Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మేడమ్, నాపేరు సౌమ్య.చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది. అప్పటి నుండి నన్ను, అన్నయ్యను నాన్న కష్టపడి పెంచాడు. మా ఇద్దరికీ పెండ్లి చేసిన మూడు సంవత్సరాలకు నాన్న కూడా చనిపోయాడు. ఇప్పుడు నా విషయాలన్నీ అన్నయ్యే చూసుకుంటాడు. నా పెండ్లి జరిగి ఇప్పటికి పది సంవత్సరాలు. మా వారి పేరు శివయ్య. మాకు ఇద్దరు అబ్బాయిలు. పిల్లలు చదువుకుంటున్నారు. ఆయన కరెంటు పని చేస్తాడు.
ఇప్పుడు సమస్యంతా మా వారితోనే. ఆయన ఇంటి గురించి అస్సలు పట్టించుకోడు. ఇంటి ఖర్చులకు డబ్బులు ఇచ్చినట్టే ఇస్తాడు. ఇచ్చిన గంట తర్వాత వచ్చి 'నా డబ్బులు నాకు ఇచ్చెరు' అంటాడు. ఇవ్వక పోతే గోల చేస్తాడు. ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు. వచ్చిన డబ్బులన్నీ ఆయన జల్సాలకే ఖర్చుచేస్తాడు.
పిల్లలను ప్రేమతో దగ్గరకు తీసుకోడు. వాళ్ళతో అస్సలు మాట్లాడడు. ఆయన అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే నన్నూ, పిల్లల్ని విపరీతంగా కొడతాడు. తాగినపుడు ఏం చేస్తాడో ఆయనకే తెలీదు. తెలిసిన వాళ్ళ ద్వారా మా అన్నయ్య ఆయనకు ఉద్యోగం ఇప్పించాడు. ఆ ఉద్యోగానికి కూడా సరిగా వెళ్ళడు. తాగడానికి డబ్బులు లేకపోతే అప్పులు చేస్తాడు. నేను మిషన్ కుడతాను. వచ్చిన డబ్బులు జాగ్రత్త చేసి ఇంటి ఖర్చులకు వాడుతుంటాను. ఇప్పుడు రెండు నెలల నుండి ఆయన అసలు పనికే వెళ్ళడం లేదు. ఇంటి అద్దె కట్టలేదని ఓనర్ ఇల్లు ఖాళీ చేయని గోల చేస్తుంది. మా అత్తమామలకు చెబితే వాళ్ళూ పట్టించుకోవడం లేదు.
అందుకే ప్రస్తుతం నేను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. అక్కడకు వెళ్ళిన దగ్గర నుంచి వదిన సూటి పోటి మాటలు అంటుంది. ఈయన ఇలాగే ఉంటే పిల్లల భవిష్యత్ ఏం కావాలి? నా స్నేహితురాలు సుజాత చెబితే మీ దగ్గరకు వచ్చాను. అంతకు ముందు వాళ్ళ అక్క భర్త కూడా ఇలాగే చేస్తుంటే మీ దగ్గరకే వచ్చారంటా. మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళు బాగానే ఉంటున్నారని చెప్పింది. అందుకే మీ దగ్గరకు వచ్చాను. మీరు ఎలాగైనా మా ఆయనతో మాట్లాడి తాగుడు మాన్పించండి. మా కాపురం నిలబెట్టండీ' అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.
సౌమ్య చెప్పింది మొత్తం విన్న లీగల్‌సెల్ సభ్యులు శివయ్యను రమ్మనమని లెటర్ పంపారు. తర్వాతి వారం అతను వచ్చి 'మేడమ్ నన్ను ఈ మధ్య ఉద్యోగం నుండి తీసేశారు. అందుకే ఇంట్లో డబ్బులు ఇవ్వలేకపోతున్నా. తెలిసిన వాళ్ళు ఆఫీస్‌లో మాట్లాడుతున్నారు. మళ్ళీ పనిలోకి వెళతాను. సౌమ్యకు, పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా' అన్నాడు.
'సౌమ్యను, పిల్లల్ని బాగా చూసుకుంటానంటున్నావు. మంచి విషయమే. మరి తాగుడు సంగతేంటి. నువ్వు రోజూ తాగుతూ ఉంటే మీ పిల్లల జీవితం ఏం కావాలి. వాళ్ళను చదివించి మంచి భవిష్యత్ చూపాల్సిన బాధ్యత తండ్రిగా నీకుంది. కానీ నువ్వు ఇలా రోజూ తాగుతూ, గొడవ చేస్తుంటే రేపు నీ పిల్లలు ఎలా తయారవుతారు? తాగుడు వల్ల నీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఇలాగే చేస్తుంటే నీ భార్యకు కూడా నీపై ప్రేమ ఉండదు. నీకేమైనా అయితే పట్టించుకునే వాళ్ళు ఉండరు.
కాబట్టి నువ్వు ముందు తాగుడు మానుకో. అప్పుడే నీ భార్యా పిల్లలు సంతోషంగా ఉండేది. ముందు నువ్వు మారాలి. ఇకపై నువ్వు ఇలాగే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే మీ ఆవిడ పోలీస్ స్టేషన్లో కేసుపెడతానంటోంది. ఆమె కేసుపెడితే మీ అమ్మవాళ్ళకు కూడా ఇబ్బందే. పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగలేక అల్లాడతారు. అనవసరంగా సమస్యను పెద్దది చేసుకోవద్దు. చెప్పింది అర్ధం చేసుకుని తాగుడుమానుకో, బుద్దిగా ఉద్యోగం చేసుకో. పిల్లల్ని బాగా చదివించు' అన్నారు.
'మీరు చెప్పినట్టే తాగుడు మానుకుంటా, బాధ్యతగా ఉంటా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టవద్దు. నా ఉద్యోగం గురించి సౌమ్య వాళ్ళ అన్నయ్యను కాస్త సాయం చేయమనండి. ఆయన చెబితే పోయిన ఉద్యోగం కచ్చితంగా వస్తుంది' అని బతిమలాడుకున్నారు.
'నువ్వు మారావని నమ్మకం వస్తే నీ బావ నీకు కచ్చితంగా సాయం చేస్తాడు. నీ వల్ల చెల్లెలు కష్టాలు పడుతుందని అతనికి నీపై కోపం. నీకు ఉద్యోగం ఇప్పించింది అతనే కదా..! చెల్లెలి కాపురం బాగుండాలనే కదా, నీన్ను ఉద్యోగంలో చేర్పించాడు. తల్లిదండ్రులు లేని సౌమ్యను ప్రేమగా చూసుకోవల్సింది పోయి కష్టాలు పెడుతున్నావు. ఏది ఏమైనా నువ్వు మంచిగా ఉంటావనే నమ్మకం వస్తే అతను నీకు కచ్చితంగా సాయం చేస్తాడు' అని శివయ్యకు లీగల్‌సెల్ సభ్యులు సమాధానం చెప్పి మళ్ళీ వచ్చే వారం వాళ్ళ అమ్మను తీసుకురమ్మని చెప్పి పంపించారు.
తర్వాతి వారం శివయ్య తల్లి వచ్చి 'మా శివ చాలా మంచోడు. వాడికి తాగుడు ఒక్కటే చెడ్డ అలవాటు. దాని వల్ల వాడి ఆరోగ్యం పాడైపోతుంది. ఎంత చెప్పినా మా మాట వినడు. వాడి భార్య ఎప్పుడూ అలిగి అన్న దగ్గరకు వెళ్ళి కూర్చుంటుంది. పిల్లల్ని మా దగ్గరకు రానీయదు. నా వల్ల వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పుడప్పుడు నా మనవళ్ళను నా దగ్గరకు పంపమని చెప్పండి. వాళ్ళ చదువులకు సాయం చేస్తాను' అంటూ శివయ్య తల్లి బాధగా చెప్పింది.
ఆమె చెప్పింది విన్న లీగల్ సభ్యులు 'తాగుడు తప్ప మీ వాడు మంచి వాడని మీరంటున్నారు. తాగుడే తన సమస్యలకు అసలు కారణం. ఎప్పుడూ తాగుతూ అల్లరి చిల్లరిగా ఉండే భర్తను ఏ భార్యాయినా ఎలా భరిస్తుంది? మీరు మీ అబ్బాయికి గట్టిగా చెప్పడం లేదని ఆమెకు మీపై కోపంగా ఉండొచ్చు. సౌమ్యతో మేం మాట్లాడతాం. మీరు బాధపడకండి. పిల్లల్ని మీ దగ్గరకు అప్పుడప్పుడు పంపించమని చెబుతాం. అయితే మీరు కొడుకును ప్రతి విషయాల్లో వెనకేసుకు రాకండి. మీ అండ చూసుకొని అతను ఇంకా రెచ్చిపోతాడు. బాధ్యత తెలియకుండా తయారయ్యాడు. మేము మీ అబ్బాయితో మాట్లాడాం. తాగుడు మానేస్తానన్నాడు. భార్యా పిల్లల్ని ప్రేమగా చూసుకుంటానన్నాడు. వాళ్ళు సంతోషంగా ఉండటానికి మీరు కూడా మీ వంతు సాయం చేయండి' అని ఆమెకు నచ్చజెప్పారు.
తర్వాత సభ్యులు సౌమ్యను లోపలికి పిలిచి 'నీ భర్త ఇక నుండి నీతో పిల్లలతో ప్రేమగా ఉంటానని నీ ముందే చెప్పాడు. తాగుడు కూడా మానేస్తానన్నాడు. రోజూ పనికి వెళతానన్నాడు. ఈ విషయాలన్నీ రాసి అతనితో సంతకం చేయిస్తాం. ఇకమీదట నీకేమైనా సమస్య వస్తే మా దగ్గరకు వచ్చి చెప్పు. నువ్వు మాత్రం గొడవలు పెట్టుకోవద్దు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పిల్లల్ని వాళ్ళ నాయనమ్మ దగ్గరకు పంపాలి. నీకు కష్టం వస్తే నువ్వు నీ అన్న దగ్గరకు వెళుతున్నావు. వదిన నిన్ను పట్టించుకోవడం లేదని ఎంత బాధపడుతున్నావు. మరి నువ్వు నీ అత్తగారి పట్ల ఎలా ఉంటున్నావు. నువ్వు బాధపడినట్టే వాళ్ళూ బాధపడతారు. నీ భర్తపై కోపాన్ని వాళ్ళపై చూపిస్తున్నావు. అది నీ పిల్లల భవిష్యత్‌కు మంచిది కాదు. వాళ్ళతో మంచిగా ఉండు. అప్పుడే సంబంధాలు నిలబడతాయి. ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. అంతేగాని ప్రతిదానికి అలిగి అన్న దగ్గరకు వెళ్లడం మంచిది కాదు' అన్నారు.
లీగల్‌సెల్ వారు చెప్పిందంతా విన్న సౌమ్య 'ఇకపై మీరు చెప్పినట్లే చేస్తాను. ఆయన మంచిగా చూసుకుంటే చాలు' అని చెప్పి భర్తతో కలిసి వెళ్ళిపోయింది.
మళ్ళీ పదిహేను రోజుల తర్వాత సౌమ్య లీగల్‌సెల్‌కు వచ్చి 'మేడమ్ ఇప్పుడు మా ఆయన ఉద్యోగంలో చేరాడు. తాగుడు కూడా చాలా వరకు తగ్గించాడు. పిల్లలతో కూడా మంచిగానే ఉంటున్నాడు. వాళ్ళను స్కూల్‌కి ఆయనే తీసుకెళుతున్నాడు. చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మీ వల్లనే జరిగింది. మళ్ళీ ఏదైనా సమస్య వస్తే మీ దగ్గరకే వస్తాను. నన్ను మీ దగ్గరకు పంపిన నా స్నేహితురాలికి, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను' అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోయింది. డియర్ రీడర్స్..
కుటుంబ సమస్యలు తీర్చే న్యాయసలహా కేంద్రంగా ఐద్వా లీగల్ సెల్ పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. వారంవారం ఐద్వా సెల్లో జరిగే కౌనెల్సింగ్ విషయాలను ఐద్వా అదాలత్‌లో పాఠకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కథనాలు ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతాయని భావిస్తున్నాం.
ఐద్వా అదాలత్ పై మీ అభిప్రాయాలు
వాట్సాప్ నెంబర్ : 9490098024 లేదా manavi@navatelangana.com
కు తెలియచేస్తారని ఆశిస్తూ..