Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కడ ఏ కొనుగోలు చేసినా మేడమ్... క్యాషా.. కార్డా? అని అడగటం మనకి నిత్య అనుభవం. వాళ్ళు అడిగిందే తడవుగా కార్డు అంటూ ఒక ప్లాస్టిక్ కార్డును తీసి ఇచ్చేస్తున్నాం. అంత వరకు బాగానే ఉంది.. మీరు ఉపయోగించింది డెబిట్‌కార్డు అయితే పర్వాలేదు... క్రెడిట్ కార్డు అయితే... ఆ తర్వాతి చెల్లింపుల సంగతి, దానికి పడే వడ్డీ సంగతి ఏమిటి?
ప్రస్తుతకాలంలో క్రెడిట్ కార్డుల ఉపయోగం ఎక్కువగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డు ఉందన్న నెపంతో ప్రతి ఒక్కరూ ఏదిపడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు కొనేస్తున్నారు. కార్డు తీశామా, గీశామా, కొనుగోలు చేశామా... ఇది ఒక అలవాటుగా కాదు... వ్యసనంగా మారిపోయింది. క్రెడిట్ కార్డు అంటే అప్పు... అప్పు తీసుకున్నాక దానికి వడ్డీ కూడా కట్టాల్సిందే! ఎంత ఎక్కువ అప్పు చేస్తే అంత ఎక్కువ వడ్డీ... అసలు కలిపి తీర్చక తప్పదు.
క్రెడిట్ కార్డును అత్యవసర పరిస్థితుల్లో...మన దగ్గర డబ్బు అందుబాటులో లేనప్పుడు మాత్రమే ఉపయోగించాలి. అలా కాకుండా చేతికి ఏదో లడ్డూ దొరికినట్టు దొరికింది కదా అని అవసరమైనవి, అనవసరమైనవి... కొంటూ క్రెడిట్ కార్ట్ స్క్రాచ్ చేస్తే... బ్యాంకువాళ్లు కూడా మీ ఖాతాలో రుణాలను స్క్రాచ్ చేసేస్తారు. కాబట్టి, క్రెడిట్ కార్డు ఎలా ఉపయోగించాలి? ఎంత వరకు ఖర్చు చేసుకోవాలి? అసలు దాని ఉపయోగమేంటి? అవసరమైన వస్తువులేవి? అన్న విషయాలపై ఒక అవగాహనకు వచ్చిన తరువాతే క్రెడిట్ కార్డును ఉపయోగించి, ఖర్చు చేసుకోవాలి. అప్పుడే మీరు మీ ఖాతాలో ఉన్న డబ్బును కాపాడుకోగలుగుతారు.
నిబంధనలు తెలుసుకోవాలి
క్రెడిట్ కార్డు ఉంది కాదని ఇష్టం వచ్చినట్లు వాడటం కాదు. ఆయా బ్యాంకులు విధించిన నిబంధనలు తెలుసుకోవాలి. ఎంత పరిమితి మొత్తాన్ని ఆ కార్డు ద్వారా ఉపయోగించుకోవచ్చు, ఆ కార్డుకు చెల్లించాల్సిన ఫీజు ఏమిటి, మనం వాడుకున్న మొత్తంపై ఎంత శాతం వడ్డీ విధిస్తారు మొదలైన వివరాలు తెలుసుకోవాలి. ఇతర బ్యాంకులకు, మనం ఎంచుకున్న బ్యాంకు ఇచ్చిన క్రెడిట్ కార్డుకు మధ్య తేడాలు ఏమిటి? లాంటి విషయాలు తెలుసుకోవాలి.
రోజువారీ కొనుగోళ్లు వద్దు
క్రెడిట్ కార్డు ఉన్నది రోజువారీ కొనుగోళ్ల కోసం కాదన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. దీనికి నగదును లేదా డెబిట్ కార్డును ఉపయోగించడం మంచిది. నగదుతో కొనాల్సిన ప్రతి వస్తువునూ క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనడం వల్ల అతి త్వరగా రుణాల్లో కూరుకుపోయే పరిస్థితి ఉత్పన్నమవుతుంది.
అవసరమైనవేమిటో గుర్తించాలి
షాపింగ్‌కి వెళ్లినప్పుడు మనకు అవసరమైన వస్తువులు ఏమిటి? ఎంతవరకు ఖర్చు పెట్టవచ్చు? లాంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ఒక లిస్ట్ తయారు చేసి... మొత్తం ఖర్చు ఎంతవరకు వస్తుంది అన్న అవగాహన ముందుగానే వేసుకోవాలి. అప్పుడు మీరు షాపింగ్ మాల్ కు వెళ్లినప్పుడు అనవసర ఖర్చులు తగ్గుతాయి. అప్పుడే మన కార్డును బాధ్యతగా వాడిన వారమవుతాం. అలాగే క్రెడిట్ కార్డు బిల్లును ఎప్పటికప్పుడు పరీక్షించుకొని, చెల్లింపులు చేసుకుంటే.. అధిక రుణభారం నుంచి సులువుగా తప్పించుకోవచ్చు.
కనీస మొత్తాలే కాదు..
సాధారణంగా క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన తరువాత ఎంత మొత్తం కొనుగోలు చేశామో, అందులోనుంచి కనీసం కొంత మొత్తాన్ని నిర్ణీత గడువు లోపల చెలించాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి వడ్డీ ఉండదు. అయితే, కనీస మొత్తాలను మాత్రమే చెల్లిస్తూ వస్తే, మిగిలిన మొత్తం ఎక్కువవుతుంది. దానిపై చెల్లించాల్సిన వడ్డీ కూడా బాగా పెరుగుతుంది. క్రెడిట్ కార్డును సౌకర్యవంతంగా ఉపయోగించుకుంటూ ఉండాలంటే, మనం చెల్లించాల్సిన మొత్తంలో నుంచి వీలైనంత ఎక్కువగా చెల్లిస్తూ రావాలి.
శక్తికి మించి ఖర్చు చేయకూడదు
క్రెడిట్ కార్డును ఉపయోగించి శక్తికి మించిన ఖర్చు చేయకూడదు. బాగా ఖరీదైన, మన తాహతుకు మించిన వస్తువులను కొనుగోలు చేయడమంటే అప్పులు చేస్తూ జీవితాన్ని గడపటమే. మన దగ్గర డబ్బులు అందుబాటులో లేనప్పుడు కేవలం అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి మాత్రమే క్రెడిట్‌కార్డును ఉపయోగించాలి. ఇలా కాకుండా క్రెడిట్ కార్డులు వినియోగిస్తే ఎక్కువ పాయింట్లు, రివార్డులు వస్తాయని ఖర్చులు చేస్తే.. తరువాత రుణభారాన్ని భరించాల్సి వస్తుంది.
సమీక్ష అవసరం
ప్రతినెలా క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ను సమీక్షించుకుంటూ ఉండాలి. వాటిలో అనవసరమైన ఖర్చులు ఏమైనా ఉన్నాయేమో సమీక్షించుకొని తర్వాత నెలలో ఖర్చులు నియంత్రించుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మీ బడ్జెట్ ను అదుపులో పెట్టుకోగలుగుతారు.
- నక్షత్ర