Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంతమందికి కొన్ని రకాల ఫోబియాలు ఉంటాయి. దాంతో వాటికి దూరంగా ఉంటారు. అయితే ఆ ఫోబియాను జయించడానికి మాత్రం ఇష్టపడరు. అయితే రాజీ మాత్రం ఫోబియాతో రాజీ పడలేదు. భయపెట్టే అంశానికి మరింత చేరువగా వెళ్లినప్పుడు ఆ భయం పటాపంచలైపోతుందని నిరూపించారు. ఎక్రోఫోబియాను ఎదిరిస్తూ ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలను అధిరోహించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. తనతో పాటు పర్వాతారోహణపై ఆసక్తి ఉన్న వారికి గైడెన్స్ ఇస్తున్నారు. అతిపెద్ద జాతీయజెండాను కిలిమంజారోపై ఎగురవేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు సాధించారు. తమ టీమ్‌లో ఏడేండ్ల బాబు పర్వతారోహణతో వరల్డ్ రికార్డు సాధించారు. అడ్వెంచర్ రంగంలో శిక్షణ ఇచ్చేలా 'బూట్స్ అండ్ క్రాంపోన్స్' సంస్థను ఏర్పాటుచేసిన ఆమె పరిచయం..
పర్వతారోహణపై మీకు ఇష్టం ఎలా కలిగింది?
నాకు చిన్నప్పటి నుంచి యక్రో ఫోబియా ఉండేది. రెండు, మూడో అంతస్తుకు వెళ్ళాలంటేనే భయం అయ్యేది. ఆ భయం నన్ను అలా పర్వతాలను అధిరోహించేవరకు వెంటాడుతూనే ఉంది. పెండ్లయ్యి బాబు పుట్టిన తర్వాత ఒక రోజు మా తమ్ముడితో మాట్లాడుతున్నప్పుడు నా భయం పోవాలంటే పర్వతాలు అధిరోహించాలి అన్నాడు. పర్వతారోహణలో నెల రోజులు ట్రైనింగ్ తీసుకుంటే భయం పోతుందని ధైర్యం చెప్పాడు. ఇప్పుడు ఎత్తైన ప్రదేశాలను చూసినప్పుడు భయం కలగడం లేదు. ఆ ఎత్తును హత్తుకోవాలనిపిస్తుంది. భయం అంటూ ఉండిపోతే ఆ భయం ఎప్పటికీ వెన్నంటే ఉంటుంది. దాన్ని జయించాలంటే భయాన్ని హత్తుకోవాలి అనిపించింది. ఇది కేవలం పర్వతారోహణలోనే కాదు ఏ అంశానికైనా అనువదించుకోవచ్చు.
మీ తమ్ముడు పర్వతారోహకుడా?
మా తమ్ముడు భరత్. సైనిక్ స్కూలులో చదివిన వాడికి చిన్నప్పటి నుంచి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. ప్రపంచంలోని ఎత్తైన సెవన్ సమ్మిట్స్‌లో ఐదింటిని అధిరోహించాడు. మిగతా రెండింటితో పాటు ఎత్తైన, రిస్క్‌తో కూడిన పర్వతాలను కూడా అధిరోహించే ప్రయత్నంలో ఉన్నాడు.
మీ గురించి చెప్పండి.
మాది కర్నూలు. నాన్న నాగరాజు, అమ్మ సుశీల. ఇంటర్ వరకు కర్నూలులోనే చదివాను. స్కూలులో ఉన్నప్పుడు చాలా గేమ్స్ ఆడేదాన్ని. హాకీలో జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైనప్పటికీ పదోతరగతిలో ఉండటంతో స్కూలు వారు పర్మిషన్ ఇవ్వలేదు. రన్నింగ్‌లో బహుమతులు వచ్చేవి. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ, ఎవీ కాలేజీలో ఎంబిఎ(ఫైనాన్స్) పూర్తి చేశాను. ఆ తర్వాత ఫైనాన్స్ ఎనలిస్ట్‌గా ఆరెేండ్లు పనిచేశాను. పెండ్లి, బాబు పుట్టిన తర్వాత ఉద్యోగం మానేశాను.
మొదటిసారి మీరు కిలిమంజారో ఎప్పుడు అధిరోహిం చారు?
ఎక్రోఫోబియాను జయించడానికి మా తమ్ముడు చెప్పిన సూచన నచ్చింది. అప్పుడు బాబుకు రెండేండ్లు. మా వారు కూడా సరే అనడంతో పర్వతారోహణలో నెలరోజుల శిక్షణ తీసుకున్నాను. 2015లో శిక్షణ తీసుకున్న ఏడాదే ఎవరెస్ట్ పర్వతం అధిరోహించే ప్రయత్నం చేశాను. మా బ్యాచ్‌లో మొత్తం 70మంది శిక్షణ తీసుకుంటే అందులో 20మంది మాత్రమే పీక్ వరకు వెళ్లగలిగాం. ఆ తర్వాత ప్రపంచంలోని మరో ఎత్తైన పర్వతం కిలిమాంజారోను అధిరోహించగలిగాను. ఆ తర్వాత టీమ్‌ను తీసుకుని మరో రెండుసార్లు కిలిమంజారో శిఖరాగ్రాన్ని చేరుకున్నాను.
'బూట్స్ అండ్ క్రాంపోన్స్' సంస్థను ఎప్పుడు ప్రారంభించారు? ఎలాంటి శిక్షణ ఇస్తుంటారు?
అడ్వెంచర్స్ ద్వారా లైఫ్ సిల్క్ నేర్పించాలన్న ఆలోచనతో 'బూట్స్ అండ్ క్రాంపోన్స్' సంస్థను 2017లో ప్రారంభించాం. మా సంస్థ ద్వారా అడ్వెంచర్స్ చేయాలన్న ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తాం. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో చదివే పిల్లలకు శిక్షణ ఇచ్చాం. గురుకుల పాఠశాల, ట్రైబల్ వెల్ఫే˜ర్ విద్యాసంస్థల, కస్తూరిబా కాలేజీల విద్యార్థులకు శిక్షణ పూర్తి చేశాం. దేవనార్ బ్లైండ్ స్కూలులోని మూడువందల మంది విద్యార్థులకు కూడా లైఫ్ స్కిల్స్‌పై శిక్షణ ఇచ్చాం. కిలిమంజారో పర్వతారోహణకు మూడు టీమ్‌లను తీసుకువెళ్లాం. నేపాల్, ఉత్తరాఖండ్‌లోని పర్వతారోహణకు టీమ్స్‌ను తీసుకువెళ్ళాం.
అడ్వెంచర్స్ చేసే సమయంలో మీకు ఎలాంటి ప్రోత్సాహం లభించింది?
ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ముందుకు వస్తున్నారు. చాలామంది అడ్వెంచర్స్ అంటే అబ్బాయి మాత్రమే చేయాలన్న ఆలోచనతో ఉంటారు. కానీ, పర్వతాలకు మాత్రం లింగవివక్ష తెలియదు. తమపై ఎవరు కాలు పెట్టినా, శిఖరాగ్రాన్ని చేరాలని ప్రయత్నించినా అవి సమానంగానే చూస్తాయి. ఆడపిల్లలు పర్వతారోహణ చేస్తున్నారని అవి ఏం బాధపడవు. ప్రకృతికి లేని వివక్ష ఈ మనుషులకు ఎందుకు అనిపిస్తుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేసేవారికి వారి మనోసంకల్పమే సంపూర్ణ ప్రోత్సాహం.
మీ భవిష్యత్ కార్యక్రమాలు?
అడ్వెంచర్ అంటే లగ్జరీ అనుకునేవారు. కానీ, ఇప్పుడు అడ్వెంచర్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఎక్కువ మంది పర్వతారోహణ వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారికి గైడెన్స్ ఇస్తూ, టీమ్‌ను లీడ్ చేస్తూ పర్వతాలను అధిరోహించేందుకు సహకరిస్తున్నాం. దీనితో పాటుగా విద్యార్థులకు, యువతకు శిక్షణ ఇస్తున్నాం.
ఈ తరం పిల్లలకు ఇల్లు, స్కూలు, మొబైలు ఈ మూడే లోకంగా మారిపోయాయి. వారికి ప్రకృతితో పరిచయం లేదు. ఆపద వస్తే ఎలా బయట పడాలో తెలియదు. అడ్వెంచర్స్ ద్వారా లైఫ్ స్కిల్స్ ఎన్నో నేర్చుకునే అవకాశం ఉంది. అందుకే అడ్వెంచర్స్‌ను కరిక్యులంలో ఒక సబ్జెక్‌గా చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
కిలిమంజారో పర్వతారోహణలో మీరు సాధించిన రికార్డులు?
కిలిమంజారో పర్వతారోహణలో రెండు రికార్డులను మేం సాధించాం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అతిపెద్ద జాతీయ జెండాను మేం కిలిమంజారోపై ఎగురవేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించాం. మత్తు పదార్థాల వాడకాన్ని వ్యతిరేకిస్తూ యువత ఈ జెండాను ఎగురువేసింది. చేనేత దుస్తులను ధరించిన ఐదుగురి టీమ్ కిలిమంజారోను అధిరోహించింది. ఇందులో ఏడేండ్ల బాబు ఉన్నాడు. అతి చిన్నవయసులో పర్వాతారోహణ చేసి ప్రపంచరికార్డు సాధించాడు. కిలిమంజారో పర్వతారోహణతో పాటు ప్రపంచంతోని అతి ప్రమాదకరమైన పర్వతాన్ని కూడా చేరుకున్నాం. పర్వతారోహణలో చేనేతను వాడాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది?
చేనేత కార్మికుల కష్టాలు చిన్నప్పటి నుంచి దగ్గరగా చూశాను. అందుకే చేనేతను ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో కిలిమంజారో పర్వతారోహణలోని ఐదుగురి బృందం చేనేత వస్తాలను ధరించేలా ప్రోత్సహించాం. నారాయణపేట, గొల్లభామ(సిద్ధిపేట), ఇక్కత్(పోచంపల్లి), గద్వాల చేనేత వస్త్రాలు ధరించి పర్వతారోహణ చేశాం.
- వి. యశోద