Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుట్టిపెరిగింది కన్నడ రాష్ట్రంలో అయినా తెలుగు టీవీ ప్రేక్షకులకు ఆమె సుపరిచితురాలయ్యారు. కన్నడలో ఆమె నటించిన తొలి సీరియల్ 'కృష్ణారుక్మిణి'లో నటనకు గాను పలువురు ప్రశంసలు అందుకున్నారు. తెలుగు టెవిజన్ పరిశ్రమకు 'గోరంతదీపం' ద్వారా పరిచయమై 'పదు'గా తెలుగుప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ఆమే టీవీసీరియల్స్ హీరోయిన్ అంజనా శ్రీనివాస్.. ఆ తర్వాత 'పున్నాగ' లో నటనతో మరో మెగాసీరియల్ 'బంగారుగాజులు' లోనూ అవకాశం అందుకున్నారు. ఎనిమిదేండ్లుగా తన నటనతో ఆకట్టుకుంటున్న ఆమె పరిచయం..
నాన్న శ్రీనివాస్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. అమ్మ రాధ., టీచర్. బెంగుళూరులోని సుభాష్ చంద్రబోస్ హై స్కూలులో చదివాను. చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్‌లో ఎక్కువగా ఆసక్తి ఉండేది. టెలివిజన్‌లో వచ్చే డాన్స్ ప్రోగ్రామ్స్ బాగా చూసేదాన్ని. స్కూలులోనూ కాంపిటీషన్స్‌లో పాల్గొనేదాన్ని. మా టీచర్ ్సకూడా పెద్దపెద్ద కండ్లు బాగుంటాయి. ఆర్టిస్ట్‌గా బాగుంటావు అనేవారు. వారి మాటలు వింటుంటే నాకు ఆర్టిస్ట్ కావాలనిపించేది. అప్పటి వరకు మా కుటుంబంలో సినీ, టీవీ రంగంలో ఎవరూ లేరు.
వంద మంది ఆడిషన్స్‌లో..
డాన్స్ కాంపిటీషన్లో పాల్గొనేదాన్ని. అక్కడ ఒక మేకప్ ఆర్టిస్ట్ నన్ను చూసి ఆర్టిస్ట్‌గా బాగుంటావు, యాక్టింగ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. టీవీ ఆర్టిస్ట్‌గా ఆడిషన్స్ ఉంది వెళ్లమని చెప్పారు. అక్కడ ఆడిషన్‌కు వచ్చిన వారు వంద మందికి పైగా ఉన్నారు. వారందరినీ చూడగానే చాలా భయమేసింది. డైలాగ్ చెప్పడం కూడా రాలేదు. అక్కడ డైరెక్టర్ చాలా ప్రోత్సహించారు. ఆడిషన్స్ అయిన రెండునెలల తర్వాత రిజల్ట్ వచ్చింది. మొత్తం వంద మందిలో పదిమందిని సెలెక్ట్ చేశారు. ఆ పది మందిలో నా పేరు కూడా ఉండటం నేనే నమ్మలేక పోయాను. ఎంపిక చేసిన పదిమందికి మళ్లీ ఆడిషన్స్ తీసుకుని అందులో ఐదుగురిని సెలెక్ట్ చేశారు. ఆరేడు సార్లు మా ఐదుగురికి ఆడిషన్స్ తీసుకున్న తర్వాత చివరిగా సెలెక్ట్ అయ్యింది ఒకే ఒక్కరు. అదే నేను. నిజానికి నేనే ఆశ్చర్యపోయాను. డైరెక్టర్ ప్రోత్సాహమే నన్ను చివరివరకు నిలిచేలా చేసింది. ఆ తర్వాత నా ఒక్కదానికే దాదాపు పదిసార్లు ఆడిషన్స్ తీసుకున్నారు.
ఫస్ట్ సీరియల్లోనే హీరోయిన్గా..
'కృష్ణరుక్మిణి'నేను నటించిన మొదటి సీరియల్. కన్నడ సువర్ణ టీవిలో ప్రసారమైన ఈ సీరియల్లో రుక్మిణీగా లీడ్ రోల్ లో యాక్ట్ చేశాను. స్కూలు స్థాయిలో చిన్నచిన్న కల్చరల్ ప్రోగ్రామ్స్, డాన్స్ ప్రోగ్రామ్స్ చేయడం తప్పించి నాకు ఎలాంటి యాక్టింగ్ ట్రైనింగ్ లేదు. అయితే డైరెక్టర్ చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని, ఆ పాత్రలో పూర్తిగా లీనం అయిపోయేదాన్ని. దాని కోసం ఆ డైలాగ్స్ పదే పదే చదువుకోవడం, ఇంట్లో అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయడం వంటి హౌమ్‌వర్క్ చాలా చేశాను. దాంతో ఆ సీరియల్ లో నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.
కన్నడ టు తెలుగు..
కన్నడలో 'కృష్ణరుక్మిణి' సీరియల్ సూపర్ హిట్ అయ్యింది. నా నటనను ఎందరో అభినందించారు. దాంతో తెలుగు సీరియల్స్‌లోనూ అవకాశం వచ్చింది. మొదట్లో ఇక్కడకు నేను రావడానికి భయపడ్డాను. నెలరోజుల పాటు రోజూ ఫోన్లు వస్తూనే ఉన్నాయి. దాంతో ఒకసారి చూద్దామని వచ్చాను. 'గోరంత దీపం' కోసం ఒకేసారి ఆడిషన్ తీసుకుని సెలెక్ట్ అని చెప్పారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు రావడానికి కొద్దిగా భయపడ్డాను. ఇంట్లో వాళ్లు ప్రోత్సహించారు. 'యాక్టింగ్‌నే కెరీర్‌గా తీసుకోవాలనుకుంటే ఏ భాషలో అవకాశాలు ఉన్నా నటించాలి' అంటూ శ్రేయోభిలాషులు సూచించారు. దాంతో కన్నడ టు తెలుగులోకి నా నటన ప్రయాణం సాగింది. జీ తెలుగులో నేను నటించిన మొదటి సీరియల్ 'గోరంత దీపం'. ఇందులో పద్మావతి పాత్ర బాగా నచ్చింది. ఆ సీరియల్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా 'పద్దు' అంటూ గుర్తుపట్టేవారు. అభిమానంగా పలుకరించేవారు. ఆ పాత్రను చాలా ఎంజారు చేశాను. ఆ తర్వాత 'పున్నాగ'లోనూ లీడ్‌రోల్ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు 'బంగారు గాజులు'లోనూ లీడ్‌రోల్ చేస్తున్నాను. కన్నడలో అవకాశాలు వస్తున్నా షెడ్యూల్స్ కుదరడం లేదు. తెలుగులోనే చాలా బిజీగా ఉంటున్నాను.
పాత్రలో లీనమై..
సినీ పరిశ్రమలో చాలామందికి చిరంజీవిగారు రోల్‌మోడల్. ఆయన నటన నాకు చాలా ఇష్టం. ఇక హీరోయిన్స్‌లో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి కన్నడ నటి కల్పన. నాపై ఆమె ప్రభావం చాలా ఉంటుంది. ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది. ఆమె తర్వాత నేను అభిమానించే హీరోయిన్స్ సావిత్రి, భానుమతి, శ్రీదేవిగార్లు. వారు పాత్రలో లీనమై నటించే విధానం బాగా నచ్చుతుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించే అవకాశం వస్తేనే సినిమాల్లో నటిస్తాను. ఇంటింటికి నన్ను పరిచయం చేసిన టెలివిజన్ రంగాన్ని మాత్రం వదిలివెళ్లను.
హౌమ్‌వర్క్ చాలా ముఖ్యం..
యాక్టింగ్‌లో ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. సినిమాల్లోనూ, సీరియల్స్‌లోనూ ఆర్టిస్టుల నటనను బాగా పరిశీలించేదాన్ని. స్కూలు ప్రోగ్రామ్స్ చేసే సమయంలో వారిని అనుకరించేదాన్ని. నేర్చుకోవాలన్న తపన, ఇష్టమైన రంగంలో నిలబడాలన్న ఆసక్తి, కుటుంబ సభ్యుల ప్రోత్సహంతో ఈ రోజు టెలివిజన్ ఆరిస్ట్‌గా అభినందనలు అందుకుంటున్నారు. 2012లో టెలివిజన్ రంగంలోకి వచ్చాను. కొత్తగా అవకాశాలు వచ్చినా బిజీ షెడ్యూల్స్ కారణంగా చేయలేకపోతున్నాను. యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నవారైనా.. తీసుకోని వారైనా తప్పక చేయాల్సింది హౌమ్‌వర్క్. డైరెక్టర్ మనల్ని నమ్మి ఇచ్చిన పాత్రకు మనస్ఫూర్తిగా న్యాయం చేయాలి. అప్పుడే ఆ పాత్ర ప్రేక్షకుల్లో మనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుంది అన్నది నేను నమ్ముతాను. పాత్ర ఏదైనా సరే నటనకు ప్రాధాన్యత ఉండాలి. అప్పుడే ఆర్టిస్టులకు చాలెంజింగ్‌గా అనిపిస్తుంది. అలాంటి పాత్రలు చేయాడానికే ఇష్టపడతాను. సక్సెస్‌కు షార్కట్స్ ఉండవు అన్నది నేను గట్టిగా నమ్ముతాను.