Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చేతులు, కాళ్లు లేకపోతే సగం జీవితాన్ని కోల్పోయినట్లేనని కొంతమంది భావిస్తారు. కానీ, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే.. సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఇందుకు ఈ మహిళా పైలటే నిదర్శనం. ఆమె... అమెరికాకు చెందిన జెస్సికా కాక్స్. ప్రపంచంలోనే ఏకైక.. ఆర్మ్లెస్ (చేతుల్లేని) పైలట్. అంతులేని ఆత్మవిశ్వాసం ఆమె సొంతం. శారీరక వైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో జయించింది.
జెస్సికాకు పుట్టుకతోనే రెండు చేతులూ లేవు. తల్లిదండ్రులు ఇనెజ్, విలియంలు ఎందరో వైద్యులకు చూపించారు కానీ ఫలితం లేకపోయింది. చేతులు లేని జెస్సికాకు తల్లే అండ అయింది. తల్లి ఇనెజ్ కొన్ని బొమ్మలను తీసుకొచ్చి జెస్సికా ముందు పెట్టేది. వాటిని కాళ్లతో పట్టుకుని జెస్సికా ఆడుకునేది. అలా ఆమె జీవితం మొదలైంది. ఏనాడూ తన అంగవైకల్యాన్ని చూసుకుని కుంగిపోలేదామె. జీవితానికి ఎదురీదింది. జెస్సికా చిన్నతనం నుంచి ఎంతో చురుగ్గా ఉండేది. 14 ఏళ్ల వరకూ ప్రోస్థటిక్ చేతులను పెట్టుకుంది. తర్వాత వాటిని వాడొద్దని నిశ్చయించుకుంది. కాళ్లతోనే అన్ని పనులూ చేసుకోవాలని భావించింది. 'నాలోని భిన్నత్వాన్ని నిరూపించాలనుకున్నాను' అని జెస్సికా ఒక సందర్భంలో అంది. సొంత ఊరు సెర్రా విస్టా నుంచి టస్కన్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా నుంచి సైకాలజీలో డిగ్రీ తీసుకుంది. మార్షల్ ఆర్ట్ తైక్వాండోలో రెండు బ్లాక్ బెల్ట్లు సాధించింది. అమెరికన్ తైక్వాండో అసోసియేషన్లో బ్లాక్ బెల్ట్స్ సాధించిన చేతులు లేని తొలి డిఫరెంట్లీ ఏబుల్డ్ మహిళగా రికార్డు స ష్టించింది. అంతేకాదు ఆమె స్విమ్మింగ్లో కూడా ఎంతో నైపుణ్యాన్ని సాధించింది. కాళ్లతోనే అన్ని పనులూ చేస్తుంది.
విమానం నడపడమంటే జెస్సికాకు ఎంతో ఇష్టం. కానీ అది తనవల్ల కాదనుకుంది. అందుకే కలల్లో తనను తాను సూపర్విమెన్గా ఊహించుకునేది. కానీ అనుకోకుండా ఆమె కల నెరవేరింది. ఒక ఫైటర్ పైలెట్ విమానం నడుపుతావా అని జెస్సికాను అడిగాడు. దానికి మొదట ఆశ్చర్యపోయింది. తన పరిస్థితి తెలిసే అతను అలా అడుగుతున్నాడా అనే అనుమానం కూడా వచ్చింది. కానీ అతను జెస్సికాను వదల్లేదు. అదే ప్రశ్నను మళ్లీ మళ్లీ అడిగాడు. దాంతో ఆమెలో కూడా విమానం నడపాలనే కోరిక తీవ్రమైంది. అలా విమానం నడపడం మొదలెట్టింది. ఎర్కోప్ ఎయిర్ క్రాఫ్ట్ నడపడం నేర్చుకుంది. దీన్ని చేతులతో నియంత్రించాల్సి ఉంటుంది. కానీ చేతులు లేని జెస్సికా ఆ విమానాన్ని తన కాళ్లతో సాధన చేసింది. విమానం నడపడానికి ఆమెకు మూడు సంవత్సరాలు పట్టింది . అంతేకాదు మూడేళ్ల వయసు నుంచే జెస్సికా జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం ప్రారంభిం చింది. టాప్ డాన్సింగ్ని కూడా నేర్చుకుంది. మోడలింగ్ చేసింది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆర్మ్లెస్ సర్ఫీంగ్, ఆర్మ్లెస్ స్కూబా డైవింగ్లలో కూడా జెస్సికా దిట్ట. జెస్సికాలోని ఈ ప్రత్యేకతలు పాట్రిక్ చాంబెర్లైన్ని ఆకర్షించాయి. అతను మార్షల్ ఆర్ట్స్ ఇన్స్ట్రక్టర్. ప్రేమకు వైకల్యం అడ్డుకాదని... ఆమె కాలికి ఉంగరం తొడికి ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నారు చాంబెర్లైన్.