Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరోజ ఆఫీస్‌లో ఉన్నా మనసంతా హాస్టల్లో ఉన్న పిల్లలపైనే ఉంది. ఊరంతా జ్వరాలు. చిన్నా, పెద్దా తేడా లేకుండా జ్వరాల బారిన పడుతున్నారు. నిన్న హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది. దాంతో రాత్రంతా నిద్రలేదు. ఇలా ఇంకా ఎన్ని రోజులు? అన్న ప్రశ్నకు ఆమె వద్ద జవాబు లేదు. తన కాపురం చక్కబడాలన్నా, పిల్లలతో కలిసి ఉండాలన్నా భర్త ప్రవర్తనలో మార్పు రావాలి. అది ఎలా సాధ్యమవుతుందో తెలియడం లేదు. తన స్నేహితులురాలు శోభ చెప్పినట్టు ఒక సారి ఐద్వా అదాలత్‌కు వెళ్ళాలని నిర్ణయించుకుంది.
సరోజ స్కూల్లోనూ, కాలేజీలోనూ ధైర్యం గల అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. చదువులోనే కాదు కోకరిక్యులమ్ కార్యక్రమాల్లోను చురుగ్గా ఉండేది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పీజీ చదువుతాను అన్న వినకుండా సుధీర్‌తో పెండ్లి నిర్ణయించారు. పెండ్లి తర్వాత చదువుకుంటాను అన్న ఆమె నిర్ణయానికి సుధీర్ అంగీకారం తెలిపాడు. దాంతో సంతోషంగానే పెండ్లికి అంగీకరించింది. పెండ్లి తర్వాత భర్తతో పాటు నగరానికి వచ్చింది. మొదటి మూడునెలలు కొత్తకాపురం సర్దుకోవడంతోనే గడిచిపోయింది. ఇక పిజీలో చేరుదాం అనుకుంటుండగా వేవిళ్ళు ప్రారంభమయ్యాయి. దాంతో చదువు సంగతి పక్కకు పడిపోయింది. పెద్దబాబు, ఆ తర్వాత ఏడాదిన్నరకే చిన్నబాబు పుట్టడంతో వారి ఆలనాపాలనతో నాలుగేండ్లు గడిచి పోయాయి.
భవిష్యత్ కోసం...
పిల్లల విషయంలో పడిపోయి తన చదువు గురించి మరిచిపోయింది. వాళ్లిద్దరూ బడికి పోవడంతో దొరికిన ఖాళీ టైమ్‌లో చదువుకోవడానికి సిద్ధమైంది. సుధీర్ కూడా సరే అనడంతో పిజీ దూరవిద్య ద్వారా పూర్తి చేయాలనుకుంది. సుధీర్‌ది చిన్న ప్రైవేటు జాబ్. ఇద్దరు పిల్లల భవిష్యత్‌ను ఆలోచిస్తే సరోజకు భయమేసింది. తాను తప్పనిసరిగా ఉద్యోగం చేయాలన్న ఆలోచనను సుధీర్‌కు చెబితే సరే అన్నాడు. ఇంటికి దగ్గర్లోనే ఒక ఆఫీస్‌లో క్లర్క్‌గా చేరింది. పిల్లల పై చదువుల కోసం పొదుపు ప్రారంభించింది. తన జీతం ఇంట్లోకి ఇచ్చేది కాదు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
చిన్నగా మొదలై..
మొదట్లో సరోజ జీతం ఇంట్లోకి ఇవ్వమని అడిగాడు సుధీర్. పిల్లల భవిష్యత్ కోసం ఒకరి జీతం పొదుపు చేద్దామని చెప్పింది సరోజ. అయితే సుధీర్ స్నేహితుల మాటలు విని ఆమె జీతం పుట్టింటికి పంపిస్తుందన్న అపోహ పెంచుకున్నాడు. ఇంటి ఖర్చులకు, పిల్లల ఖర్చులకు డబ్బులు ఇవ్వడం మానేశారు. ఆరునెలల తర్వాత ఎంత పొదువు చేశావో చెప్పు అన్నాడు .. సుధీర్‌లో వస్తున్న మార్పు గమనిస్తున్న సరోజ తాను దాచినా డబ్బు ఖర్చు చేస్తాడన్న భయంతో వివరాలు చెప్పలేదు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి. పిల్లల ముందే సరోజను తిట్టడం, కొట్టడం చేసేవాడు. బిక్కుబిక్కు ముంటూ పిల్లలు తండ్రిని చూసి భయపడిపోయేవారు. చిన్నగా జీతం దగ్గర మొదలైన గొడవలు వారి జీవితాలపై ప్రభావం చూపించసాగాయి.
ప్రశాంతంగా ఉండలేక..
ఒకరోజు సుధీర్ ఆఫీన్ నుంచి వస్తున్నే సరోజను డబ్బులు ఇవ్వమని అడిగాడు. ఇవ్వనని చెప్పడంతో పిల్లలను కొట్టబోయాడు. అడ్డు వచ్చిన సరోజను కొట్టాడు. ఇక లాభం లేదనుకున్న సరోజ తన తల్లిదండ్రులను, అత్తమామలను పిలిపించింది. జీతం తన చేతికి ఇవ్వకపోతే తన ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదన్నాడు. ఎవరూ చెప్పినా వినలేదు. పుట్టింటికి వెళ్లడం ఇష్టం లేని సరోజ పిల్లలిద్దరినీ రెసిడెన్షియల్ హాస్టల్లో చేర్చింది. తానూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేస్తుంది. పిల్లల ఖర్చులన్నీ ఆమె భరిస్తూ చదివిస్తోంది. కొన్ని రోజులు దూరంగా ఉంటే మార్పు వస్తుంది అన్న ఆమె ఆలోచన తప్పే అయ్యింది. ఏడాది గడిచినా భర్తలో మార్పు లేదు. ఇంట్లో నుంచి వచ్చి తప్పు చేశానా అన్న ఆలోచన ఆమెను ఆవేదనకు గురిచేసింది. తల్లిదండ్రులపై బెంగ పెట్టుకున్న పిల్లలు అనారోగ్యం పాలు కావడం తట్టుకోలేక పోయింది.
డబ్బే ప్రధానమా..
ఉద్యోగం చేయమని ప్రోత్సహించిన భర్త తన జీతం కోసం వేధించడం బాధగా ఉంది అంటూ తన సమన్యనంతా వివరంగా చెప్పింది సరోజ. 'మేడమ్, మధ్యతరగతి కుటుంబాల్లో ఇద్దరు సంపాదిస్తే తప్ప పిల్లలకు చదువు చెప్పించలేని పరిస్థితి. వారిని ఉన్నత చదువులు చదివించాలన్న ఒకే ఒక ఆలోచనతో నేను ఉద్యోగంలో చేరాను. ఇప్పడు జీతం డబ్బులు ఆయనకు ఇస్తే.. ఆయన సంపాదన వృధా చేస్తాడు. స్నేహితులకు ఎక్కువగా అప్పులు ఇస్తుంటాడు. మీరు ఆయనను పిలిపించి మాట్లాడండి. అందరం కలిసి ఉండేలా చూడండి' అంది సరోజ. ఆమె ఇచ్చిన నెంబర్‌కు ఫోన్ చేశారు. బాధ్యులు చెప్పిందంతా విన్న తర్వాత సుధీర్ 'వచ్చే వారం వస్తాను' అంటూ ముక్తసరిగా సమాధానం చెప్పాడు.
సమస్య ఇద్దరిదీ..
సరోజ చెప్పిన విషయాలు చెప్పి 'భార్యపిల్లలను ఇంటికి తీసుకువెళ్ళడానికి అభ్యంతరం ఏంటీ' అని సుధీర్‌ను అడిగారు బాధ్యులు.'మేడమ్, సరోజ ఉద్యోగం చేయనంత వరకు కుటుంబాన్ని నేనే పోషించాను. ఇప్పుడు ఆమె ఉద్యోగం చేయడం మొదలు పెట్టగానే నేను దుబారా చేస్తాను అంటుంది. ఇన్ని రోజులు నేను ఎంతో పొదుపుగా ఉన్నాను. ఎప్పుడు దుబారా చేయలేదు. ఆమె జీతం ఎక్కడ తీసుకుంటానో అని అబద్దాలు మాట్లాడుతుంది. పిల్లల భవిష్యత్ గురించి నాకు ఆలోచన లేదా? ఆమెకు డబ్బు ముఖ్యం. ఇప్పుడు పిల్లలను హాస్టల్లో వేసి, తాను హాస్టల్లో ఉంటుంది. డబ్బు ఎవరు వృధా చేస్తున్నారు? చిన్న మాట పట్టింపులకు పోయి ఇంటిని, సంసారాన్ని వదిలేసి బయటకు వెళ్ళి పోయింది. ఇది కరెక్టా మీరే చెప్పండి' అన్నాడు సుధీర్.
'నువ్వు చెప్పింది నిజమే సుధీర్. జీతం ఇవ్వకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పిన నువ్వు, పిల్లలతో వెళ్ళిపోతుంటే నీ భార్యను ఎందుకు ఆపలేదు? తండ్రిగా ఒకసారి కూడా వెళ్ళి పిల్లలను చూడలేదు. ఈ సమస్య మీ ఇద్దరిదీ మాత్రమే కాదు. దూరంగా ఉండటం వల్ల పిల్లలు ఎంతగా ఫీలవుతున్నారో మీకు తెలుసా? ఇక నుంచి మీ ఇద్దరి జీతాల నుంచి పొదుపు చేయండి. పిల్లల పేర్లమీద బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయండి. ఇంటి ఖర్చులు పోను మిగతా డబ్బు ఆలోచించి పొదుపు చేయండి. ఇగోలు పక్కన పెట్టి ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోండి. సమస్యను పరిష్కరించుకోని, కలిసి ఉండండి' అన్నారు బాధ్యులు. రెండు వారాలు టైం ఇవ్వండి అన్నాడు సుధీర్.
ప్రతి రూపాయి..
రెండు వారాల తర్వాత సుధీర్, సరోజ ఇద్దరూ విడివిడిగా వచ్చారు. 'మీరు చెప్పినట్టే చేస్తా మేడమ్. అయితే సరోజ జీతం ప్రతి రూపాయి తప్పనిసరిగా లెక్క ఉండాల్సిందే' అన్నాడు సుధీర్. 'మేడమ్, నా జీతం కూడా ఆయనకే ఇస్తాను. అయితే అందులో నుంచి వాడకుండా, మొత్తం బ్యాంక్ ఖాతాలో వేయాలి' అంది సరోజ.
'డబ్బులే జీవితం కాదు. అయితే మీ పిల్లల కోసం నువ్వు పడే ఆరాటం మంచిదే. అయితే తండ్రిగా సుధీర్‌కు కూడా వారి భవిష్యత్ గురించి బాధ్యత ఉందన్న విషయం మరిచిపోవద్దు. మీరు ఇద్దరూ ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు చేయండి. లెక్కలు రాసుకోండి. పిల్లలను ముందు హాస్టల్ నుంచి తీసుకువచ్చి అందరూ కలిసి ఉండండి. మీకు ఏదైనా సమస్య వస్తే తప్పక రండి' అన్నారు బాధ్యులు. సరే కలిసి ఉంటామంటూ సరోజ, సుధీర్ ఇద్దరూ రిజిస్టర్లో సంతకాలు చేశారు.