Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎటువంటి మచ్చలు లేకుండా, నునుపుగా, గులాబీ రంగులో క్రమపద్ధతిలో పెరిగే గోళ్లు చక్కటి శారీరక ఆరోగ్యానికి సూచికలు. అలా కాకుండా గోర్ల రంగు, ఉపరితలం, ఆకారాల్లో మార్పులు వస్తే అవి అనారోగ్యాన్ని సూచిస్తున్నట్లు లెక్క. సాధారణంగా ఏ ఏ లక్షణాల ద్వారా గోళ్లు ఏ ఏ అనారోగ్యాలను సూచిస్తాయో తెలుసుకుందాం.
చిన్న చిన్న గుంటలు పడితే : సొరియాసిస్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ త్వరలో రావచ్చనే సంకేతాలను ఇవి ఇస్తుంటాయి. ఒక్కోసారి గోర్ల అడుగున ఉన్న కండ బాగా ముదురు ఎరుపురంగులో కూడా కనిపిస్తుంది.
గోర్లు పొడారిపోయి, చిట్లిపోతూ, పగిలిపోతూ ఉంటే : ఇలా ఉండే గోళ్లు థైరాయిడ్ వ్యాధిని సూచిస్తాయి. ఈ లక్షణాలతోపాటు, పసుపు రంగులో కనిపిస్తుంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్.
గోరు చుట్టూ ఉన్న ప్రాంతం ఎర్రగా ఉబ్బి ఉంటే : ఇది గోరు చుట్టూ ఉన్న కణజాలానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ను సూచిస్తుంది.
పాలిపోయినట్లు నిర్జీవంగా కనిపిస్తుంటే : పాలిపోయిన గోళ్లు సాధారణంగా రక్తహీనతను సూచిస్తాయి. కానీ ఒక్కోసారి ఇవి కాలేయ సంబంధిత వ్యాధులనూ, గుండెజబ్బులనూ, పోషకాహార లేమిని కూడా సూచిస్తుంటాయి.
కొసల్లో నల్లని అంచులా ఏర్పడితే : ఇలా ఉండే గోళ్లు కాలేయ సంబంధిత వ్యాధులైన కామెర్లను, హెపటైటిస్ వంటి వాటిని సూచిస్తాయి.
పసుపు రంగులో కనిపిస్తే : సాధారణంగా ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి థైరాయిడ్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, సోరియాసిస్ వంటి తీవ్రమైన వ్యాధులను సూచిస్తాయి.
నీలిరంగులోకి మారితే : శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందకపోవటాన్ని నీలం రంగులోకి మారిన గోర్లు సూచిస్తాయి. ఒక్కోసారి ఇవి ఊపిరితిత్తుల పనితీరు బాగోకపోవడాన్నో లేదా గుండె జబ్బులనో సూచించవచ్చు.
గోళ్లు కొరకడం : గోళ్లు కొరకడం ఒత్తిడికి సంబందించిన సంకేతాన్ని, ఒక్కోసారి కంపల్సివ్ అబ్సెసివ్ డిసార్డర్ అనే మానసిక వ్యాధిని సూచిస్తుంది. ఎంత ప్రయత్నించినా తరచూ గోళ్లు కొరకడం మానలేకపోతుంటే వైద్యులను సంప్రదిం చడం మంచిది. అయితే ఒక్కోసారి అనేక కారణాల వల్ల గోళ్లల్లో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. అంత మాత్రానే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కానీ తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిది.