Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మీ స్నేహితులెవరో తెలిస్తే... మీరేంటో తెలుస్తుంది' అని ఓ నానుడి. నిజమే మీ స్నేహితులే కాదు.. మీ చిన్న చిన్న అలవాట్లు మీ వ్యక్తిత్వమేమిటో చెప్పేస్తాయి. అవును మనకు తెలియకుండానే మనం చాలా పనులు చేస్తుంటాం. ఉదాహరణకు మీరు హ్యాండ్‌బ్యాగ్‌ను పట్టుకునే తీరు, మీరు కరచాలనం చేసే పద్ధతి, మీ షాపింగ్ అలవాట్లు వంటి చిన్నచిన్నవే.. మీ జీవితం పట్ల మీకున్న స్పష్టతను తెలియచెబుతాయి. అందులో కొన్ని పద్ధతులు మీ గురించి ఏం చెబుతున్నాయో తెలుసుకోండి!
- మీ షాపింగ్ పద్ధతులు మీ ప్రాధాన్యాల గురించి తెలియ చెబుతాయి. షాపింగ్‌లో రెండురకాల మనస్తత్వాలు ఉంటాయి. అందులో కొందరు బయట డిస్ప్లేలో పెట్టినవాటన్నింటినీ ఒక్కటి కూడా తప్పిపోకుండా పరిశీలనగా పరిశీలించి తరువాత... కొంటారు. ఇంకొందరు ఎలాంటి తనిఖీలు లేకుండా కొనేస్తారు. ఒకవేళ మీరు మొదటి రకం అయితే.. కొనే విషయంలోనే కాదు, ప్రతి విషయంలో అంత డీటెయిల్డ్‌గా ఆలోచిస్తారన్న మాట. ఇక రెండో రకం అయితే... డీటెయిల్స్ లోకి వెళ్లకుండా కంటికి నచ్చింది కొనేరకం.
- జీవితం పట్ల మనకేరకమైన స్పష్టత ఉందనే విషయాన్ని మన ఆహారపు అలవాట్లు చెబుతాయి. ఇక్కడ ఏం తింటున్నావన్నది కాదు... ఎలా తింటున్నావన్నది ముఖ్యం. నెమ్మదిగా తినేవాళ్ల జీవితం వాళ్ల కంట్రోల్లోనే ఉంటుంది. జీవితాన్ని ఆనందం చేసుకోవడమెలాగో వాళ్లకి తెలుసు. ఇక గబగబా తినేసేవాళ్లు.. ఏదో ఒకటి సాధించాలన్న లక్ష్యంతో ఉంటారు... సహనం తక్కువ.
- మీరు ధరించే చెప్పులు కూడా మీ వ్యక్తిత్వం గురించి చెబుతాయి. మీరు హైహీల్ బూట్లు ఇష్టపడేవారయితే గనుక... మీ చుట్టుపక్కల పరిస్థితులన్నీ మీ కంట్రోల్లో ఉండాలనుకుంటారు. ఉంచుతారు కూడా. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొంటారు. ఇక ఫ్లాట్స్ వేసుకునేవాళ్లకు ఏకాగ్రత ఎక్కువ. ఇక సౌకర్యానికే ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు.. సందర్భాన్ని బట్టి నడుచుకుంటారు.
- ఇక వ్యక్తులను కలిసినప్పుడు కరచాలనం చేస్తాం. ఆ కరచాలనం చేసే తీరును బట్టి మీ వ్యక్తిత్వం చెప్పేయొచ్చు. అవును... సరైన పద్ధతిలో హ్యాండ్‌షేక్ ఇవ్వడం మీలో ఆత్మవిశ్వాసాన్ని తెలియబరుస్తుంది. లేదు హ్యాండ్‌షేక్ టచ్‌మీ నాట్ లాగా ఉందంటే... మీకు సిగ్గెక్కువ అని అర్థం.
- మీరు హ్యాండ్ బ్యాగ్ ఎలా పట్టుకుంటున్నారనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారు. చాలామంది అంత ప్రత్యేక శ్రద్ధ చూపరు. మోచేతిని మడిచి చేతిలో మోసేవారయితే గనుక... సమాజంలోమీ స్టేటస్ గురించి ఆలోచిస్తారు. మెడ మీదుగా వేసుకుని బ్యాగ్‌ను ముందుకు తెచ్చుకున్నట్టయితే... భద్రతకు ఇంపార్టెన్స్‌కు ఎక్కువ ఇచ్చినట్టు. చేతిలో వేలాడేలా పట్టుకున్నారంటే.. ప్రశాంతమైన వ్యక్తిత్వం అని అర్థం.