Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెలసరి సమయంలో స్త్రీలకు చాలా ఇబ్బందికరంగా, అసౌకర్యంగానూ ఉంటుంది. ఆ సమయంలో నీరసంగా.. బలహీనంగా ఉంటారు. అంతేకాదు ఏమీ తినాలని తోచదు లేదా ఏమీ చేయడానికి తోచదు. కొందరిలో వికారం మరియు తిమ్మిరి లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అందుకే ఈ సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సరైన ఆహారం కూడా అవసరం. అప్పుడే శక్తిని పొందుతాం.
నీళ్ళు
నీళ్ళు పుష్కలంగా తాగాల్సిన సమయం ఇది. నీరు శరీరంలోని అన్ని టాక్సిన్స్‌ని తొలగిస్తుంది. శరీరాన్ని తాజాగా, యాక్టివ్‌గా ఉంచుతుంది. కనుక నీటిని ఎక్కువగా తాగండి.
ఐరన్ రిచ్ ఫుడ్
ఋతుస్రావం సమయంలో రక్తం కోల్పోవడం ఒక సాధారణ విషయం కనుక మహిళలు తగినంత ఐరన్ రిచ్ ఫుడ్‌ని తీసుకోవాలి. బలహీనతని తగ్గించడానికి ఐరన్ సహాయపడుతుంది. కనుక ఎండిన బీన్స్, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్లు తినడానికి నెలసరుల సమయం ఖచ్చితమైనది. డార్క్ చాక్లెట్లు మీ మానసిక స్థితిని నియంత్రించే విధంగా పనిచేసే 'సెరోటోనిన్' అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.
చేప
సాల్మన్, ట్యూనా వంటి ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి మీ కండరాలను రిలాక్స్ చేస్తుంది మరియు క్రామ్ప్స్ రాకుండా ఉండేందుకు సహాయ పడుతుంది.
కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు
చాలా ఉపయోగకరంగా ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను ఋతుస్రావం సమయంలో మీ డైట్లో చేర్చుకోండి. పండ్లు, తణధాన్యాలు, ఆకు పచ్చని కూరగాయలను జోడించండి. శరీరంలోని చక్కెర స్థాయిని నియంత్రించడానికి నారింజ, క్యారట్లు, రేగు పండ్లను కూడా చేర్చుకోండి.
ఎసెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్
పీరియడ్స్ సమయంలో అనేక మంది స్త్రీలు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలలో ఒకటి కడుపులో తిమ్మిరి. ఈ తిమ్మిరికి కారణం హార్మోన్ల యొక్క హెచ్చుతగ్గులు. అవసరమైన ఫ్యాటీ ఆసిడ్స్ని తీసుకోవడం ద్వారా వాటిని నియంత్రించవచ్చు. గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వీటిలో అవసరమైన ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. వీటిలో గర్భాశయ కండరాలను రిలాక్స్ చేసేందుకు సహాయపడే 'లినోలెనిక్' ఆసిడ్ కూడా ఉంటుంది.
అరటి పండు
అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఋతుస్రావం సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో బి6, ఇతర రకాల విటమిన్లు ఉంటాయి. మలబద్ధకం లాంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. పీరియడ్స్ రోజులలో డయేరియా వంటి సమస్యలను తొలగిస్తుంది.