Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజుల్లో వాన జల్లుల్లో తడవటం సహజమే. ఇలా తడిసిన ప్రతిసారీ ఆ ప్రభావం జుట్టు మీద కూడా పడుతుంది. దీంతో పట్టుకుచ్చులాంటి జుట్టు కళతప్పి వెలవెలబోతుంది. అందుకే వానాకాలంలో కురుల సంరక్షణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
- జుట్టుకు ప్రధాన శత్రువు.. చుండ్రు. వానలో తడిస్తే చుండ్రు మరింతగా విజంభిస్తుంది. అందుకే వానలో తడిసినప్పుడు పెరుగు లేదా రిఫైయిన్డ్ ఆయిల్‌తో మాడు, జుట్టుకు మసాజ్ చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
- తడిచిన జుట్టును రోజంతా అలాగే వదిలేస్తే దుర్వాసన రావటంతో బాటు చిట్లటం, రాలటం జరుగుతుంది. అందుకే వానలో తడిసినప్ప్పుడు తడిజుట్టును దువ్వకుండా ముందుగా మెత్తని, పొడి తువ్వాలుతో తల తుడుచుకొని ఆ తర్వాతే దువ్వుకోవాలి. తువ్వాలుతో తల తుడుచుకుంటే అది.. మర్దనగా పనిచేస్తుంది.
- తలస్నానానికి ముందు ఆముదం వంటి చిక్కని నూనె రాయకూడదు. బాదాం, కొబ్బరినూనె వంటి పలుచని నూనెలు కొద్దిగా వేడిచేసి తలకుపట్టించి మర్దన చేసి దువ్వెనతో తల దువ్వుకోవాలి. దీనివల్ల మాడుకు రక్తప్రసరణ పెరిగి కేశ మూలాలు బలపడతాయి.
- చుండ్రు బాధితులు తలస్నానం తర్వాత మంచి కండిషనర్ వాడాలి. బయటకు వెళ్ళేవారు వానలో తల తడవకుండా గొడుగు వాడటం వంటి జాగ్రత్తలు తీసుకొంటే మరీ మంచిది.
- తడిజుట్టును ఆరబెట్టేందుకు హెయిర్ డ్రైయర్ వాడరాదు. వాడితే జుట్టు కొనలు చిట్లి జుట్టు పొడిబారిపోతుంది.
- వానాకాలంలో హెయిర్ కలరింగ్ లేదా స్ట్రైయిట్ హెయిర్ చేయించుకోవడం మంచిది కాదు.
- వర్షాకాలంలో వారానికి 2 సార్లు కొబ్బరి నూనెలో కరివేపాకు వేయించి ఆ గోరు వెచ్చని నూనెను జుట్టుకు పట్టించి హెర్బల్ లేదా యాంటీ డాండ్రఫ్ షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా, నల్లగా మారుతుంది.
- కాలుష్యం వల్ల జుట్టు పొడిబారి, రాలుతుంటే వారానికి కనీసం రెండు సార్లు హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి.