Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మౌనికకు మూడు పదులు నిండలేదు. అప్పుడే రెండు పెండ్లిళ్లు. మొదటి భర్త చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. రెండోభర్త ఇంట్లోకి రావద్దు అన్నాడు. పుట్టింటివాళ్ల ఆదరణ లేదు.. అత్తింటివాళ్ల ఆచూకీ తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఐద్వా అదాలత్‌కు వచ్చింది. నీరసంగా అడుగులో అడుగు వేస్తూ వచ్చిన మౌనికను ముందుగా కాస్త స్థిమితపడమని చెప్పారు బాధ్యులు. చల్లనీ నీటితో ముఖం, కాళ్లుచేతులు కడుక్కొని, రెండు గ్లాసుల నీళ్లు తాగింది. కొద్ది నిమిషాల పాటు మౌనంగా ఉన్న ఆమె కండ్లల్లో కాస్త జీవం రాగానే.. వెక్కివెక్కి ఏడుస్తూ..మేడమ్ మీరే నన్ను కాపాడాలంటూ బాధ్యుల కాళ్లపై పడబోయింది. ఆమెను వారిస్తూ.. ముందు ఏం జరిగిందో చెప్పు అన్నారు.
'పదోతరగతి వరకు చదువుకున్నాను. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో అమ్మ ఎంతో కష్టపడి నన్ను, అన్నయ్యను పెంచింది. అన్నయ్య డిగ్రీవరకు చదువుకు న్నాడు. ప్రైవేటు జాబ్ చేస్తాడు. నేను పదోతరగతి చదువుతున్నప్పుడే మా ఇంటి పక్కన ఉండే క్యాబ్ డ్రైవర్ మురళి ప్రేమ అంటూ వెంటపడ్డాడు. ఇంట్లో వాళ్లకు చెప్పాను. అతనికి తల్లిదండ్రీ ఎవరూ లేరు. కట్నం ఇచ్చుకోలేని మా పరిస్థితిని ఆసరా చేసుకుని ' పెండ్లి చేయండి చాలు' అన్నాడు. అమ్మ, అన్నయ్య ఉన్నంతలో పెండ్లి బాగానే చేశారు. ఏడాది పాటు కలిసే ఉన్నాం. ఆ తర్వాత అతను ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళ్లాడో తెలియదు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. మురళికి సంబంధించిన వాళ్ల అడ్రసులు మాతో లేకపోవడంతో ఆయన గురించి తెలియలేదు. ఆ తర్వాత నేను అమ్మవాళ్లింటికి వచ్చేశాను.
మళ్లీ రెండోసారి..
ఒక షాపులో సేల్స్‌గర్ల్‌గా చేరాను. దాదాపు ఐదేండ్ల వరకు నా ఉద్యోగం, ఇల్లు తప్ప మరేదీ పట్టించుకోలేదు. మురళి గురించిన ఆలోచనలే. ఎప్పటికైనా తిరిగి వస్తాడన్న ఆశ. ఇలాంటి సమయంలో మోహన్ పరిచయం అయ్యాడు. అతనికి నా గురించి అంతా తెలుసు. ఎంతో ధైర్యం చెప్పేవాడు. క్రమంగా మురళి జ్ఞాపకాలలో నుంచి బయటపడ్డాను. ఒకరోజు మోహన్ 'నిన్ను పెండ్లి చేసుకుంటాను. మీ ఇంట్లో వాళ్లలో మాట్లాడుతాను' అన్నాడు. అమ్మ, అన్నయ్య 'ఇప్పటికే ఒకసారి మోసపోయావు.బంధువుల్లో పరువు పోయింది. మళ్లీ రెండోసారి ప్రేమ, పెండ్లి అంటూ పిచ్చిపనులు చేయకు' అంటూ తిట్టారు. మోహన్‌కు మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని చెప్పాను. 'నేనంటే ఇష్టం ఉంటే నాతో పాటు వచ్చేయి' అన్నాడు. తిరిగిరాని మురళి కోసం ఎదురుచూడటం, అమ్మ, అన్నయ్యలతో ఉంటూ ఒంటరిగా మిగిలిపోవడం కన్న మోహన్‌ను పెండ్లి చేసుకోవడమే నయం అనిపించింది. అతనితో వెళ్లిపోయాను.
మెడపట్టి బయటకు..
మోహన్ తల్లిదండ్రులు ఊరిలో ఉంటారు. ఇక్కడ రూం తీసుకుని ఉంటున్నాడు. గుడిలో పెండ్లి చేసుకున్నాం. వాళ్ల ఊరికి తీసుకుపోయి కోడలిగా పరిచయం చేశాడు. అక్కడ వారం రోజులు ఉండి తిరిగి హైదరాబాద్ వచ్చాం. నా జీతమంతా తీసుకునేవాడు. ఆరునెలల బాగానే ఉన్నాడు. ఆ తర్వాత గొడవలు ప్రారంభం. ఇంట్లోకి సరుకులు లేవని అడిగితే 'నేను తేకపోతే నీ మొదటి మొగుడు తెస్తాడా?' అంటూ చీటికి మాటికి నిందిస్తూ మాట్లాడేవాడు. ఆ తర్వాత నేను నా జీతం ఇవ్వడం మానేశాను. తాగి వచ్చి డబ్బులు ఇవ్వమని కొట్టేవాడు. రెండేండ్లు భరించాను. ఒక రోజు నేను ఇంటికి వెళ్లేసరికి నా వస్తువులన్నీ బయట పడేశాడు.' నువ్వు ఇంట్లోకి రావడానికి వీలులేదు. వెళ్లిపో' అంటూ మెడపట్టి బయటకు గెంటేశాడు. అమ్మ, అన్నయ్య ఇంట్లోకి రానివ్వడం లేదు. అత్తగారింటికి వెళ్దామంటే నాకు సరిగ్గా అడ్రసు తెలియదు. రెండు రోజుల నుంచి ఇంటి ముందే ఉన్నా పట్టించుకోకుండా తాళం వేసి వెళ్లిపోయాడు.
'సరే అతని నెంబర్ ఇవ్వు మాట్లాడుతాం' అన్నారు బాధ్యులు. మౌనిక ఇచ్చిన నెంబర్‌కు నాలుగైదు సార్లు ఫోన్ చేసిన తర్వాత మోహన్‌తో మాట్లాడటం వీలైంది. మౌనిక విషయం చెప్పితే ' ఆమె ఎవరో నాకు తెలియదు. నేను పెండ్లి చేసుకున్నట్లు ఆధారాలు ఉంటే చెప్పండి' అన్నాడు. 'ఆధారాలు చూపిస్తాం. నువ్వు ముందు ఇక్కడికి రా' అన్నారు బాధ్యులు.
అండగా నిలబడితే..
'గుడిలో దండలు మార్చుకున్నాం. ఫోటోలు లేవు' అంది మౌనిక. వెంటనే మౌనిక అమ్మ, అన్నయ్యలకు ఫోన్ చేశారు. 'మా మాట వినకుండా వాడితో వెళ్లిపోయింది. రెండుసార్లు మా పరువు తీసింది. ఎక్కడికైనా వెళ్లమని చెప్పండి. మా ఇంటికి మాత్రం రావద్దు. కొడుకు పెండ్లి చేద్దామనుకుంటున్నాను. ఆమె వస్తే మాకు కష్టాలు' అంది మౌనిక అమ్మ. ' ప్రేమ అంటూ వెంటపడిన వ్యక్తిని నమ్మింది. మోసపోయిన మీ బిడ్డను మీరు ఆదరించాలే కానీ, ఇలా దూరం చేసుకోవచ్చా. మీరు తప్ప ఆమెకు ఎవరు ఉన్నారు? మీరు అండగా నిలబడితే మోహన్‌కు బుద్ధి చెప్పవచ్చు. అతనిలో మార్పు వస్తే మీ బిడ్డ జీవితం బాగుపడుతుంది కదా!' అన్నారు. 'సరే మేడమ్ మేం వస్తాం. అయితే మౌనిక మా మాట వినాలి' అన్నారు.
ఎప్పుడు గొడవలే...
'సరే మీరు రండి. ఆమెకు నచ్చచెప్పుతాం' అన్నారు బాధ్యులు. రెండువారాల తర్వాత మోహన్, మౌనిక, ఆమె అమ్మ, అన్నయ్య వచ్చారు. మౌనికకు అండగా ఆమె అమ్మ, అన్నయ్య రావడంతో మోహన్ కాస్త భయపడ్డాడు. 'మౌనికను పెండ్లి చేసుకున్నావా? లేదా? నిజం చెప్పు. మీరిద్దరూ కలిసి ఉన్న ఇంటి ఓనరును, మీ అమ్మనాన్నకు కూడా పిలిపిస్తాం. ఆమెను మోసం చేయాలని చూస్తే జైలుకు వెళ్లాల్సిందే' అన్నారు బాధ్యులు. 'చేసుకున్నాను. అయితే ఆమె ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని చెప్పాను. ఆమె గురించి తెలిసే వాళ్ల అమ్మ, అన్నయ్య కూడా ఇంట్లోకి రానివ్వరు. చెప్పిన మాట వినదు. ఎప్పుడు గొడవలే. మా అమ్మవాళ్లతో కూడా మాట్లాడనివ్వదు. ఆమెకు ఎవరూ వద్దు. ఒంటరిగా ఉండటమే ఇష్టం. అలా చేసే మొదటి మొగుడిని ఇంట్లో నుంచి తరిమేసింది. రేపు నేను అలాగే ఇంటినుంచి వెళ్లిపోయేలా చేస్తుంది. ఇంత జరిగినా బుద్ధి రాదు' అన్నాడు మోహన్.
అన్నీ తెలిసే..
'ఆమె గురించి అన్నీ తెలిసే పెండ్లి చేసుకున్నావు. ఎంతో ధైర్యాన్నిచ్చావు. ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదు. చిన్నచిన్న విషయాలకు విడిపోవడం జీవితం కాదు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. మౌనికకు మేం సర్దిచెప్పుతాం. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోండి. ప్రేమతో దగ్గరైన మీరూ చిన్నచిన్న విషయాలకై విడిపోవడం సరికాదు. మౌనిక వాళ్ల అమ్మ, అన్నయ్య కూడా వచ్చారు. మీకు వాళ్లు కూడా మద్దతుగా ఉంటారు. అందరూ కలిసిమెలిసి ఉంటేనే జీవితం ఆనందంగా సాగుతుంది.' అన్నారు బాధ్యులు. కాసేపు మౌనిక, మోహన్ మాట్లాడుకున్నారు. మౌనిక అమ్మ, అన్నయ్య కూడా మోహన్‌కు నచ్చచెప్పారు. ఇక నుంచి తాము అండగా ఉంటామన్నారు. దాంతో మౌనికతో కలిసి ఉండేందుకు మోహన్ అంగీకరించాడు. 'గుడిలో పెండ్లి చేసుకున్నారు. కలిసి ఉన్నారు. అయితే ఇకమీదట ఇలాంటి సమస్యలు రాకుండా ముందుగా రిజిష్టర్ ఆఫీస్‌లో పెండ్లి చేసుకోవాలి. ఏ సమస్య వచ్చినా ఇక్కడికి రండి. మీ ఇద్దరి మధ్య సఖ్యత పెరిగేవరకు ప్రతి వారం ఇక్కడకు రావాలి' అన్నారు బాధ్యులు.'కలిసి ఉంటాం. ఏ సమస్య వచ్చినా ఇక్కడికే వస్తాం' అంటూ ఇద్దరూ రిజిష్టర్‌లో సంతకాలు చేశారు.
'ఆడపిల్లలు సున్నిత మనస్తత్వం కలవారు. తర్వాతగా ఎదుటివారిని నమ్ముతారు. దానిని ఆసరాగా చేసుకుని మోసం చేసేవాళ్లుఉంటారు. అయితే పుట్టింటి నుంచి వారికి మద్దతు లేదని తెలిస్తే కట్టుకున్నవాడు మరింతగా హింసిస్తాడు. ఆడపిల్లకు పుట్టిల్లు భరోసా ఇవ్వాలి. మీ బిడ్డ కష్టాలు భరించలేక ఏదైనా అఘాయిత్యం చేస్తే ఆ బాధ జీవితాంతం అనుభవించేది మీరే కదా! పిల్లలకు మంచీచెడు చెప్పండి. పొరపాటు చేశారని వారిని వదిలేయకండి' అన్నారు బాధ్యులు.
- వి. యశోద