Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పువ్వులంటే... సంతోషం. పువ్వులంటే ప్రేమ. పువ్వులంటే... వ్యక్తీకరణ. వ్యక్తావ్యక్త భావాలనెన్నో తెలిపే ఒకానొక మాధ్యమం. గుండెలోని ప్రేమనంతా గుప్పెడంత గులాబీతో వెలిబుచ్చేయొచ్చు. మూరెడు మల్లెమాలతో జీవితభాగస్వామిని మనసును గెలుచుకోవచ్చు. వేడుక ఏదైనా... ఆత్మీయతనంతా అందమైన పూవుల్లా పేర్చి అభిమానాన్ని బొకేలా అందించేయొచ్చు. అలాంటి పువ్వులతోనే... మనుషుల, మనసుల మధ్య వాడని ప్రేమను వ్యక్తపరచడానికి వాహికగా పనిచేస్తున్న యువతి సోనాల్ అగర్వాల్. చదువుతూనే స్టార్టప్ మొదలెట్టి... 24 ఏండ్లకే యూనిక్ ఫ్లోరిస్ట్గా మారిపోయింది. 'ఫ్లవర్వాలీ' పేరుతో బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నది.
ఫ్లవర్వాలీ ఆలోచన ఎలా వచ్చింది?
మా స్వస్థలం రాజస్తాన్. మా కుటుంబం హైదరాబాద్‌లోని చందానగర్‌లో స్థిరపడింది. నేను పుట్టి, పెరిగి చదువుకున్నదంతా ఇక్కడే. నాన్న టెక్స్టైల్స్ అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఉన్నారు. అమ్మ గృహిణి. బీకామ్‌లో డిగ్రీ చేశాను. ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. డిజైనింగ్ మీద ఇష్టంతో చదివాను కానీ.. డిజైనర్కావాలని కాదు. నా బట్టలు నేను డిజైన్ చేసుకోవడం ఇష్టం ఉండేది. ఊహ తెలిసినప్పటినుంచి నాన్నగారి వ్యాపార వ్యవహారాలన్నీ గమనిస్తూ ఉండేదాన్ని కాబట్టి... బిజినెస్‌లోకి వెళ్లాలనేదే ఆలోచన అందుకే చదువుకునేటప్పుడే.. ఫ్రెండ్స్‌తో కలిసి ఆర్టిస్ట్ షాపీ (2013లో) ఏర్పాటు చేశాను. అందులో హ్యాండ్ మేడ్ జువెలరీ, గ్రీటింగ్ కార్డ్స్, రకరకాల గిఫ్ట్ ఆర్టికల్స్ ఉండేవి. అన్నీ మేమేం తయారు చేసేవాళ్లం. ఇవి చేస్తున్న క్రమంలో... పువ్వుల మీద ప్రింటింగ్ ఆలోచన వచ్చింది. అప్పటికే మగ్స్తోపాటు రకరకాల ఆర్టికల్స్ మీద ప్రింటింగ్ చేస్తున్నారు. పువ్వుల మీద ఎందుకు చేయకూడదనిపించింది. అలా పువుల మీద ఎంబోజింగ్ ప్రింట్‌ను మొదలుపెట్టి.. యూనిక్ గిఫ్ట్ ఆర్టికల్స్, గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చాం. ఇలా చేస్తున్నప్పుడే... పువ్వులు, అందులోని రకాలు, వాటిని అరేంజ్ చేయడం.. చాలా నచ్చింది. ప్రత్యేకంగా పువ్వుల కంపెనీనే ఎందుకు పెట్టగూడదు అనిపించింది. అదే సమయంలో నా మెంటర్ ఒకరు... ''ఆర్టిస్ట్ షాపీ' బాగుంది. కానీ రకరకాల వెరైటీస్ ఉన్నాయి. అన్నింటిమీదా ఫోకస్ చేస్తే... దేనికీ మార్కెట్ సరిగ్గా ఉండదు. చాక్లెట్ అంటే డైరీమిల్క్, కూల్‌డ్రింక్ అంటే థమ్సప్ గుర్తొచ్చినట్టు... నువు మొదలెట్టిన బిజినెస్‌లో నీదే నెంబర్‌వన్ ఉండేలా చూసుకోవాలి' అని చెప్పారు. అప్పుడు ఆ ఒక్కటి పువ్వులే అని డిసైడ్ అయ్యాను. అదే 'ఫ్లవర్వాలీ' అయ్యింది.
ఫ్లవర్వాలీ ఏర్పాటుకు పడ్డ శ్రమ?
రాత్రికి రాత్రే జరిగిపోలేదు. మూడేండ్ల మేదోమథనం ఇది. పువ్వులు, బొకేలు తప్పనిసరి అవసరం కాదు... కొద్దిగా విలా సవంతమైనవి. అలాంటి దానివైపు ఆకర్షిం చాలంటే... ఎంతో ఇష్టం కావాలి. ఇది తప్ప మరోటి లేదు అని కస్టమర్‌కి అనిపించాలి. పువ్వులు ఎక్కడెక్కడ దొరుకుతాయి? ఎలాంటి పువ్వులను వాడాలి? ఎంతో పరిశోధించాం. మనం అందిస్తున్న వస్తువుకంటే... దాన్ని ప్రజెంట్ చేస్తున్న విధానం ముఖ్యమని అర్థమయ్యింది. ఎంతమంచి పువ్వునైనా ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఇస్తే.. దాని విలువ పోతుంది. అందుకే... ప్యాకేజింగ్ మీద దృష్టి పెట్టాం. అలాగే చాలా మంది బొకేలోగ్రీన్ ఫోమ్ అంతా నింపేసి ఇస్తారు.. దీన్ని చాలామంది ఇష్టపడటం లేదని తేలింది. వీటన్నింటినీ అధిగమించడం కోసం బోరోసిల్ గ్లాస్, ఆక్రేలిక్ బాక్సెస్ ప్యాకింగ్‌ను ఎంచుకున్నాం. అంతేకాదు... బొకే ఆర్డర్ చేసినప్పుడు అది టైమ్‌కి రాకపోవడం వంటి సమస్యలు కూడా ఉన్నాయి. యాప్ క్రియేట్ చేసి... ఆర్డర్ప్లేస్ చేసిన దగ్గరనుంచి స్టూడియోలో తయారవ్వడం.. అన్ని దశల్లో కస్టమర్‌కి అప్డేట్స్ వచ్చే విధంగా రూపొందించాం. ఇక 'పేరు ఏం పెట్టాలా?' అని ఆలోచిస్తున్న సమయంలో ఓ రోజు కారులో ప్రయాణిస్తున్నం. అక్కడ ఓ చాట్ బండి... 'దిల్లీవాలా చాట్వాలా' అని కనిపించింది. చాటావాలా లాగా... పూల్ వాలా అని పెడితే క్యాచీగా ఉంటుందనిపించింది. అయితే ఫూల్ అనే కంటే ఫ్లవర్ అంటే అందరికీ అర్థమవుతుంది...
నాకు సంబంధించింది
కాబట్టి వాలీ అని పెట్టాను. గత ఏడాదే లాంఛ్ చేశాం.
మేకింగ్ అంతా ఎలా ఉంటుంది? మార్కెటింగ్ ఎలా చేశారు?
మేం రెండు రకాల పువ్వులను అందిస్తాం. ఒకటి తాజా... రెండోది ఇనిఫినిటీ. రెండోది ఎంత కాలమైనా ఉంటుంది. సాధారణంగా పువ్వులు రెండు రోజులుంటాయి. కానీ మా పువ్వులు నాలుగైదు రోజులు వాడిపోకుంటా ఉంటాయి. అందుకోసం ఫ్లవర్ఫుడ్ నీళ్లలో కలుపుతాం. ఇక... ఇనిఫినిటీకి ఉపయోగించే పువ్వుల ప్రాసెసింగ్‌కు పేటెంట్ ఉంది. వీటిని హాలెండ్, ఈక్విడార్, నెదర్లాండ్స్ నుంచి వస్తాయి. వీటిని సహజమైన నూనెల్లో ప్రిజర్వ్ చేస్తాం. ప్రొడక్షన్, ప్రిజర్వేషన్‌కు మొత్తం నెల రోజుల సమయం పడుతుంది. మేకింగ్‌లో ముగ్గురం పనిచేస్తున్నాం. కొంత అవుట్సోర్సింగ్ తీసుకుంటున్నాం. ఏదైనా అకేషన్స్, స్పెషల్ డేస్ వస్తున్నాయంటే... వాటికోసం నెల, నెలన్నర ముందే... టీమ్ అంతా కూర్చుని డిజైన్ ప్లాన్ చేసుకుంటాం. పువ్వులతోపాటు... నోట్ కూడా పెడుతుంటాం. ఆ నోట్‌ని మా దగ్గర ఉన్న కాలిగ్రఫీ ఆర్టిస్టుతో రాయిస్తాం. ప్రింటెడ్ అయితే కృత్రిమంగా ఉంటుంది. అందుకే... చేతితోనే రాయిస్తాం. మా ఆర్డర్స్ అన్నీ చాలా వరకు ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారానే వస్తున్నాయి. త్వరలో వెబ్సైట ్ప్రారంభించబోతున్నాం. మాకు వర్క్‌షాప్ ఉంది కానీ... స్టోర్ లేదు. ప్రత్యేకంగా స్టోర్ ఏర్పాటు చేయడం కంటే... కెఫేల దగ్గర స్పేస్ తీసుకుని వాటిముందు కార్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుం దనిపించింది. కొన్ని కెఫేలతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాం. బర్త్‌డేస్, యానివర్సరీస్కు ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి. అప్పుడప్పుడు కార్పొరేట్స్‌కు కూడా చేస్తున్నాం. ఇటీవలే మెర్సిడెజ్ బెంజ్కోసం కూడా చేశాం.
యూనిక్ ఐడియా కదా.. సక్సెస్ అవుతుందనుకున్నారా? రిస్క్ అనిపించలేదా?
పెద్ద రిస్క్ ఉంటుందని తెలుసు. అయితే... నువ్వు చేస్తున్న పని మీద నమ్మకం ఉంచితే.. అన్ని ఒక్క దగ్గరకు వచ్చి సహకరిస్తాయ నిపిస్తుంది. అయితే దానిమీదే వందకు వంద శాతం శ్రద్ధ పెట్టాలి. అందుకోసం అంతకుముందు అన్ని వదిలేశాను. ఇది మాత్రమే మనకు 'బ్రెడ్ అండ్ బటర్', ఇంకో ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు పూర్తిస్థాయిలో కష్టపడతాం. ఫలితం కూడా అలాగే ఉంటుంది. కానీ... ఇది కాకపోతే మరోటీ అనే ఆలోచన ముందునుంచే ఉంటే... బిందాస్‌గా పనిచేసుకుంటూ పోతాం. నలుగురిలో నారాయణలా మిగిలిపోతాం. అందుకే.. 'జాక్ ఆఫ్ ఎవిరీతింగ్ మాస్టర్ ఆప్ నన్' అన్నది నమ్ముతాను. ఒకవేళ సక్సెస్ కాకపోతే... వెనక్కి వెళ్లి ఇంకో ఆప్షన్‌ను ఎంచుకుంటాను. కానీ ఒకేసారి రెండు ప్రయత్నించకూడదను కున్నాను. దాన్నే పాటించాను. స్టార్టింగ్‌లో స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించింది. కానీ.. ఇష్టమయైనది చేస్తున్నప్పుడు కష్టం ఉండదు. 'ఆర్టిస్ట్ షాపీ'లో వచ్చిన డబ్బునే 'ఫ్లవర్వాలీ'లో ఇన్వెస్ట్ చేశాను. తాజా పూల బొకేలయితే వెయ్యి నుంచి 20 వేల వరకు ఉన్నాయి. ఇక ఇన్ఫినిటీ గిఫ్ట్స్ ఎనిమిది వందల రూపాయల నుంచి... పన్నెండున్నర వేల వరకు రేట్ ఉంటుంది. ప్రారంభించి ఆరు నెలలే అయినా మంచి ఆదరణ ఉంది. కార్టులు మరిన్ని ఓపెన్ అయితే, వెబ్సైట్ ప్రారంభమైతే మరింత బాగుంటుందనుకుంటున్నా.
ప్రతి ఒక్కరినుంచి ఎంతో కొంత...
చాట్వాలా నుంచి... ఫ్లవర్వాలీ ఆలోచన వచ్చింది. ఇక బంజారాహిల్స్‌లాంటి చోట మనం స్టోర్ ఏర్పాటు చేయడం కష్టం. కానీ అదే బంజారాహిల్స్‌లో పెద్ద పెద్ద స్టోర్స్ ముందు... పానీపూరీ బండ్లు ఉంటాయి. వాళ్లు ఆ షాప్‌కు ఎంతో కొంత పే చేసి.. అక్కడ ఉంచుతారు. ఆ ఆలోచనే... నన్ను కార్ట్ వైపు నడిపించింది. పెద్ద పెద్ద కాఫీ షాప్స్‌లో కార్ట్ పెడితే.. అక్కడికి వచ్చినవాళ్లు కచ్చితంగా మన కార్ట్వైపు వస్తారు. ఒక్కదానిమీదే శ్రద్ధపెట్టాలంటే... అంతకుముందువన్నీ వదిలేయాలన్న ఆలోచన.. ఓ కొరియర్ అబ్బాయి కథ వింటుండగా వచ్చింది. ప్రతిరోజూ కలిసిన ప్రతి ఒక్కరినుంచి ఎంతో కొంత ఇనిస్పిరేషన్ పొందుతూనే ఉంటాను.
స్వతంత్రంగా బతకాలి...
నాకు మా అమ్మానాన్నల సహకారం చాలా ఉంది. చదువునుంచి, బిజినెస్ వరకు అన్ని విషయాలు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అయితే తల్లిదండ్రుల సహకారం, వాళ్ల సంపాదన ఇవన్నీ పక్కకు పెడితే... అమ్మాయిలు ఆర్థికంగా స్వతంతంగ్రా ఉండాలని నమ్ముతాను. మిలియన్స్ సంపాదించకపోవచ్చు. కానీ.. వర్కింగ్ అనేది సెల్ఫ్ రెస్పెక్ట్. 'అమ్మాయికి పెండ్లి చేస్తే చాలు... భర్తకు మంచి ఉద్యోగం ఉంటే ఇంటిదగ్గరే ఉండొచ్చు, నేను బాగానే సంపాదిస్తున్నాను కదా. ఇక నువ్వెందుకు పనిచేయడం?' అంటుంటారు. కానీ అది సరైనది కాదు. పనిచేయడం అనేది డబ్బుకోసం కాదు. ఇతరుల మీద ఆధారపడకుండా ఉండటం కోసం అనే విషయాన్ని ప్రతి అమ్మాయి గ్రహించాలి.