Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్మా... పెద్దసైజు బొబ్బెర్లలా, చిక్కుడు గింజ ఆకారంలో ఉండే ఈ రాజ్మాను ఫ్రెంచి చిక్కుడు అని కూడా అంటారు. పోషకవిలువలు నిండుగా ఉండే రాజ్మా.. ఆరోగ్యానికే కాదు అందానికీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులోని కొన్ని మినరల్స్.. టాక్సిన్స్‌ను పోగొడతాయి. ఎముకలను బలంగా చేసే రాజ్మా... మధుమేహం ఉన్నవాళ్లకు చాలా మంచిది. అయితే రాజ్మా ఉడికించి కేవలం కూరగానే కాకుండా రకరకాల వంటలు చేయొచ్చు. మీరూ ఓసారి ప్రయత్నించండి!
రాజ్మా సాండ్విచ్
కావలసిన పదార్థాలు : రాజ్మా- ఒక కప్పు, (రాత్రంతా నీటిలో వేసి నానబెట్టుకోవాలి) ఉల్లిపాయ- 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి), పనీర్- 2 చెంచాలు (తురుముకోవాలి), దోసకాయ- తరిగినది ఒక చెంచా, పచ్చిమిర్చి - సన్నగా తరిగినది ఒకటి, ఛాట్ మసాలా- చిటికెడు, కారం- ఒక చిటికెడు, బ్లాక్ ఉప్పు- ఒక చిటికెడు, చీజ్ స్ప్రెడ్- ఒక చెంచా, బ్రెడ్స్లయిసెస్- 8పీసులు, నిమ్మరసం-ఒక చెంచా, ఉప్పు- రుచికి సరిపడా, బట్టర్ లేదా నెయ్యి- ఒక చెంచా
తయారీ విధానం : ముందుగా కుక్కర్ లో రాజ్మా మరియు కొద్దిగా ఉప్పు వేసి 4విజిల్స్ వచ్చే ఉడికించుకోవాలి . తర్వాత స్టౌ ఆఫ్ చేసి, కుక్కర్లో ఆవిరి పోయాక, నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఉల్లిపాయ, కీరకాయ, పనీర్ మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి, అలాగే చాట్ మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. దీనికి రెడ్ చిల్లీ పౌడర్, బ్లాక్ సాల్ట్, ఉప్పు వేసి మిక్స్ చేసి అందులో రాజ్మా వేయాలి. మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలను తీసుకొని, బ్రెడ్ అంచులు, చివర్లు కట్ చేసి, బ్రెడ్‌కు చీజ్ రాసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక్క బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద రాజ్మా మిశ్రమాన్ని వేసి బ్రెడ్ మొత్తం పరిచి దాని మీద మరో బ్రెడ్ స్లైస్ ను పెట్టి, స్టఫ్ చేయాలి. ఇలా స్టఫ్ చేసిన బ్రెడ్ రాజ్మాను టోస్టర్లో పెట్టి హీట్ చేయాలి. లేదంటే... రెండువైపులా పెనం మీద బట్టర్ రాసి కాల్చుకోవాలి. ఇలా చేస్తే గోల్డ్ బ్రౌన్ కలర్ లో క్రిస్పీగా తయారువుతాయి. దీన్ని ఉల్లిపాయ సలాడ్, టమాట సాస్‌తో సర్వ్ చేయాలి.
రాజ్మా మష్రూమ్స్
కావలసిన పదార్థాలు: (తరిగిన) మష్రష్ట్రమ్స్ - 2 కప్పులు, రాజ్మా - అరకప్పు, టమోటాలు - 2, కారం - 1 టీ స్పూను, పచ్చిమిర్చి - 2, ఉల్లి పాయలు - 2, పంచదార - 1 టీ స్పూను, గరం మసాల -అర టీ స్పూను, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, పెరుగు - 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి - ఒకటిన్నర టీ స్పూను, జీరాపొడి - పావు టీ స్పూను, కొత్తిమీర తరుగు - అర కప్పు.
తయారీ విధానం: రాజ్మాను 6 గంటలపాటు నానబెట్టాలి. కుక్కర్లో రెండు కప్పుల నీరు పోసి రాజ్మాని ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించి స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. తర్వాత అందులోనే మష్రూమ్ ముక్కలు, టమోటా తరుగు వేసి మరో విజిల్ వచ్చాక దించేయాలి. నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేయించి, కారం, ఉప్పు, పంచదార, గరం మసాల, ధనియాలపొడి, జీరాపొడి,పెరుగు వేసి 3 నిమిషాల తర్వాత మష్రూమ్స్, రాజ్మా మిశ్రమాన్ని కలపాలి. మరో 4 నిమిషాలు సన్నని మంటపై ఉడికించి కొత్తిమీర తరుగు వేసి దించేయాలి. ఈ కూర చపాతీ, పరాటాల్లోకి చాలా బాగుంటుంది.
రాజ్మా కబాబ్
కావలసిన పదార్థాలు: రాజ్మా - 2 కప్పులు, అల్లం తరుగు - 1 టీ స్పూను, పుదీనా తరుగు - అర కప్పు, ఉల్లి తరుగు - 1 కప్పు, గరం మసాలా - 1 టీ స్పూను, జీరా పొడి - 1 టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం - 1 టీ స్పూను.
తయారీ విధానం: రాజ్మాను 6 గంటలు నానబెట్టాలి. తర్వాత కుక్కర్లో 5 కప్పుల నీటిలో 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి చల్లారాక మిక్సీలో గ్క్రెండ్ చేసుకోవాలి. కడాయిలో 1 టేబుల్ స్పూను నూనె వేసి ఉల్లి తరుగు, అల్లం తరుగు, పసుపు, జీరాపొడి, పుదీనా వేగించి, రాజ్మా ముద్దని కలిపి రెండు నిమిషాల తర్వాత దించేయాలి. దీంట్లో మసాలపొడి, ఉప్పు, నిమ్మరసం బాగా కలిపి, చిన్న చిన్న ఉండలు చేసుకొని టిక్కాలుగా వత్తి పెనంమీద రెండు వ్కెపులా దోరగా వేగించుకోవాలి. ఈ కబాబ్‌లను వేడివేడిగా టమాట సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.
రాజ్మా బిర్యానీ
కావలసిన పదార్థాలు : బియ్యం - కేజీ, రాజ్మా గింజలు - 200 గ్రా, అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిరపకాయలు - ఆరు, నూనె - 100గ్రా, నెయ్యి - 100గ్రా, లవంగాలు - 6, దాల్చినచెక్క - చిన్న ముక్కలు నాలుగు, ఉప్పు - తగినంత
తయారీ విధానం : ముందురోజు రాత్రి రాజ్మా గింజల్ని నానబెట్టాలి. బిర్యానీ తయారు చేయడానికి ముందు బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలి. కాడలు లేకుండా పుదీనా ఆకులను తుంచి శుభ్రంగా కడిగి గ్రౖెెండ్ చేసుకోవాలి. వెడల్పుగా ఉన్న గిన్నెలో నూనె, నెయ్యి వేసి కాగిన తర్వాత లవంగాలు, దాల్చినచెక్క వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, రాజ్మాగింజలు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు తగినంత నీరు పోసి ఉప్పు వేయాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం వేసి ఉడకనివ్వాలి. అంతే రాజ్మా బిర్యానీ రెడీ అయినట్లే.
రాజ్మా పన్నీర్ గ్రేవీ
కావలసిన పదార్థాలు: రాజ్మా - ఒక కప్పు, పన్నీర్- ఒక కప్పు, ఉల్లిపాయ- 1, పచ్చిమిర్చి- 2, టమాటాలు - 3, కరివేపాకు- ఒక రెమ్మ, కొత్తిమీర- కొద్దిగా, మీగడ- రెండు స్పూన్లు, అల్లం వెల్లుల్లి ముక్కలు - ఒక టీ స్పూన, గరంమసాలా పొడి- ఒక టీ స్పూన, ఉప్పు, కారం, పసుపు, నూనె, తాలింపు దినుసులు.
తయారీ విధానం: రాజ్మాను నానబెట్టి ఉడికించాలి. రెండు టీ స్పూన్లు నూనె వేడి చేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లి, మిర్చి ముక్కలు, కరి వేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లంవెల్లుల్లి వేసి వేగనివ్వాలి. తరువాత టమాటా ముక్కలు వేసి మెత్తగా ఉడికించాలి. పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి కలిపి రాజ్మా, పన్నీర్ ముక్కలు కూడా వేసి కలిపి కొద్దిగా నీరు పోసి ఉడికించాలి. గ్రేవీ చిక్కగా అయ్యాక గరం మసాలా పొడి చల్లి మీగడ కూడా వేసి కలపాలి. చివరగా తరిగిన కొత్తిమీర చల్లి వేడివేడిగా చపాతీలతో తింటే రుచిగా ఉంటుంది.