావోద్వేగపరమైన అంతరాలు సైతం ఒత్తిడికి కారణమవుతున్నాయి. ఇక పనిచేసే పరిస్థితులలో ఒత్తిడి పెరిగిపోవడం, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు కూడా మహిళలను కుంగుబాటుకి లోను చేస్తున్నాయి. ఇక ఇంట్లోనే ఉండే మహిళలయితే... రకరకాల ఆలోచనలు. రోజువారీ ఘటనలు వీరిలో ఒత్తిడిని పెంచుతున్నాయి.
గుర్తింపు లేకపోవడం...
సాధారణంగా ఉద్యోగం చేసే మహిళలలో ఒత్తిడి ఎక్కువగా వుంటుంది అనుకుంటారు. ఇంటికే పరిమిత మయిన మహిళలలోనే ఒత్తిడి ఎక్కువ అని తేలింది. తను చేసే పనికి తగిన గుర్తింపు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలాంటివారికి చిన్న పాటి ప్రశంస మహిళల మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ గృహిణులకు ఆ ప్రశంస దొరకటం కష్టంగా ఉంది. ఉద్యోగినులకి అయితే శ్రమకి తగిన వేతనం, పదోన్నతులు, ప్రశంసలు వంటివి వుంటాయి. కాని గృహిణులుగా ఎంత బాధ్యతతో వున్నా వారికి చిన్నపాటి గుర్తింపు కూడా ఉండదు. వారు చేసే పనిని కూడా ఎవరు గుర్తించరు. దానితో పనికి గుర్తింపు లేకపోవటం అన్నది వారిని చాలా మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. ఉమ్మడి కుటుంబాలలో ఉండే మహిళలలో ఈ ఒత్తిడి మరింత అధికంగా వుంది. ఇక సమాజం నుంచి నానాటికీ పెరిగిపోతున్న ఒత్తిడి ఎలాగూ ఉంది. టీవీ, సినిమా, సోషల్ మీడియాలతో ఒంటరితనం తగ్గుతున్నట్లు అనిపించినా... వాటిలో చూస్తున్న ద శ్యాలు, ఎదుర్కొంటున్న కామెంట్లు ఉన్న కాస్త మనశ్శాంతినీ దూరం చేస్తున్నాయి.
పోషకాహార లేమి...
ఇవి మాత్రమే కాదు... మహిళల మానసిక ఆరోగ్యం మీద పోషకాహార ప్రభావం చాలా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉండడానికి మహిళలు అధిక పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. న్యూట్రిషనల్ న్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురించిన సర్వే ప్రకారం... పోషకాహారం తక్కువగా తీసుకునే మహిళలు, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించని మహిళలు మానసికంగా తక్కువ ఉత్సాహంతో ఉన్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం మనం తీసుకునే డైట్లో ఎనర్జీ అధికంగా ఉంటోంది. కానీ వాటిలో మెదడు పనితీరుకు కావాల్సిన పోషకాలు మాత్రం ఉండట్లేదు. పురుషులతో పోల్చినప్పుడు మహిళలు సామాజిక, భావోద్వేగాలను ఎక్కువగా మోస్తున్నారు. అందుకే మహిళల్లో మెదడు ఎక్కువగా అలసిపోతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గటం, హార్మోన్ల అసమతుల్యతతో పాటు అనేక సమస్యలు వస్తాయి.
హింస ప్రభావమూ...
మన దేశంలో 16 నుండి 50 శాతం వరకూ స్త్రీలపై పలు రకాలుగా హింస జరుగుతోంది. ప్రతి ఐదుగురిలో ఒక మహిళ జీవితంలో కనీసం ఒక్కసారైనా అత్యాచారానికిగానీ, అత్యాచార
యత్నానికిగానీ గురవుతోంది. దీనివల్ల వారిలో ఒత్తిడి పెరిగి, జీవితంలో స్థిరత్వాన్ని కోల్పోతున్నారు. రుతుస్రావం, హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి అంశాలే కాకుండా అనేక సామాజికాంశాలు సైతం మహిళల మానసిక ఆరోగ్యం ప్రభావం చూపుతున్నాయి.
- మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీతో మీరు కొంత సమయం గడపండి. మీకోసం మీరు ఆలోచించటం మొదలు పెట్టండి. ఎప్పుడు అయితే మీ గురించి మీరు ఆలోచించటం మొదలు పెడతారో , ఆత్మవిశ్వాసం మీ స్వంతం అవుతుంది . అప్పుడు బయట వ్యక్తుల ప్రశంసల కోసం ఎదురు చూడరు . వారినుంచి ప్రశంస దొరికినా , లేకపోయినా కూడా ఆనందం గానే వుంటారు. ఈ చిన్న విషయాన్ని గమనిస్తే చాలు మానసిక సమస్యలకి చెక్ పెట్టినట్టే!
- చాలా పనులు చేయాల్సి ఉంటుంది. కానీ మన దగ్గర ఉన్న సమయం చాలా తక్కువ. అట్లాంటప్పుడు సైతం ఒత్తిడి పెరుగుతుంది. ఇది మనసు మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పనులను ప్రాధాన్యాన్ని బట్టి విభజించుకోండి. ముఖ్యమైన, అత్యవసరమైన పనులకు ముందు సమయం కేటాయించండి. తరువాత మిగిలిన పనులు చేయండి. దీంతో ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతుంది.
- ఆరోగ్యకరమైన జీవనశైలి. మానసిక, శారీరక ఆరోగ్యం చాలా అవసరం. కాబట్టి, మీరు రెగ్యులర్‌గా శారీరక వ్యాయామం చేయండి. ఇది మంచి నిద్రకు ఉపకరిస్తుంది. మంచి నిద్ర మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
- మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేసుకోండి. మనసులోనే పెట్టుకుని ఆందోళనకు గురయి అనవసర ఇబ్బందులను తెచ్చుకోండి. రోజుకో, వారానికో కొంత సమయాన్ని మీకు ఇష్టమైన వ్యాపకానికి కేటాయించండి. మన జీవన శైలి... అనేకానేక ఆందోళనలకు కారణం.. కాబట్టి జీవనశైలిలో మార్పు చేసుకోండి.
- అనివార్యమయితే తప్ప.. ఒత్తిడికి లోను చేసే పరిస్థితుల నుంచి దూరంగా ఉండండి. సరైన ఆహారం, తగిన వ్యాయామం, తరచూ ధ్యానం చేయండి. సామాజిక బంధాలను ద ఢంగా ఉంచుకోండి. అందుకే మహిళలు రోజులో కొంత సమయాన్ని తమకు ఇష్టమైన పనులు, వ్యాపకాల కోసం కేటాయించాలి. ఈ విషయంలో ఇతర కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకం.మనసులోని అలజడి అదుపు తప్పినట్లు తోస్తే తప్పకుండా వైద్యుని సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకోవాలి. అన్ని అనారోగ్యాల్లాగే ఇదో అనారోగ్యం... దాని గురించి తెలుసుకోవడం సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.
- డాక్టర్ హాసిని యాదవ్
మదర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేటర్