Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నారుల కోసం ఎంత ఖరీదైన కాస్మొటిక్స్నైనా తీసుకొస్తారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న చాలా ఉత్పత్తులు రసాయనాలతో నిండి ఉంటున్నాయి. ఇవి పిల్లల చర్మపు మృదుత్వాన్ని సంరక్షించకపోగా, చర్మం పొడిబారిపోయి ఒక్కోసారి దురద, బొబ్బలు వచ్చేలా చేస్తాయి. పెద్దవాళ్లతో పోలిస్తే పసిపిల్లల చర్మం సహజంగానే మరీ సున్నితంగా ఉంటుంది. దాన్ని కాపాడే విషయంలో ఎవరైనా ప్రత్యేక శ్రద్ధ వహించాల్పిందే! కాకపోతే, వాళ్ల కోసం వాడే నూనెలు గానీ, క్రీములు గానీ, షాంపూలు, సబ్బులు గానీ సురక్షితమైనవై ఉండాలి. ఒకవేళ అవి రసాయనాలతో ఉంటే వారి చర్మాన్నే కాదు శరీరంలోని అంతర భాగాల్ని కూడా దెబ్బ తీసే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రకృతి సహజమైన ఉత్పత్తు లనే పిల్లల కోసం వాడాలంటున్నారు నిపుణులు.
కలబందలో యాంటీ- ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మం మీద వచ్చే బొబ్బలు, దురద సమస్యల్ని తగ్గిస్తాయి. వట్టివేరులో బ్యాక్టీరియాకు, ఫంగస్‌కు వ్యతిరేకంగా పనిచేసే మూలకాలు చాలా ఎక్కువ. దురద మంటలతో పాటు రక్తస్రావం కాకుండా ఆపే గుణాలు కూడా ఎక్కువే. అందువల్ల వట్టివేరుతో తయారు చేసిన ఏ ఉత్పత్తి అయినా, పిల్లల్ని చర్మ సమస్యల నుంచి కాపాడుతుంది. శనగలు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రం చేయడమే కాకుండా, చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. శనగల ఆధారంగా తయారు చేసిన షాంపూలైతే, పిల్లల జుట్టును కాంతివంతంగా మారుస్తాయి. వావిలాకులో కూడా బ్యాక్టీరియాను, ఫంగస్‌ను నశింపచేసే గుణాలున్నాయి. చర్మం కందిపోవడం, ఇన్ఫెక్షన్లకు గురికావడం వంటి సమస్యలు రాకుండా, చర్మం మీద వాపు, దద్దుర్లు రాకుండా కాపాడుతుంది.
ఎర్ర తామరలో చర్మ మృదుత్వాన్ని కాపాడే మూలకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి పిల్లల చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. మొత్తంగా చూస్తే పిల్లల శరీర ఆరోగ్యానికి అవసరమైన పోషకాహారం అందిస్తూనే, చర్మ రక్షణ కోసం, ప్రకృతి సహజమైన నూనెలు, క్రీములను అందించడం అవసరం. వాటి వల్ల పసిపిల్లల చర్మం కోమలంగా, మృదువుగా ఉంటుంది.