Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు చెప్పులు లేకుండా.. పొలంగట్ల వెంట పరుగెత్తింది. ఇపుడు ఓ ఇంటర్నేషనల్ షూ కంపెనీకే బ్రాండ్ అంబాసిడర్ అయింది. సంచార జాతిలో పుట్టిన ఆ రైతు బిడ్డ... ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో దేశ పతాకను ఎగురవేస్తోంది. వరుసగా 20 రోజుల వ్యవధిలో ఐదు ఈవెంట్లలో విజేతగా ఐదు స్వర్ణాలు గెలిచి... గోల్డెన్ గాళ్ కీర్తిని సంపాదించుకుంది. ఇటీవల జరిగిన చెక్ రిపబ్లిక్ వేదికగా ఐదో పసిడి పతకాన్ని చేజిక్కించుకుని చరిత్ర సృష్టించింది హిమదాస్.
అసోం రాష్ట్రం నాగావ్ జిల్లాలోని కండూల్మరి.. హిమ సొంతూరు. తండ్రి వ్యవసాయం చేస్తాడు. వరి పండిస్తాడు. ఆ వరిపొల్లాల్లోని గట్లపైనే హిమ ప్రాక్టీస్ చేసింది. అథ్లెట్ కావాలని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. అందుకు కారణం దానికి అవసరమైన ట్రైనింగ్ ఇప్పించేంత ఆర్థిక సామర్థ్యం తల్లిదండ్రులకు లేకపోవడం ఒకటైతే. గ్రామంలో ఎలాంటి వసతులు ఉండకపోవడం మరోటి. 17 మంది ఉన్న ఉమ్మడి కుటుంబంలో పెరిగింది హిమ. సోదరులు, కజిన్స్ అందరి మధ్యలో తనొక్కతే భిన్నంగా ఉండేది. 15 ఏండ్ల వయసులో గ్రామంలోని మహిళలందరినీ ఏకం చేసి.. తమ ఇంటికి దగ్గరలో ఉన్న ఓ మద్యం షాపుపై దాడి చేయించింది. మరునాడి ఆ షాప్ యజమాని యువకుడు వచ్చి హిమ ఇంటి ముందు ఒక్కటే గడవ. ఎలాగైనా షాపు ఓపెన్ చేసి మళ్లీ మద్యం అమ్ముతానని, తనను ఆపే మగాడెవడో చూస్తానని సవాలు విసిరాడు. అప్పుడే వెళ్లి నాలుగు అంటించింది హిమ. అందుకు... ఆ యువకుడి కుటుంబం ఆమెపై కేసు పెట్టింది. ఆ కేసు రీత్యా చాలాకాలం తిరిగింది హిమ. కానీ ఎన్నడూ భయపడలేదు.
బాల్ తన్ని పరిగెత్తి...
టీనేజ్‌లోని తొలి దశ అంతా ఆడుతూ పాడుతూ తిరిగేది. ముఖ్యంగా ఫుట్‌బాల్ అంటేఇష్టం. అబ్బాయిలు మాత్రమే ఆడేవారు. తను ఆటలోభాగస్వామి కాకపోయినా.. గోల్ వెనకాల బాల్ కోసం ఎదురుచూసేది. అది రాగానే బలంగా ఒక్క తన్ను తన్ని.. అక్కడినుంచి పారిపోయేది. ఓసారి స్థానికంగా అమ్మాయిల ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతున్నది. తాను ఆడతానని తండ్రిని అడిగింది. ఏదో ఒకరోజు తాను విమానంలో విదేశాలకు వెళతానని తండ్రికి చెబుతూ ఉండేది. 'అలా వెళ్లాలంటే ముందు బాగా చదవాలి' అనేవాడు తండ్రి. ఆ తండ్రి మాటలనే స్ఫూర్తిగా తీసుకున్నది. ఫుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టింది.అయితే 2016లో ఆమెలోని స్పోర్టివ్ స్పిరిట్‌ను చూసిన పీఈటీ టీచర్... టీమ్బాల్ కాకుండా ఏదైనా ఇండివిడ్యువల్ గేమ్ తీసుకోమని సలహా ఇచ్చారు. అలాగని ఆమె హడావుడి పడిపోలేదు. మొదట ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన హిమ.. రేసింగ్‌ను సీరియస్‌గా తీసుకున్నది మూడేండ్ల కిందటే.
చిరుతలా పరుగెత్తడం చూసి...
మొట్టమొదటిసారి అస్సామ్‌లోని శివసాగర్‌లో జరిగిన అంతర్జిల్లా పోటీల్లో పాల్గొన్నది. తక్కువ ఖరీదు ఉన్న స్పైక్ షూస్‌తో చిరుతలా పరుగెత్తుతున్న హిమను అథ్లెటిక్స్ కోచ్ నిపుణ్ చూశారు. అక్కడ 200 మీటర్లు, 100 మీటర్ల కేటగిరీల్లో స్వర్ణాలు గెలుచుకుంది హిమ. ఆమెలోని నైపుణ్యాన్ని చూసిన నిపుణ్ ఆమెను గౌహవటికి మారాలని సూచించాడు. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రం. సొంతూరుకు 140 కిలోమీటర్ల దూరం. ట్రైనింగ్ అంటే.. చాలా ఆలోచించింది. తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు. అయినా నిపుణ్ పట్టు వదలలేదు. అథ్లెటిక్స్‌లో ఎంతో భవిష్యత్ ఉందని హిమను ఒప్పించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గరలో అద్దెకు ఉన్నది. నిజానికి ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అథ్లెట్స్‌కు సపరేట్ వింగ్ లేదు. బాక్సింగ్, ఫుట్‌బాల్ కు మాత్రమే ఉంది. అయినా ఆమెకు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ప్రవేశం దొరకడానికి చాలా
కష్టపడ్డారు. ఎన్నో పరీక్షలు. అన్నింట్లోనూ తన ప్రతిభను నిరూపించుకుంది హిమ. దాంతో అధికారులు అంగీకరించారు. హిమ అలుపెరుగని సాధన చేసింది. కోచ్ నిత్యం చెప్పింది ఒక్కటే... 'నైపుణ్యం కొందరికే ఉంటుంది. దానికి పదును పెడితే సక్సెస్ సొంతమవుతుంది. పెద్ద కలలు కను' అని. ఆమె ఏషియన్ గేమ్స్ కల గన్నది. కానీ... ఎవరూ ఊహించని విధంగా ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగింది.
ప్రయత్నిస్తే అసాధ్యం కాదని...
2018 ఏషియన్ గేమ్స్‌లో 2 గోల్డ్, ఒక సిల్వర్ మెడల్‌తో తన పరుగుల వేట ప్రారంభించిన ఈ చిరుత... యునిసెఫ్‌కు భారత్‌నుంచి మొట్టమొదటి యూత్ అంబాసిడర్‌గా ఎంపికైంది. దాంతో ఆగిపోలేదు... భారతదేశమంతా క్రికెట్ వరల్డ్‌కప్ కోసం ఎదురుచూస్తుంటే.. తాను మాత్రం ట్రాక్‌ల మీద చిరుతలా దూసుకుపోయింది. 20 రోజుల్లో వరుసగా ఐదు స్వర్ణాలు గెలుచుకున్నది. ఐదో స్వర్ణం గెలిచిన తరువాత... ''మన కలలను అందుకోవడానికి ప్రయత్నించినప్పుడు, మనలోనే సూపర్ హీరో ఉన్నాడని నమ్మినప్పుడు, ఏ లక్ష్యం కూడా దూరంగా ఉండదు. ఏ ఛాలెంజ్ కూడా కఠినమైనదేమీ కాదు'' అని ట్వీట్ చేసింది హిమదాస్. ఇప్పుడు ట్విట్టర్లో ఎవరినోట విన్నా హిమదాస్ పేరే వినపడుతోంది. సినిమా, స్పోర్ట్స్, పాలిటిక్స్ సెలబ్రిటీస్ అంతా ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.