Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాతి ఒక చేత్తో హడావుడిగా బాక్స్‌ల్లో భోజనం పెడుతుంది. మరో చేత్లో సెల్‌ఫోన్ పట్టుకుని పాపను జాగ్రత్తగా తీసుకువెళ్లమని ఆటోడ్రైవర్‌తో మాట్లాడుతుంది. చకచకా టిఫిన్ బాక్స్ బ్యాగ్‌లో పెట్టుకుని ఆఫీస్‌కు బయలుదేరింది. బస్టాప్‌కు నడుస్తూనే హస్టల్లో ఉండే కొడుకుకు ఫోన్ చేసి కాలేజ్‌లో ప్రాజెక్ట్ గురించి వివరిస్తుంది. బస్‌లో కూర్చొని ఊళ్ళో ఉన్న తల్లికి ఫోన్ చేసి ఆరోగ్యం గురించి వాకబు చేస్తుంది. ఆఫీస్‌లోకి వెళ్ళగానే ఫోన్ ఆఫ్ చేసి పనిలో నిమగమైంది. ఆమె దృష్టిలో వ త్తికి వ్యక్తిగత జీవితానికి మధ్య సన్నని రేఖ ఉండాలి. ఆ రేఖను ఎవరికి వారు ఏర్పాటు చేసుకుని పాటించాలి. లేకపోతే జీవితం అతలాకుతలమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మహిళలు మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఉండాలంటే కొన్ని విషయాలు పాటించాలి. వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం తెలిసి ఉండాలి.
సక్సెస్ఫుల్ కెరీర్‌తో పాటు ఆరోగ్యవంతమైన ప్రశాంత జీవనం కావాలనే ఎవరైనా కోరుకుంటారు. అందుకోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఉరుకుల పరుగుల జీవితానికి ఒక్క క్షణం స్వస్తి చెప్పి మీ జీవిత గమనాన్ని పరిశీలించు కోవాలి. చాలా మంది ఆఫీసు సమయం అయిపోయాక కూడా పని చేస్తుంటారు. మరికొంత మంది సెలవుల్లో ఇంటి దగ్గరున్నా ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్లతో పనిచేస్తుంటారు. ఆఫీసు పని, వ్యక్తిగత జీవితం రెంటి మధ్య సమతూకం లేకపోతే ఆరోగ్యం, కెరీర్ రెండూ దెబ్బతింటాయని అనేక అధ్యయనాల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
ముఖ్యమైన వాటిని..
ప్రతిరోజూ చేయాల్సిన పనుల జాబితా చాలా పెద్దదిగానే ఉంటుంది. వాటిలో రొటీన్‌గా చేసేవాటిని కాకుండా ముఖ్యమైన వాటిని రాసుకోవాలి. బ్యాంక్‌కు వెళ్లడం, ఇన్సురెన్స్ కట్టడం, గ్యాస్ బుక్ చేయడం వంటివి నోట్ చేసుకోవాలి. కొన్నిసార్లు చిన్నచిన్న పనులే మరిచిపోతుంటాం. అందుకే చేయాల్సిన పనులలోంచి అతి ముఖ్యమైన వాటిని ఎంచుకోండి. వాటిని ఒకటి, రెండు, మూడు... ఇలా వరుస క్రమంలో చేసుకుంటూ పోండి. మీ మనసు వేటిని ముఖ్యమైన పనులుగా భావిస్తుందో వాటికే ప్రాధాన్యం ఇస్తే ఒత్తిడి తగ్గుతుంది.
ప్రణాళిక ప్రకారం..
ఇంటి బాధ్యతతో పాటు తన కెరీర్‌ను మహిళలు తీర్చిదిద్దుకుంటారు. అయితే కొందరు మాత్రం సరైన సమయానికి సరైన విధంగా స్పందించకపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. అలాంటప్పుడు రోజువారీ జీవితంలో ఎక్కడ సమయం వృధా అవుతుందో గుర్తించండి. దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఏం చేయాలో ఆలోచించి.. ప్రణాళిక వేసుకోండి. దీర్ఘకాలంలో పూర్తి చేయాల్సిన పనులు, వెంటనే చేయాల్సిన పనులు గుర్తించాలి.
ఒకేసారి రెండు, మూడు
మహిళలు మల్టీ టాలెంటెడ్ అంటారు. అది నిజమే. అయితే ఒకేసారి రెండు మూడు పనులు చక్కబెట్టాలని చూడొద్దు. దానివల్ల టెన్షన్ పెరుగుతుంది. కొన్నిసార్లు ఆశించిన మంచి ఫలితాలు రావు. అంతేకాకుండా పనిలో నాణ్యత తగ్గుతుంది. ఒక పని తర్వాత మరోపని పూర్తి చేయడం మంచిది.
తలకు మించిన భారం వద్దు..
చాలామంది మహిళలు ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఒకదాని తర్వాత మరొకటి చేస్తూ అసలు ఖాళీగా ఉండరు. బిజీగా ఉండటం మంచిదే అయితే ఎప్పుడూ పీకల్లోతు పనుల్లో మునిగిపోవద్దు. జీవితంలో మీకంటూ కొంత సమయాన్ని మిగుల్చుకోవాలి. ఎంత అత్యవసర పరిస్థితులున్నా.. కొద్ది సేపు విశ్రాంతి తీసుకోండి. ఆ సమయం మీ ఆనందం కోసమేనని గుర్తించండి. అదేపనిగా తలకుమించిన పని మీదేసుకోవద్దు.
నచ్చిన ప్రదేశానికి..
అదే పనిగా పని, పని అంటూ ఉంటే కొన్ని రోజులకు మనసు, శరీరం రెండూ అలసిపోతాయి. అలా కాకుండా ఏడాదికి ఒక్కసారైనా నచ్చిన ప్రదేశానికి వెళ్ళండి. వీలైతే కుటుంబసభ్యులందరితో కలిసి వెళ్లండి. అలా సాధ్యం కాకపోతే స్నేహితులతో వెళ్ళండి. అది కూడా సాధ్యం కాకపోతే సోలో ట్రావెల్ చేయండి. ఏడాదిలో కనీసం కొన్ని రోజులు కొత్త ప్రదేశానికి వెళ్ళితే లైఫ్ బ్యాటరీ రీచార్జ్ అవుతుంది. టూర్ నుంచి తిరిగొచ్చాక ఆఫీసు పనిని మరింత చక్కగా , ఉత్సాహంగా చేయగలుగుతారు.
ఇతరుల అనుభవాలను ..
ఇంట్లో పెద్దవాళ్లు, ఆఫీస్‌లో సీనియర్స్ చెప్పే విషయాలు కూడా పట్టించుకోవాలి. పనిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయటానికి వారి అనుభవం మీకు అక్కరకొస్తుంది. జీవితానుభవం ద్వారా వారు తెలుసుకున్న విషయాలను చెప్పినప్పుడు వాటి నుంచి మీకు అవసరమయ్యే వాటిని పాటించండి. కొన్నిసార్లు పని ఒత్తిడి నుంచి బయటపడడానికి వారి అనుభవాలు ఎంతో ఉపయోగపడుతాయి.
క్రమం తప్పకుండా..
చాలామంది మహిళలు ఇంట్లో పనులు చేస్తున్నాం కదా ఇక ప్రత్యేకంగా వ్యాయామం ఎందుకు అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. ఇంట్లో పనులు చేసినా వ్యాయమం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. రోజుకో గంట వ్యాయామాలకు కేటాయిస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతమైన మనస్సుతో పనిచేయటం వల్ల పనిలో నాణ్యత పెరుగుతుంది. వాకింగ్, జాగింగ్, యోగ వంటివే కాకుండా మొక్కల పెంపకం కూడా మంచి వ్యాయామమే.
సెల్‌ఫోన్ లేకుండా..
ఇటీవల కాలంలో ఎక్కువ సమయం వృధా అవడానికి కారణం సెల్‌ఫోన్. చాలావరకు సెల్‌ఫోన్ వల్ల సమస్యలు వస్తున్నాయి. ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు అందరూ ఒక సమయం నిర్ణయించుకుని కనీసం గంటపాటు ఫోన్ స్విచాఫ్ చేయండి. మీ కుటుంబ సభ్యులందరూ కలిసి కొంత సేపు గడపండి. ఆనందం మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది.