Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రేఖ..బాగాచదువుకుంది. అభ్యుదయభావాల మధ్య పెరిగింది. చదువు పూర్తిచేసి మంచి ఉద్యోగంలో చేరిన తర్వాత ఆమెకు పెండ్లి చేశారు. భర్తను మంచి ఫ్రెండ్‌గా భావించింది. ఈమెయిల్ ఐడీ నుంచి ఏటీఎం పిన్ వరకు అన్నీ అతనితో షేర్ చేసుకుంది. జీవితాన్ని షేర్ చేసుకుంటున్న వ్యక్తితో ఎలాంటి దాపరికాలు ఉండకూడదన్న ఆమె ఆలోచన అతనికి అవకాశంగా మారింది. అనుమానం మొదలై.. చివరికి పెండ్లయిన మూడేండ్లకే వారిద్దరూ విడిపోయ్యేదాక వచ్చింది. బంధాన్ని తెంచుకోలేక ఆమె ఐద్వా అదాలత్‌ను ఆశ్రయించింది.. ఆమె సమస్య ఎక్కడ మొదలై.. ఎలా పరిష్కారమైందో చదవండి..అన్నపూర్ణ, రాఘవయ్యలకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి రేఖ, అబ్బాయి అఖిల్. ఇద్దరినీ సమానంగా పెంచారు. ఉన్నత చదువులు చెప్పించారు. ఉద్యోగాలు చేస్తూ.. తమ కాళ్లపై తాము నిలబడిన తర్వాతే పెండ్లి గురించి ఆలోచించారు. ప్రైవేటు కంపెనీలో టీమ్ లీడర్‌గా ఉద్యోగం చేసే రేఖకు మంచి సంబంధం కోసం ఎంతో వెతికారు. చివరకు సాఫ్ట్వేర్ ఉద్యోగి రాహుల్ నచ్చడంతో వారిద్దరికీ పెండ్లి చేశారు. పెండ్లికి వచ్చిన తన స్నేహితులందరినీ భర్తకు పరిచయం చేసింది. రేఖ స్నేహితుల్లో ఎక్కువగా అబ్బాయిలే ఉండటం రాహుల్‌కు నచ్చలేదు.
హనీమూన్‌కు సింగపూర్ వెళ్ళారు. అక్కడ షాపింగ్‌లో రేఖ ఖరీదైౖన బహుమతి కొన్నది. ఎవరి కోసం అని అడిగిన రాహుల్‌కు తన బెస్ట్ ఫ్రెండ్ సునీల్‌కు అని చెప్పింది. అంతే రాహుల్ మనసులో అనుమానపు బీజం నాటుకుంది. హానీమూన్ ట్రిప్ మధ్యలోనే తనకు ఆఫీస్‌లో అర్జెంట్ పని ఉందని, బాస్ కాల్ చేసి వెంటనే రమ్మన్నాడని చెప్పాడు రాహుల్. నిజమే అనుకున్న రేఖ అతనితోపాటే బయలుదేరి ఇంటికి వచ్చింది. ఆనందంగా సాగాల్సిన వాళ్ల పదిరోజుల హానీమూన్ ట్రిప్ అనుమానంతో రెండురోజులకే ముగిసింది. రాహుల్ మనసులో అనుమానం పెరుగుతూనే ఉంది. దాన్ని బయట పడనీయ కుండా చిన్నచిన్న కారణాలతో రేఖపై అసహనం చూపించేవాడు రాహుల్.
ఇంటికి వచ్చిన తర్వాత రాహుల్ ప్రవర్తనలో వచ్చిన మార్పును రేఖ గుర్తించలేక పోయింది. ఆఫీస్ నుంచి లేట్‌గా రావడం.. తనను పట్టించుకోకపోవడం చూసి వర్క్ టెన్షన్ అని సరిపెట్టుకుంది. తమ ఇద్దరిమధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని తన ఈమెయిల్ ఐడీ, ఎటిఎం పిన్ నెంబర్లో సహా అన్ని రాహుల్‌కు చెప్పింది. సునీల్ ఎవరు? రేఖ అతనికి ఖరీదైన బహుమతి ఎందుకు కొన్నది? వారిద్దరి మధ్య అనుబంధం ఎంటీ? అన్న అనుమానాలు రాహుల్‌లో రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక రోజు రేఖ మెయిల్ ఓపెన్ చేసి ఆమె ఫ్రెండ్స్ లిస్ట్, చాట్ డిటేల్స్ అన్నీ చెక్ చేశాడు. ఆమెను అనుమానించదగిన ఎలాంటి ఆధారాలు అతనికి కనిపించలేదు. అయినా అతనిలో అనుమానం పెరిగిందే తప్ప తగ్గలేదు. ఆమె ట్రాష్ బాక్స్ అంతా వెతికినా..ప్రయోజనం లేకపోయింది.
రాహుల్ ఆమె ఆఫీస్‌కు సడెన్‌గా వెళ్లేవాడు. టీమ్ మెంబర్స్‌తో అప్పుడప్పుడు క్యాంటీన్లో కనిపించేది రేఖ. ఆమె పదిమంది టీమ్‌లో ఎనిమిది మంది అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు. వారందరినీ రాహుల్‌కు పరిచయం చేసేది. ఇంట్లోనూ ఫ్రెండ్స్ గురించి ఆరా తీసేవాడు. మొదట్లో రేఖకు ఎమీ అర్థం కాలేదు. పదేపదే ఫ్రెండ్స్ గురించి మాట్లాడటం, వారంలో రెండుమూడు సార్లు ఆఫీస్‌కు రావడం, తన మెయిల్, ఫేస్బుక్ చెక్ చేయడం, తనను దూరంగా ఉంచడం ఇలా దాదాపు ఏడాది గడిచింది. మెల్లమెల్లగా ఆమె రాహుల్ ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చిందని గమనించింది. మరోవైపు ఏడాది దాటినా శుభవార్త చెప్పడం లేదంటూ ఇరుగుపొరుగువారితో అత్తగారు చేసే కామెంట్స్ ఆమెకు బాధ కలిగించేవి.
రేఖ ఆఫీస్‌కు దగ్గర్లోనే ఆమె అమ్మనాన్న ఉంటారు. అత్తవారిల్లు దాదాపు 30కిలోమీటర్లు. రోజు అంతదూరం ప్రయాణంతో అలసిపోయేది. ఇంట్లో పనులన్నీ కూడా ఆమె చేయాల్సి వచ్చేది. అత్త టీవీ ముందు అతుక్కుపోయేది. దాంతో ఆఫీస్ ఉన్న ఐదు రోజులు అమ్మవాళ్లింట్లోనే ఉండి వీకెండ్లో అత్తగారింటికి వచ్చేది. ఆ రెండు రోజులు ఊపిరి సలపని పని. భర్త మాత్రం ఆమెకు ఐదునిమిషాలు కూడా మాట్లాడడానికి టైం ఇచ్చేవాడు కాదు. ఆమె ఎటీఎమ్ అతనితోనే ఉండేది. ఇంటి అవసరాల కోసం అంటూ క్రెడిట్ కార్డు ఆమె పేరుతోనే తీసుకున్నాడు. ప్రతినెలా వేలరూపాయలు క్రెడిట్ కట్టడానికే సరిపోయేది. అయినా ఏ రోజు భర్తను ఎదిరించలేదు. తన కుటుంబమే కదా అని భరించింది.
రెండేండ్లుగా ఇదే పరిస్థితి. భర్తలోని మార్పు ఆమెకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక భరించలేక 'ఎందుకు నన్ను ఇలా దూరం ఉంచుతున్నావు' అని రాహుల్‌ను ఒకరోజు నిలదీసింది. అంతే అప్పటి వరకు బెడ్రూమ్లో ముభావంగా ఉండే అతనిలోని శాడిస్ట్ బయటకు వచ్చాడు. ఆమెను శారీరకంగా, మానసికంగా హింసంచడం మొదలుపెట్టాడు. ఆమె బయటకు చెప్పుకోలేని మాటలతో చిత్రవధ చేసేవాడు. భరించలేకపోయింది. దాంతో వీకెండ్స్‌లోనూ అత్తవారింటికి రావడం మానేసింది. నెలలు గడిచినా.. ఎందుకు రావడం లేదని భర్తగానీ, అత్తమామకాని ఫోన్ చేయలేదు. కనీసం తన మనసులోని బాధను అమ్మతో కూడా పంచుకునే ధైర్యం చేయలేకపోయింది రేఖ. వీకెండ్స్‌లోనూ అత్తవారింటికి వెళ్లకపోవడం, అర్ధరాత్రి నిద్రలో ఉలిక్కిపడి లేచి వెక్కివెక్కి ఏడ్వడం చూసి అన్నపూర్ణ తట్టుకోలేకపోయింది. మెల్లగా రేఖను కూర్చొబెట్టి 'అల్లుడు నువ్వు గొడవ పడ్డారా? ఏం జరిగిందో చెప్పు' అంది. అంతే, అన్నిరోజులు తనలోనే దాచుకున్న బాధ ఉప్పెనగా మారింది. భర్త ప్రవర్తన, అత్తగారింట్లో తన పరిస్థితి వివరించింది. బిడ్డ పడుతున్న ఆవేదన అర్థమైంది. రేఖ ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత భర్తతో కలిసి రాహుల్ వాళ్లింటికి వెళ్లింది. రేఖ అత్త, భర్త వాళ్లను నానా మాటలు అనడమే కాకుండా 'నీ బిడ్డకు ఎంతోమందితో సంబంధం ఉంది. నా జీవితం నాశనం చేశారు' అంటూ రాహుల్ గొడవ పెట్టుకున్నాడు. రేఖపై నిందలు వేయడం ఆమె అమ్మనాన్న భరించలేకపోయారు. అనుమానంతో తన బిడ్డ జీవితం సాఫీగా సాగదని తెలుసుకున్నారు. స్నేహితుల ద్వారా బిడ్డను తీసుకుని ఐద్వాకు వచ్చి విషయమంతా బాధ్యులకు వివరించారు.
అందమైన జీవితాన్ని అల్లకల్లోలం చేసుకుంటున్న రాహుల్‌లో అర్థం లేని అనుమానాలను నివృత్తి చేసి వారిద్దరిని కలపాలన్న ఆలోచనతో ఐద్వా ఆఫీస్‌కు రమ్మని అతనికి ఉత్తరం పంపించారు. వారం తర్వాత ఒంటరిగానే వచ్చాడు రాహుల్. ఎందుకు రమ్మన్నారు అన్న అతని ప్రశ్నకు సమాధానంగా రేఖ రాసిచ్చిన కంప్లెయింట్ అతనికి ఇచ్చారు. అంతా చదివి..
'నాది అనుమానం కాదు... ఆమెకు చాలామంది బారుఫ్రెండ్స్ ఉన్నారు. నాకు ఎక్కడ తెలిసిపోతుందో అని ఆమె ఫోన్ కూడా లాక్ చేస్తుంది. వారంలో ఐదురోజులు ఇంటికే రాదు. వీకెండ్లో వచ్చినా గొడవతోనే సరిపోతుంది. ఫ్రెండ్స్‌కు ఖరీదైన గిఫ్ట్‌లు ఇస్తుంది. ఈ మూడెండ్లలో నాకు ఒక గిఫ్ట్ అయినా ఇచ్చిందా?' అంటూ తన వాదన వినిపించాడు. అతను చెప్పిందంతా విన్న తర్వాత ' ఆమె జీతం ఎవరికీ ఇస్తుంది? మీకా.. తల్లిదండ్రులకా? ఇన్ని రోజులు ఆమె ఇంటికి రాకపోయినా.. మీరు ఫోన్ చేయలేదు. ఆమె ఎటీఎం కార్డు కూడా మీతోనే ఉంది. ఆమెనే అవసరం లేకపోతే.. ఆమె జీతం వాడుకునే హక్కు మీకు ఎక్కడ ఉంది' అంటూ బాధ్యులు అడిగిన ప్రశ్నలు అతనికి మింగుడు పడలేదు. 'రేఖ మీ మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదని తన మెయిల్ఐడీతో సహా మీకు ఇచ్చింది. కనీసం మీరు ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. జీతం ఎంత వస్తుంది అన్న విషయాలైనా ఆమెతో షేర్ చేసుకున్నారా? ఏ ఆధారాలతో ఆమెను అనుమానిస్తున్నారు?' అంటూ బాధ్యులు అతనిని గట్టిగా నిలదీశారు. సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూ.. బాధ్యులతో వాదించాడే తప్ప.. తన తప్పు దిద్దుకుని రేఖను బాగా చూసుకుంటాను అని మాత్రం అనలేదు రాహుల్. దాంతో రేఖ కోపం కట్టలు తెంచుకుంది 'నీలాంటి శాడిస్ట్ భర్తతో కాపురం కన్నా విడాకులు తీసుకోవడం బెటర్. ఇన్ని రోజులు మీరు వాడుకున్న నా డబ్బులు, కట్నంగా ఇచ్చిన డబ్బులు, బంగారం అన్నీ తిరిగి ఇచ్చేయండి. డైవర్స్ ఇచ్చేసాను' అంది. 'నా దగ్గర డబ్బులు లేవు, ఇవ్వలేను' అన్నాడు మొండిగా రాహుల్. సరే అయితే 498ఏ కేసు ఫైల్ చేస్తాం. అప్పుడు జైలుకు వెళ్దువుగానీ అంటూ కంప్లెంయింట్ రాసి మహిళా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడానికి రేఖ సిద్ధమైంది. దాంతో రాజీకి వచ్చిన రాహుల్ పదిలక్షల రూపాయలు రెండు విడతలుగా రేఖకు ఇస్తానని కాగితం రాసిచ్చాడు. ఆ తర్వాత మ్యూచువల్గా డైవర్స్ తీసుకున్నారు. జరిగిందంతా పీడకలగా మరిచిపోయి రేఖ తన ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగింది. రాహుల్ మాత్రం అనుమానం నీడగా బతుకును చీకటిమయం చేసుకున్నాడు.