Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పచ్చని మొక్కల మధ్య విహరిస్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. కాసేపు పార్కులో గడిపివస్తేనే మనసుకుకు ఎంతో హాయిగా ఉంటుంది. మరి అలాంటి వాతావరణాన్ని మనం ఇంట్లోనే ఏర్పరుచుకునే వీలుంది. ఎలా..? అంటారా..?ఇండోర్ ప్లాంట్స్‌ని ఇంట్లో అలంకరించుకోవడం ద్వారా...అవి ఆక్సిజన్ని అందించటంతోపాటు పరిసరాలను చల్లగా మార్చేస్తాయి. కాబట్టి వాటిని గదుల్లో ఎలా అలంకరించుకోవాలో తెలుసుకుందాం!
- ఇండోర్ ప్లాంట్స్‌ను అలంకరించే విధానాల్లో కూడా ట్రెండ్స్ ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్‌ను కుండీల్లో పెంచే పద్ధతి పాతబడిపోయింది. ప్రదేశం, వైశాల్యాలను బట్టి మొక్కలు, వాటికి తగిన కుండీలను ఎంచుకోవాలి. గోడవారగా వేసిన వెడల్పాటి టేబుల్ మీద మాస్ నుంచి ఎయిర్ ప్లాంట్స్ వరకూ మొక్కల్ని ఎంచుకోవచ్చు. వీటి హౌల్డింగ్ కోసం కలపతో తయారైన డ్రిఫ్ట్వుడ్ ప్లాంటర్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిలో మొక్కను నాటి విశాలమైన గదుల్లో గోడవారగా వేసిన టేబుల్‌ను అలంకరించవచ్చు.
- గదిలో మొక్కలనే హైలైట్ చేయాలనుకుంటే స్టాండింగ్ టాల్ స్టయిల్లో ఇండోర్ ప్లాంట్ డెకరేషన్ ఉండాలి. ఇందుకోసం హెచ్చుతగ్గుల్లో ఉండే ఇత్తడి కుండీలను ఇనుప స్టాండుల్లో అలంకరించాలి. వీటిలో రకరకాల కాక్టస్ మొక్కల్ని నాటి వెలుగుపడే ప్రదేశంలో ఏర్పాటు చేయాలి. స్టాండింగ్ టాల్ స్టయిల్లో అలంకరించిన మొక్కలు కచ్చితంగా గది మొత్తంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
- లివింగ్ రూమ్‌లో మొక్కలను బెంచ్ మార్క్ స్టయిల్లో అలంకరించాలి. కుర్చీల్లో, కార్పెట్ మీద కూర్చున్నప్పుడు పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండాలనుకుంటే ఇండోర్ ప్లాంట్స్‌ను ఆ ప్రదేశానికి దగ్గరగా అలంకరించాలి. ఇందుకోసం మనం కూర్చునే ఎత్తుకు తగ్గట్టుగా మొక్కల కుండీలను బెంచ్‌పై వరుసగా అలంకరించాలి.
- మొక్కలన్నీ ఒకే చోట ఒత్తుగా, గుత్తులుగా ఉంటే ఆ అందమే వేరు. ఇలాంటి అలంకరణనే క్లస్టర్ అంటారు. బెడ్రూమ్లో ఇండోర్ ప్లాంటింగ్కు తగిన స్థలం లేనప్పుడు ఎక్కువ మొక్కలను ఒకే ప్రదేశంలో అలంకరించే క్లస్టర్ పద్ధతిని అవలంబించాలి.
- వాల్ మ్యాజిక్ చేయాలనుకుంటే వింటేజ్ ఫ్రేమ్‌ను గోడకు ఏర్పాటు చేసుకోవాలి. దీన్లో పెద్ద పెద్ద ఆకులుండే క్రోటాన్ ఇండోర్ ప్లాంట్‌ను పెంచుకుంటే ఫ్రేమ్నుంచి పెయింటింగ్ బయటకొచ్చిన అనుభూతి కలుగుతుంది. ఇందుకోసం ఫ్రేమ్‌లోపల వూలీ పాకెట్ ప్లాంటర్‌ను ఏర్పాటుచేసుకోవాలి.
- కుర్చీల్లో కూడా మొక్కలను అలంకరించవచ్చు. వేలాడే మొక్కలను కుర్చీ అలంకరణకు ఎంచుకోవాలి. బెడ్ పక్కనే కేన్ లేదా కలప కుర్చీని ఉంచి దాన్లో ట్రే ఏర్పాటు చేసి కుండీని ఉంచాలి. ఎత్తు తక్కువగా ఉండి వేలాడే కాండాలున్న ఇండోర్ ప్లాంట్‌ను ఈ కుండీలో అలంకరిస్తే గది అందం రెట్టింపవుతుంది.