Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచమంతా యానిమేషన్, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్‌తో రంగుల మయంగా మారిపోతుంది. సృజనాత్మకతకు అధిక ప్రాధాన్యత ఉండే ఈ రంగంలో ఎక్కువగా మగవారి పేర్లే వినిపిస్తుంటాయి. కానీ, సృజనకు మారుపేరైన మహిళలు ఈ రంగంలో రాణించగలరు అని నిరూపించారు రచయిత, ప్రొడ్యూసర్, క్రియేటివ్ డైరెక్టర్, స్విమ్మర్, రోటోమేకర్
(అకాడమి ఆఫ్ అడ్వాన్సుడ్ విజువల్ ఎఫెక్ట్స్) మేనేజర్, శ్యామల. రాష్ట్రంలో ఏకైన మహిళా యానిమేషన్ నిర్మాతగా అనేక చిత్రాలను రూపొందించారు. షార్ట్‌ఫిలిమ్స్‌తో కెరీర్ ప్రారంభించి ఇంటర్నెేషనల్ యానిమేషన్ సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశం అందుకున్నారు. డిస్నీ వరల్డ్‌తో కలిసిపని చేయాలన్న లక్ష్యం దిశగా పనిచేసి ప్రముఖ డైరెక్టర్ విలియం స్మిత్ సహకారంతో డిస్నీ వరల్డ్‌ను సందర్శించారు. యానిమేషన్ రంగంలో సత్తా చాటిన ఆమె ఆటవిడుపుగా నేర్చుకున్న స్మిమ్మింగ్లోనూ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని రికార్డులు సాధిస్తున్నారు. పట్టుదల ఉంటే సాహసాలను సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటూ ఇంగ్లీష్ చానల్ క్రాస్ చెయ్యాలన్న కలను నిజం చేసుకోవడానికి నిరంతర సాధన చేస్తున్న ఆమె పరిచయం..
మాది సామర్లకోట. నాన్న వెంకట్రాజు. అమ్మ సీతాలక్ష్మి. ముగ్గురం పిల్లలం. చిన్న రైతు కుటుంబం. సరదాగా స్నేహితులతో వేసిన పందెంతో నాన్న వెయిట్ లిఫ్టింగ్‌లో రికార్డులు సాధించారు. ఇంటికి పెద్దదాన్నైన నన్ను సివిల్ సర్వెంట్‌గా చూడాలన్నది నాన్న కోరిక.
గీతలు, రంగులే ప్రపంచంగా...
చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం చాలా ఇష్టం. అయితే సివిల్స్ రాయాలన్న ఆలోచనతో ఇంట్లో నా ఆర్ట్‌కు పెద్దగా ప్రోత్సహం ఉండేది కాదు. కామిక్స్ చదవడం కూడా చాలా ఇష్టం. విజయవాడలో ఎం. ఏ. సోషియాలజీ పూర్తి చేశాను. మంచి సంబంధం అంటూ పిజీ కాగానే పెండ్లిచేశారు. మా వారు మోహన్. బెంగళూరులో జాబ్ చేయడంతో కొన్నిరోజులు అక్కడ ఉన్నాం. ఇంట్లో ఖాళీగా ఉండలేక ఫొటోషాప్, వీడియో మిక్సింగ్ నేర్చుకున్నాను. కొద్దిరోజులు వెబ్ డిజైనింగ్ సంస్థలో చేరాను. మల్టీ మీడియా, వెబ్ డిజైన్ లో డిప్లొమా పూర్తి చేశాను. బాబు పుట్టిన తర్వాత వాడి ఆలనపాలనతో సమయం తెలిసేది కాదు. బాబు యానిమేషన్ స్టోరీలు బాగా ఇష్టపడేవాడు. వాడి కోసం నేను స్వయంగా చిన్నచిన్న ఫిల్మ్స్ చేసేదాన్ని. ఆ తర్వాత అదే కెరీర్‌గా ఎంచుకుని 'డిజిటల్ డ్రీమ్ డిజైనర్' పేరుతో ఒక సంస్థను ఏర్పాటుచేసి వెబ్సైట్లను డిజైన్ చేశాను.
యానిమేషన్ చిత్రాల రూపకల్పన..
స్పైడర్ మ్యాన్, బ్యాట్‌మెన్ లాంటి యానిమేషన్ చిత్రాలు ఎంతో ఆకట్టుకునేవి. నా తొలి షార్ట్ ఫిల్మ్ 'మీరే చెప్పండి'. దీనికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వనితా టీవీ వారు నిర్వహించిన పోటీల్లో బహుమతి అందుకున్నాను. వెబ్‌డిజైనింగ్‌లో డిప్లొమా చేస్తున్నప్పుడే చిన్నతనంలో మనం నేర్చుకున్న పంచతంత్రం, పరమానందయ్య శిష్యుల కథ మొదలైనవి రూపకల్పన చేయాలన్న ఆలోచన వచ్చింది. అయితే పాత కథలను కొత్తగా అందించాలన్న తపనతో పరమానందయ్య శిష్యులకు, ఏలియన్స్‌కు లింక్ చేస్తూ.. సరదాగా సాగేలా యానిమేషన్ ఫిల్మ్ రూపొందించాను. ఎపీసోడ్స్గా ప్రసారమై పిల్లలను అలరించింది. టైటిల్ సాంగ్ 'చింటూ బంటి రారండి' మా అబ్బాయితో పాడించాను. చాలా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత యానిమేషన్ చిత్రాలతో మంచి పేరు వచ్చినా ఆర్థికంగా నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. చోటాభీమ్, డోరోమాన్లా చిన్నారుల మనసుకు నచ్చేలా ఒక పాత్ర సృష్టించాను. అదే 'లిటిల్ డ్రాగన్'. జపాన్ డ్రాగన్, ఇండియా బుజ్జి కోడిపిల్ల మధ్యసాగే ఆసక్తికరమైన కథనంతో ఈ యానిమేషన్ చిత్రం మంచి గుర్తింపు తీసుకువచ్చింది. పారిస్‌లో జరిగే 'అంతర్జాతీయ యానిమేషన్ సినిమా ప్రదర్శన'లో లిటిల్ డ్రాగన్ టీజర్‌ను ఆవిష్కరించే అవకాశం లభించింది. ఈ ప్రదర్శనలో ప్రపంచంలోని అత్యున్నత యానిమేషన్ సంస్థలు వాల్డ్డిస్నీ, వార్నర్ బ్రదర్స్ డ్రీమ్‌వర్క్స్ వంటివి పాల్గొన్నాయి. తెలుగురాష్ట్రాల నుంచి నేను ఒకదాన్నే పాల్గొన్నాను. డిస్నీ వరల్డ్ చూడాలన్న తాపత్రయంతో సోషల్ మీడియా ద్వారా డిస్నీలో పనిచేసే ప్రముఖ డైరెక్టర్ విలియం స్మిత్‌ను కాంటాక్ట్ చేసి డిస్నీ స్టూడియో చూసే అరుదైన అవకాశం అందుకున్నాను. ఆయన పోస్ట్ ప్రాజెక్ట్స్, అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ వివరంగా చూపించారు. ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది.
యానిమేషన్ నుంచి స్విమ్మింగ్ వైపు..
ఆరోగ్యపరంగా స్విమ్మింగ్ చేయాల్సి వచ్చింది. నీళ్లంటనే మొదట్లో భయం. స్విమ్మింగ్‌లో చేరిన మొదటిరోజే అనుకున్నాను.. వాటర్ ఫోబియాను జయించాలంటే ఏదైనా గోల్ పెట్టుకువాలని.. మంచి కోచ్ దొరకడంతో చాలా త్వరగా నేర్చుకోగలిగాను. ఈత పోటీల్లో పాల్గొన్నాలన్న లక్ష్యంతో రోజూ మూడు, నాలుగు గంటలు సాధన చేసేదాన్ని. మూడునెలల తర్వాత జరిగిన ఈతపోటీల్లో మెడల్ కూడా సాధించాను. ఆ తర్వాత అంతర్జాతీయ ఈత పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చినా ఆర్థికపరిస్థితుల వల్ల వెళ్లలేక పోయాను. రెండేండ్లు కఠోర సాధన తర్వాత కృష్ణనదిలో ఈత పోటీలు జరుగుతాయని తెలిసి నేను పాల్గొన్నాను. నిర్ణిత సమయంలో కిలోమీటరన్నర దూరం ఈదగలిగాను. డి.ఆర్. డి. ఎల్ (డిఫెన్స్ లో) మహిళా కోచ్‌గా క్లాసులు నిర్వహించాను. ఆ తర్వాత గోవాలో జరిగిన అంతర్జాతీయ ఈత పోటీల్లో పాల్గొనే అవకాశం చివరి నిమిషంలో చేజారిపోయింది. అయినా వాలంటీర్‌గా పనిచేసి ఆర్గనైజర్స్ ప్రోత్సహంతో సముద్రంలో ఈదగలిగాను. మెడల్ రాకపోయినా.. ఎంతో అనుభవం వచ్చింది. నెక్ట్స్ టైమ్ తప్పక పతకం సాధించాలని నిర్ణయించుకున్నాను.
ఆర్థికస్వాతంత్య్రం ముఖ్యం..
ఆడవారు ఖాళీగా ఉండే కంటే ఏదైనా వారికి ఆసక్తి ఉన్న ఉద్యోగమో, ఉపాధియో చూసుకోవాలి. వారిలో అంతర్లీనంగా ఉండే ప్రతిభను, సృజనాత్మకతను ఉపయోగించి తమకంటూ కొంతైనా సంపాద ఉండేలా చూసుకోవాలి. వారిలో ఆత్మవిశ్వాసం పెంచడానికి ఆర్థికస్వాతంత్య్రం అనేది ఎంతో అవసరం.
అవార్డులు
యానిమేషన్స్‌లో..
మొదటి షార్ట్ ఫిలిం ''మీరే చెప్పండి'' ''బెస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిలిం అవార్డు'
2. కోవే మహిళా అర్గనైజేషన్ నుండి ''ఔట్ స్టాండింగ్ ఎచీవ్ మెంట్ అవార్డు''
3. టీవీ 5 నుంచి బిజినెస్ లీడర్ అవార్డు
స్పోర్ట్స్‌లో..
స్విమ్మింగ్‌లో స్టేట్, నేషనల్లలో బంగారు పతకాలు.
అథెటిక్స్‌లో : స్టేట్ లెవెల్ లో రన్నింగ్ 800 మీటర్లు, హేమర్ త్రో, షాట్ పుట్ లలో బంగారు పతకాలు.