Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండాకాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. దాంతో ఇళ్లలో చల్లదనం కోసం ఏసీయో, కూలరో వాడేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. ఏసీలు కొనే వారి కన్నా కూలర్లు కొనేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. వీటి ధర కూడా వేలల్లోనే ఉంటుంది. అయితే కూలర్ల వాడకంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ చల్లదనాన్ని పొందవచ్చు.
- ఎయిర్ కూలర్లను రెగ్యులర్ గా వినియోగిస్తున్నప్పుడు.. కనీసం ఐదారు రోజులకోసారి ట్యాంక్ లోని నీటిని పూర్తిగా తీసేసి, డిటర్జెంట్ తో కడిగి శుభ్రం చేసుకోవాలి. తద్వారా నీటిలో ప్రమాదకర సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉండకుండా చూసుకోవచ్చు.
- కూలింగ్ ప్యాడ్లు పూర్తిగా తడుస్తున్నాయా, లేదా చూసుకోవాలి. కూలింగ్ ప్యాడ్లు పూర్తిగా తడవకపోయినా, వాటి మధ్య ఎక్కువగా ఖాళీ స్థలం ఉన్నా గాలి చల్లగా రాదు.
- ఎప్పటికప్పుడు తాజా నీటిని నింపుతుండడం వల్ల కూలర్ల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. అవసరమైతే కూలర్ సెంట్లు వినియోగించుకోవచ్చు.
- కూలింగ్ ప్యాడ్లకు నీటిని సరఫరా చేసే మోటార్ సరిగా పనిచేస్తుందో లేదో పరిశీలించాలి. పైపుల్లో ఏవైనా అడ్డుగా ఉంటే తొలగించాలి. కూలింగ్ ప్యాడ్లకుపైన నీటిని సన్నని ధారలుగా పడుతున్నాయో లేదో చూడాలి.
- కూలర్ కు ముందు వైపు ఉండే లోవర్లు సరిగా ఉన్నాయో లేదో చూడాలి. అవి అడ్డంగా మూసి వేసినట్లుగా ఉంటే గాలి సరిగా రాదు.
- కూలర్ ఆన్‌లో ఉన్న సమయంలో నీరు నింపడానికి ప్రయత్నించవద్దు. దానివల్ల నీరు ఫ్యాన్ మోటార్, ఇతర ఎలక్ట్రానిక్ భాగాలపై చిమ్మి పాడైపోయే అవకాశం ఉంది.
- ఎయిర్ కూలర్లో నీళ్లు తగ్గిపోతే వెంటనే వాటర్ మోటార్‌ను ఆఫ్ చేయాలి. లేకుంటే మోటార్ పాడైపోతుంది.