Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటికోసం ఎంచుకునే ఫర్నిచర్ ఆకర్షణీయంగా, సౌకర్యంగా ఉండాలి. అన్నిటికీ మించి మన బడ్జెట్లో ఇమిడిపోయేదై ఉండాలి. ఆ కోవకు చెందిన వాటిలో 'కేన్' ఫర్నిచర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వెదురు బద్దలతో తయారయ్యే కేన్ ఫర్నిచర్ ఇల్లంతటిలో ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. మిగతా ఫర్నిచర్లకు భిన్నంగా తొణకకుండా, చక్కటి పట్టుతో నేలను అంటిపెట్టుకుని ఉండగలిగే ఈ రకం ఫర్నిచర్ వల్ల ఇంటికి నేచురల్ స్టయిల్ అబ్బుతుంది. కాబట్టే లివింగ్ రూమ్‌లో ఎక్కువ శాతం మంది కేన్ ఫర్నిచర్‌కే ప్రాధాన్యమిస్తూ ఉంటారు.
- అయితే వాతావరణ మార్పులకు ప్రభావితమయ్యే ఈ ఫర్నిచర్‌ను ఆ మార్పులకు తగ్గట్టుగా మలచుకోగలిగితే ఎక్కువ కాలంపాటు చెక్కుచెదరకుండా ఉంటుంది.
- వెదురు ఫర్నిచర్ సూర్యరశ్మిని తట్టుకోలేదు. ఎక్కువ సమయం ఎండ వేడికి గురైతే కేన్ బద్దలు పెళుసుబారి విరిగిపోతాయి. కాబట్టి నేరుగా ఎండ ప్రసరించే ప్రదేశానికి ఈ ఫర్నిచర్‌ను దూరంగా ఉంచాలి. వేడి గాలులు కూడా ప్రమాదమే! కాబట్టి వేసవిలో కిటికీలు, తలుపులకు ఎదురుగా ఈ ఫర్నిచర్‌ను ఉంచకూడదు. ఈ కాలంలో కేన్ ఫర్నిచర్ చెక్కుచెదరకుండా ఉండాలంటే వారానికోసారి తడిపిన గుడ్డతో తుడవాలి.
- కేన్ ఫర్నిచర్‌కు వేసిన కోటింగ్ మెరుపు తగ్గకుండా ఉండాలంటే మెత్తని డస్టింగ్ క్లాత్‌తో ప్రతిరోజూ పైన పేరుకున్న దుమ్ము దులిపేస్తూ ఉండాలి. నీళ్లలో వాటర్ డిటర్జెంట్ కలిపి ఆ నీళ్లతో తుడిస్తే అంటుకుపోయిన మట్టి, దుమ్ము మరింత తేలికగా వచ్చేస్తాయి. ఫర్నిచర్ మూలల్లో, జాయింట్లలో ఇరుక్కుపోయిన మట్టిని తొలగించటం కోసం మెత్తని కుదుళ్లున్న బ్రష్‌ను వాడొచ్చు. ఇలా ఫర్నిచర్‌ను పూర్తిగా శుభ్రం చేశాక పొడి బట్టతో తుడిచి ఆరనివ్వాలి. తేమగా ఉన్నప్పుడే కుషన్లు, కవర్లతో నింపేస్తే వెదురు బూజు పట్టే ప్రమాదం ఉంటుంది.
- కేన్ ఫర్నిచర్ మీద మచ్చలు పడినపుడు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. లేదంటే శాశ్వతంగా ఉండిపోతాయి. కాబట్టి సున్నితమైన బ్రష్ తీసుకుని సబ్బు నీటితో మరకను రుద్ది వదిలించాలి. లోతుగా ఇంకిన మరకలు, మచ్చల్ని వదిలించటానికి శాండ్ పేపర్ వాడొచ్చు. అయితే తర్వాత తప్పనిసరిగా వాక్సింగ్ చేయాలి.
- పాతబడేకొద్దీ కేన్ ఫర్నిచర్ మీద పోగులు లేస్తూ ఉంటాయి. వాటిని వేళ్లతో పీకితే లోతుగా గాడి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం మాని పూర్తి ఫర్నిచర్‌ను శాండింగ్ చేయాలి. అంటే శాండ్ పేపర్‌తో బలంగా రుద్ది పోగుల్ని వదిలించాలి. ఇలా శాండింగ్ చేసేటప్పుడు ఫర్నిచర్ పొడిగా ఉండేలా చూసుకోవాలి. తడిగా ఉంటే మరిన్ని ఫైబర్లు లేచే ప్రమాదం ఉంటుంది.
తేమగా ఉన్న ఫర్నిచర్లో కూర్చోకూడదు. అలా కూర్చుంటే వెదురు బద్దలు సాగిపోయి ఫర్నిచర్ పటుత్వం కోల్పోయే ప్రమాదం ఉంది. ఎక్కడైనా విరిగినా, పగుళ్లొచ్చినా వెంటనే ఆ ప్రదేశంలో ఫైన్ శ్యాండ్ పేపర్‌తో రుద్ది వ్యాక్స్ అద్ది కేన్ రీకండిషన్ చేయాలి.