Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్య కాలంలో 'ఇండక్షన్ స్టౌ'లు విరివిగా మార్కెట్ లోకి వస్తున్నాయి. రావడం మాత్రమే కాదు వీటి వాడకం కూడా క్రమంగా పెరుగుతున్నది. ముఖ్యంగా నగరాల్లో వీటి వాడకం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ స్టౌల వాడకం ఎలాగో తెలుసుకుందాం...
- వీలైనంత వరకు ఇండక్షన్ స్టౌను చెక్క టేబుల్ మీదే పెట్టడం మంచిది. అంతే కాదు సిరామిక్ టైల్స్, సిమెంట్ ఫోర్ పైన కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ స్టౌ ని మెటల్ టేబుల్ మీద మాత్రం పెట్టకూడదు. దీనివల్ల షాక్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
- ఇండక్షన్ స్టౌ మీద వంట పాత్రను పెట్టగానే రెండింటికీ మద్య ఉన్న అయస్కాంత ప్రభావం వల్ల ఒకదానికొకటి అతుక్కోవాలి. అప్పుడే అది స్టౌకి సరిపోయే పాత్ర అవుతుంది. కొందరు ఇండక్షన్ స్టౌని సైతం గ్యాస్ స్టౌ పక్కనే పెడుతుంటారు. దీని వల్ల సాధారణ సందర్భాల్లో ఎటువంటి నష్టం కలగదు. కానీ ఎప్పుడైనా పొరపాటున గ్యాస్ లీకైతే మాత్రం ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
- ఇండక్షన్ స్టౌను రేడియోలు, టీవీలు, కంప్యూటర్లకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే అయస్కాంత క్షేత్రప్రభావం వల్ల అవి పాడయిపోయే అవకాశాలున్నాయి.
- ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్సెటెన్షన్ ప్లగ్ బాక్సులకు ఇండక్షన్ స్టౌ ప్లగ్‌ని అనుసంధానించకూడదు.
- మనలో చాలా మందికి ఉన్న అలవాటు ఇంట్లో ఉన్న సామాన్లను అంతటినీ సబ్బుతో రుద్దిరుద్ది తోమడం. అదే పనిని ఇండక్షన్ స్టౌ విషయంలో చేస్తామంటే కుదరదు. అలా చేయకూడదు. అలా చేస్తే అది పాడైపోయే ప్రమాదం ఉంది. నీటిని ఉపయోగించకుండా మెత్తని వస్త్రంతో మాత్రమే దీనిని తుడవాలి.
- స్టౌకి ఉన్న రంధ్రాల్లో దుమ్ము, ధూళి చేరకుండా చూసుకోవాలి. స్టౌకి ఏమైనా పగుళ్లు వచ్చినట్లనిపిస్తే దానిని ఉపయోగించకూడదు. అలాగే స్టౌకి దగ్గరలో ఎలాంటి లోహసామాగ్రిని ఉంచకూడదు.