Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలు ఇష్టంగా తినే ఆహారంలో నూడుల్స్ ఒకటి. కానీ ఇన్‌స్టంట్‌గా వచ్చే కొన్ని బ్రాండ్స్‌తో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అలాంటివి కాకుండా ఇంట్లోనే నూడుల్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు.. ఆమ్లెట్, చపాతీలను సైతం నూడుల్స్‌లాగా వడ్డించొచ్చు. అవేంటో తెలుసుకుని మీరూ ప్రయత్నించండి.
నూడుల్స్ పకోడా
కావలసినవి: ఇన్స్టంట్ నూడుల్స్-2, నూడుల్స్ టేస్ట్ మేకర్స్-2, శనగపిండి-3 చెంచాలు, బియ్యం పిండి-2 చెంచాలు, ఉప్పు, కారం-చెంచా, క్యాబేజీ తురుము- 2చెంచాలు, క్యారట్ తురుము- 2చెంచాలు, పచ్చిమిర్చి-1, ఉల్లిపాయ తరుగు-1 మీడియం సైజు, కొత్తిమీర తరుగు-2చెంచాలు, నూనె-వేయించడానికి సరిపడా
తయారీ: నూడుల్స్‌ని అర లీటర్ నీళ్ళలో 2 నిమిషాలు మాత్రమే ఉడికించి దింపేసి వెంటనే వడకట్టి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మరో బౌల్లో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకొని, అప్పుడు పూర్తిగా చల్లారిన నూడుల్స్ వేసి నిదానంగా మిక్స్ చేయాలి. దీనికి నీరు అవసరం పడదు, నూడుల్స్ లో చెమ్మ సరిపోతుంది. అవసరమనిపిస్తే ఓ చెంచా వేసుకోండి అంతే. ఇప్పుడు నిమ్మకాయంత సైజు బాల్స్ చేసి వేడి వేడి నూనెలో వేసి మీడియం మంట మీద మాత్రమే క్రిస్పీగా అయ్యేదాక ఫ్రై చేసుకోవాలి. అంతే నూడుల్స్ పకోడీ తయార్!
చపాతీ నూడుల్స్
కావలసినవి: చపాతీలు - 4, సన్నగా, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు - పావుకప్పు, పొడుగ్గా తరిగిన టమాటలు - పావుకప్పు, సన్నగా తరిగిన క్యారెట్ - పావుకప్పు, తరిగిన పచ్చిమిర్చి - 2 టీ స్పూన్లు, సోయా సాస్ - 1 టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర - పావుకప్పు, కారం పొడి - 1 టీ స్పూన్, పసుపు - 1 టీ స్పూన్, గరం మసాలా - 1 టీ స్పూన్ (కావాలనుకుంటేనే), ఉప్పు - సరిపడా, నూనె - 1 టేబుల్ స్పూన్
తయారీ: ముందుగా చపాతీలను సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టౌపై పాన్ పెట్టి నూనె పోయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలపాలి. మూడు నిమిషాల తర్వాత క్యారెట్ ముక్కలు వేసి కొద్దిసేపు ఉంచాలి. ఇప్పుడు అందులో టమాట ముక్కలు వేసి, మగ్గాక పసుపు, ఉప్పు, కారం, మసాలా, సోయా సాస్ వేసి బాగా కలపాలి. తర్వాత చపాతీ ముక్కలను వేసి కలపాలి. అయిదు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. ఈ చపాతీ నూడుల్స్‌ను పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు.
ఆమ్లెట్ నూడుల్స్
కావలసినవి : గుడ్లు-రెండు, ఉల్లిపాయముక్కలు-కప్పు, క్యాప్సికం-ఒకటి, టమాట ముక్కలు- పావుకప్పు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి తరుగు-చెంచా చొప్పున, మిరియాలపొడి-అరచెంచా, ఉప్పు-తగినంత, నూనె-పావుకప్పు, కారం-అరచెంచా, పసుపు-చిటికెడు, కొత్తిమీర తరుగు-గుప్పెడు
తయారీ: మొదట బాణలిని పొయ్యిమీద పెట్టి రెండు చెంచాల నూనె వేయాలి. అది వేడయ్యాక గుడ్ల సొనను గిలకొట్టి ఆమ్లెట్‌లా పోయాలి. దీనిపై ఉప్పు, పావుచెంచా చొప్పున కారం, మిరియాలపొడి చల్లి, రెండువైపులా కాల్చుకుని తీసుకోవాలి. దీన్నిగుండ్రంగా చుట్టి సన్నగా నూడుల్స్ ఆకారంలో కట్ చేసి పెట్టుకోవాలి. ఇంతకుముందు ఉపయోగించిన బాణలినే మళ్లీ పొయ్యిమీద పెట్టి మిగిలిన నూనె వేయాలి. అది వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. దాంట్లోనే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి మరోసారి కలపాలి. టమాట క్యాప్సికం ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, మిగిలిన కారం, మిరియాలపొడి వేయాలి. అంతే ఆమ్లెట్ నూడుల్స్ రెడీ!
మష్రూమ్ నూడుల్స్
కావలసినవి: పుట్టగొడుగులు- పావుకిలో, నూడుల్స్- పావుకిలో, ఉల్లిపాయలు- రెండు, వెల్లుల్లి-పది రెబ్బలు, క్రీమ్- కప్పు, చీజ్ తురుము- రెండు టేబుల్‌స్పూన్లు, వెన్న- మూడుస్పూన్లు, జీలకర్ర- టీస్పూన్, ఉప్పు- రుచికి సరిపడా, మిరియాలపొడి-అర టీస్పూన్
తయారీ: ముందుగా నూడుల్స్‌ను ఉడికించి నీళ్లు వంపి చన్నీళ్లతో కడగాలి. పుట్టగొడుగుల్ని చిన్న ముక్కలుగా కోయాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు సన్నని ముక్కల్లా కోయాలి. తరువాత వెడల్పాటి బాణలిలో టేబుల్‌స్పూన్ వెన్న వేసి కరిగించాలి. ఇది కాగాక ఉడికించిన నూడుల్స్, చిటికెడు ఉప్పు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి.ఇప్పుడు మిగిలిన వెన్నవేసి ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కల్ని వేసి వేయించాలి. తరువాత పుట్టగొడుగు ముక్కలు, జీలకర్ర వేసి రెండు నిముషాలు వేయించాలి. తరువాత ఉప్పు, మిరియాలపొడి, నూడుల్స్, క్రీమ్ వేసి కాసేపు ఉడికించాలి. చివరగా తురిమిన చీజ్ వేసి ఓ నిమిషం వేయించి దించాలి. అంతే ఎంతో రుచికరమైన మష్రూమ్ నూడుల్స్ రెడీ.
స్పైసీ చికెన్ నూడుల్స్
కావలసినవి: బియ్యం నూడుల్స్-150 గ్రా, చికెన్ స్టాక్-100మి.లీ, చికెన్ బ్రెస్ట్-150 గ్రా, డార్క్సోయా సాస్-రెండు చెంచాలు, తరిగిన వెల్లుల్లి-రెండు చెంచాలు, ఎండుమిర పకాయలు-3, తులసిఆకులు-20, ఫిస్ సాస్-ఒక చెంచా, చక్కెర-ఒక చెంచా, లైట్ సోయాసాస్-మూడు చెంచాలు, ఇదయం నువ్వుల నూనె-నాలుగు చెంచాలు
తయారీ: నూడుల్స్‌ను ఉడికించుకొని నీళ్లు వడకట్టి పక్కన పెట్టుకోవాలి. చికెన్‌ని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పాన్‌లో నూనెపోసి వేడెక్కాక నూడుల్స్ వేసి, డార్క్ సోయా సాస్ వేసి మూడు నిమిషాలు బాగా కలపాలి. దాన్ని వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇంకో పాన్‌లో నూనె వేడెక్కాక వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేయించుకోవాలి.దీనికి చికెన్ జత చేసి బాగా కలపాలి. ఇప్పుడు చికెన్ స్టాక్ పోసి, తులసి ఆకులు వేసిరెండు నిమిషాలు మగ్గనివ్వాలి. చికెన్ ఉడికాక ఫిష్ సాస్, లైట్ సోయా సాస్, చక్కెర వేసి మరో రెండు నిమిషాలు ఉంచాలి. ఇందులో ఉడికించుకున్న నూడుల్స్ వేసి బాగా కలిపి.. వేడివేడిగా వడ్డించాలి.