Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సహజంగా దొరికేవాటిని మనం చాలా నిర్లక్ష్యం చేస్తాం. అవి లోపించి అనారోగ్యం బారిన పడినప్పుడు... మందులకు వేలకు వేలు పోస్తాం. అనారోగ్యం బారిన పడకుండా కాపాడేవాటిలో మునగ ముందుంటంది. మునగ ఆకులు, బెరడు, కాడలు... అన్నింట్లోనూ మనకు కావాల్సినన్ని పోషకాలున్నాయి. ఐరన్, క్యాల్షియం, విటమిన్సి, పొటాషియం సమృద్ధిగా ఉన్నాయి మునగలో. ఈ మునగ వంటలతో అలాంటి పోషకాలగనిని మీరూ పొందండి.
మునగాకు పప్పు
కావలసిన పదార్థాలు: తాజాగా కోసి, కాడలు లేకుండా శుభ్రపరచుకున్న మునగాకు - ఒక పెద్ద కప్పు, కందిపప్పు - చిన్న గ్లాసు, పసుపు - చిటికెడు, ఇంగువ - అర టీ స్పూన్, నూనె -3 టీ స్పూన్లు, ఎండు మిర్చి -2, ఆవాలు -అర టీ స్పూన్, జీలకర్ర - ఒక టీ స్పూన్, మినప్పప్పు - 2 టీ స్పూన్లు, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత.
తయారీ విధానం: ముందుగా స్టౌ వెలిగించి, మందపాటి గిన్నెలో కందిపప్పు వేసి, సన్నటి సెగ మీద ఎర్రగా వేయించుకోవాలి వేగిన కందిపప్పును రెండు సార్లు నీళ్లతో కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి. పప్పు సగం ఉడికాక, కడిగిన మునగాకు జత చేసి కలియబెట్టాలి. పసుపు, ఉప్పు, ఇంగువ జత చేయాలి. కందిపప్పు ఉడికి బద్దబద్దలుగా ఉన్నప్పుడే నీరంతా ఇగిరి పోయాక దించుకోవాలి. వేరే స్టౌ మీద కళాయి పెట్టి నూనె వేసి పోపు వేయించుకోవాలి. ఉడికించుకున్న మునగాకు పప్పు వేసి బాగా కలిపి సన్న సెగ మీద కాసేపు ఉంచి, స్టౌ మీద నుండి దించి, బౌల్లోకి తీసుకోవాలి. ఈ పప్పుకూరకు మునగాకు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది.
మునగాకు పచ్చడి
కావలసిన పదార్థాలు: మునగాకు - 5 కప్పులు, ఎండు మిర్చి - 15, చింత పండు - నిమ్మకాయంత, ఉప్పు - తగినంత, ఇంగువ - అర టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, కారం - 2 టీ స్పూన్లు, నూనె - అర కప్పు, ఆవాలు - 2 టీ స్పూన్లు, మినప్పప్పు - 4 టీ స్పూన్లు, నువ్వు పప్పు- 2 టీ స్పూన్లు.
తయారీ విధానం: మునగాకు కడిగి నీడలో ఆరపెట్టుకోవాలి. చింతపండుకు కొద్దిగా నీళ్లు జత చేసి నానబెట్టా. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, నువ్వు పప్పు వరుసగా ఒకదాని తరవాత ఒకటి వేసి బాగా వేగాక ఎండు మిర్చి జత చేసి వేయించి, చల్లార్చాలి. అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మునగాకు, పసుపు వేసి కొద్దిగా వేయించి దింపేయాలి. వేయించు కున్న పోపును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఉప్పు, మునగాకు, నానపెట్టిన చింతపండు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, గిన్నెలోకి తీసుకోవాలి. స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక కారం, ఇంగువ వేసి వేయించి, దింపి, పచ్చడిలో వేసి కలపాలి.
మునగ ఆవకాయ
కావలసిన పదార్థాలు: మునగ కాడలు - 6, ఆవపిండి- 100 గ్రా., వేయించిన జీలకర్ర పొడి - 50 గ్రా., వేయించిన మెంతుల పొడి - 2 టీ స్పూన్లు, కారం - పావు కిలో, ఇంగువ - ఒక టీ స్పూను, పసుపు - ఒక టీ స్పూను, ఉప్పు - పావు కిలోకి తక్కువ, పప్పు నూనె/ వేరుశనగ నూనె - పావు కేజీ, నానబెట్టి రుబ్బిన చింతపండు గుజ్జు - ఒక కప్పు.
తయారీ విధానం:
మునగ కాడలను చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి కొద్దిగా కాగాక, తరిగిన మునగ కాడ ముక్కలు, ఉప్పు వేసి మగ్గిన తరవాత దింపేయాలి. కాస్త చల్లారి, మెత్తబడ్డాక మిరప కారం, పసుపు, ఇంగువ, జీలకర్ర పొడి, ఆవ పొడి, మెంతి పిండి వేసి బాగా కలపాలి. స్టౌ మీద బాణలి ఉంచి, నూనె పోసి కొద్దిగా కాచి దింపేయాలి. చింతపండు గుజ్జు జత చేసి, బాగా కలిపి ఆ మిశ్రమాన్ని మునగ కాడల పచ్చడిలో వేసి కలియబెట్టాలి. రెండు రోజులకు పులుపు, కారం మునగ కాడలకు పట్టి చాలా రుచిగా ఉంటుంది.
మునగ-టమాట
కావలసిన పదార్థాలు: మునగ కాడలు - 3, టమాటలు -అర కిలో, ఉల్లిపాయలు -2, పసుపు -చిటికెడు, ఉప్పు - తగినంత, పోపు కోసం ఎండు మిర్చి - 4, పచ్చి శనగపప్పు -2 టీ స్పూన్లు, మినప్పప్పు - ఒక టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, కారం - 2 టీ స్పూన్లు, నూనె - రెండు టేబుల్ స్పూను, కొత్తిమీర -చిన్న కట్ట.
తయారీ విధానం:
మునగ కాడలను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. టమాటలు, ఉల్లిపాయలను కూడా సన్నగా తరగాలి. స్టౌ వెలిగించి మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి కాగాక, పోపు దినుసులు ఒకదాని తరవాత ఒకటి వేసి, దోరగా వేయించాలి. ఎండు మిర్చి, ఉల్లి తరుగు జత చేసి బాగా వేయించాలి. టమాట తరుగు, మునగ కాడ ముక్కలు, ఉప్పు జత చేసి బాగా కలిపి, సన్నటి సెగ మీద మగ్గనివ్వాలి. బాగా ఉడికిన తరవాత, కారం వేసి కలిపి ఒక నిమిషం తరవాత దింపేయాలి. కూరను ఒక బౌల్లోకి తీసుకుని, కొత్తిమీరతో అలంకరించాలి.
మునగాకు రసం
కావలసిన పదార్థాలు: మునగాకులు- ఒక కప్పు, మునగకాడలు -1, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, చింతపండు - నిమ్మకాయంత, బెల్లం - 2 టీ స్పూన్లు, చారు పొడి - 2 టీ స్పూన్లు, టమాట తరుగు - పావు కప్పు, తరిగిన పచ్చి మిర్చి - 2, తరిగిన కొత్తిమీర - టేబుల్ స్పూను, నెయ్యి - 2 టీ స్పూన్లు, ఇంగువ - అర టీ స్పూను. పోపు కోసం ఆవాలు - టీ స్పూను, జీలకర్ర- ఒక టీ స్పూను, వెల్లుల్లి-నాలుగైదు తయారీ విధానం: మునగాకును నీళ్లల్లో వేసి స్టౌ మీద ఉంచి, మరిగించాలి. బాగా మరిగాక ఆకులను వడకట్టగా వచ్చిన నీళ్లలో చిక్కగా తీసిన చింతపండు రసం పోసి, స్టౌ మీద ఉంచాలి . మునగ కాడను ముక్కలుగా తరిగి అందులో వేయాలి. పసుపు, ఉప్పు, బెల్లం, టొమాటో తరుగు, ఇంగువ, పచ్చిమిర్చి జత చేసి బాగా మరగనివ్వాలి. మరొక స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి పాయలు వేసి చిటపటలాడాక, మరుగుతున్న మునగాకు రసంలో వేయాలి. మరికాస్త మరిగాక చారు పొడి వేసి ఐదు నిమిషాల తర్వాత దింపాలి. ఇది చాలా సువాసనతో, రుచిగా బాగుంటుంది.
మునగాకు పొడి
కావలసిన పదార్థాలు:
కాడలు లేకుండా కడిగి నీడలో ఆరపెట్టిన మునగాకు -రెండు కప్పులు, ధనియాలు - 2 టీ స్పూన్లు, మినప్పప్పు - 8 టీ స్పూన్లు, జీలకర్ర - 2 టీ స్పూన్లు, పచ్చి శనగ పప్పు - 5 టీ స్పూన్లు, నువ్వు పప్పు - 2 టీ స్పూన్లు, ఎండు మిర్చి - 10, చింతపండు - చిన్న నిమ్మకాయంత, నూనె - 4 టీ స్పూన్లు.
తయారీ విధానం:
స్టౌ వెలిగించి, కడాయి పెట్టి, అందులో నూనె వేసి కాగాక ధనియాలు, శనగ పప్పు, మినప్పప్పు, జీలకర్ర, నువ్వులు వేసి దోరగా వేగాక, ఎండు మిర్చి జత చేసి అవి కూడా వేగాక, మునగాకు వేసి బాగా కలిపి స్టౌ కట్టేయాలి. వేయించుకున్న పదార్థాలు చల్లారాక, కొద్దిగా చింతపండు, తగినంత ఉప్పు జత చేసి మిక్సీలో వేసి పొడి చేసి, తడి లేని సీసాలో భద్ర పరచుకోవాలి. ఇది పది రోజుల వరకు నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలోకి సూపర్‌గా ఉంటుంది.