Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనకు ఏం కావాలో మనం తెలుసుకోకపోతే ఇతరులు తమ నిర్ణయాల్ని మన మీద రుద్దుతారు అంటుంది జలంధర కథ 'వియద్గంగ'లోని పూర్ణిమ. తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తాము తీసుకుంటేనే మహిళలు హాయిగా ఉండగలరని పూర్ణిమ పాత్ర ద్వారా ప్రముఖ రచయిత్రి జలంధర చెబుతారు. ఆనందంగా, హాయిగా ఉండడమెలానో తనకు తెలుసునని అంటుంది. తన ఆనందానికయినా, తన దు:ఖానికయినా తనదే బాధ్యత అనే దృక్పథం పూర్ణిమ పాత్రలో చూస్తాం. ఆత్మగౌరవం, బాధ్యతలకు సంబంధించిన అంశాల్లో మహిళలు ఎలా ఉండాలో జలంధర రచనలు చెబుతాయి.
ఆడవాళ్ళు చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం సాధారణ అంశమై పోయింది. కానీ తమ బతుక్కి సంబంధించిన నిర్ణయాలు నిర్భయంగా, నిస్సందేహంగా తీసుకోగలిగే పరిస్థితి కనిపించడం లేదు. పెళ్ళికి ముందుగానీ, పెళ్ళి తర్వాత గానీ తన మనసుకు నచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో మహిళలు ఉన్నారు. ఈ రకమైన మానసిక స్వేచ్ఛ, స్వతంత్ర ఆలోచన ఎవరో ఇస్తే వచ్చేవి కాదు. తమంతట తాము సాధించుకోవాలి.
ఆర్థిక స్వేచ్ఛ ఉండగానే సరిపోదు. స్వేచ్ఛగా ఆలోచించే మానసిక స్థితి ఉండాలి. తాము ఏం చేయాలో, ఏం చేయకూడదో తమకు తాము నిర్ణయించుకోగలగాలి. భర్త కోసమో, పిల్లల కోసమో, కుటుంబం కోసమో తన మనసు మెచ్చని పనులు చేయాల్సి రావడం దుర్భరం. వాళ్ళ కోసం తన అభిరుచుల్ని వదులుకొని కాలం వెచ్చించాల్సి రావడం మరింత బాధాకరం.
ఈ బాధల్నించి ఎవరో వచ్చి విముక్తి చేయరు. స్వయంగా తమకు తాము ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకున్న నిర్ణయాల్ని అమలు చేయగలిగే మానసిక సామర్థ్యాన్ని కూడదీసుకోవాలి.
మహిళలు తమ జీవితాలకు సంబంధించిన అంశాలపై తమకు తాముగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే హాయిగా ఉండగలరు. తమ కాలాన్ని ఎలా గడపాలో తామే తేల్చుకోవాలి. లేదంటే ఇతరులు మీ కాలాన్ని తమ ఇష్టాలకు అనుగుణంగా మలుచుకుంటారు. మీ తీరిక సమయాన్ని తమ అవసరాలకు ఉపయోగించుకుంటారు. ఇది క్రమంగా తమ ఇష్టాల్ని మరచిపోయి, ఎదుటివారి ఇష్టాలకు అనుగుణంగా తమ సమయాన్ని వెచ్చించేంతగా మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఈ విషయం తమకు తెలియకుండానే జరిగిపోవడం మహిళ జీవితంలోని అత్యంత విషాదం. బాల్యంలో, కౌమారంలో, యవ్వనంలో ఉండే తుళ్ళింతని, ఉత్సాహాన్ని, ఏదో కొత్తగా చేయాలన్న తపనని కోల్పోయినపుడు జీవితం నిస్సారమవుతుంది. అంత నిస్సారంగా ఉందని గ్రహించ లేనంతగా కుటుంబ అవసరాలు తీర్చడంలో ఏళ్ళు గడిపేస్తారు. బొమ్మలు గీయడం, డ్యాన్స్ చేయడం, కవిత్వం రాయడం, పాటలు పాడటం వంటి అభిరుచుల్ని పెళ్ళి తర్వాత బతుకు ఒరవడిలో మరచిపోతే మనల్ని మనం కోల్పోతామనే స్పృహ ఉండాలి. పెళ్ళి, పిల్లలు జీవితంలో భాగమే గానీ అదే జీవితం కాదు. కుటుంబం మన అభిరుచులకు ఉద్దీపన ఇచ్చేలా ఉండాలి. అంతేగానీ వాటిని మింగేసేలా ఉండకూడదు. ఈ ఆలోచన మహిళల్లో ఉండాలి. అందుకు తగ్గట్టుగా తమ ప్రాధాన్యాల్ని నిర్ణయించుకోవాలి. తమ కాలాన్ని ఎలా గడపాలో నిర్ణయించుకోవాలి.
మన చుట్టూ ఉన్నవారిలో 'మన జీవితాల్ని మనమే ప్లాను చేసుకోవాలి' అనుకునేవారు అరుదుగా కనిపిస్తారు. పిల్లల కోసం, భర్త కోసం లేదంటే మొత్తంగా కుటంబం కోసం బతుకుతున్నట్టుగా గడిపేస్తారు. నిజానికి తమ గురించి గడిపేవారు అరుదు. తమ శరీరం, తమ మనసు, తమ అలవాట్లు ఎలా మారిపోతున్నాయో కూడా పట్టించుకోకుండా గడిపేస్తుంటారు. ఎంతగా అంటే కొన్నిసార్లు తమ అసంతృప్తిని, అలసటని సైతం గమనించకుండా రోజులు దొర్లిస్తుంటారు. ఇదంతా తమకు ఏం కావాలో తెలుసుకోకపోవడం. తమ ఆనందాలకు, బాధ్యతలకు సమన్వయం కుదిరేలా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల వచ్చిన దుస్థితి. అందుకని మీకు సంతృప్తి, ఆనందం చేకూరేవిధంగా మీరు కాలాన్ని రూపొందించుకోవాలి.
- మీ అవసరాలు ఏమిటో మీరు ఒక కాగితం మీద రాసుకోండి.
- కొన్నిసార్లు చిన్నచిన్న ఆశల్ని సైతం తీర్చుకోలేరు. వాటికి ఎక్కువ ఖర్చు కూడా కాదు. కానీ వాయిదాల మీద వాయిదాలు వేస్తుంటారు. ఈ రకమైన కోరికల జాబితా ఒకటి తయారు చేసుకోండి.
- మీకు ఇష్టమైన సినిమాను కంప్యూటర్లో చూడాలనుకుంటారు. కానీ అది ఎప్పుడూ శ్రీవారి పనితోనో, పిల్లల గేమ్స్‌తోనూ బిజీగా ఉంటుంది. అయితే పట్టుబట్టి ఏ ఆదివారమో మీకు నచ్చిన సినిమా చూసేందుకు ప్లాన్ చేసుకోవాలి.
- షాపింగ్‌కు వెళితే మీకు నచ్చిన చీర మాత్రమే మీరు కొనుక్కోండి. మీకు ఇష్టం లేకున్నా ఇతరుల ఇష్టాన్ని మన్నించి నచ్చనిది తీసుకోవద్దు.
- అత్తయ్య చెప్పారనో, ఆయన ఏమంటారనో కాకుండా మీరేం చేయాలనుకుంటున్నారో మీరు నిర్ణయించుకోవాలి. పిల్లల కోసం మీరు చేయాలనుకున్న పనులు వాయిదా వేయకూడదు. రద్దు చేసుకోకూడదు.
- కొందరు కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళ కోసం తాము ముందే నిర్దేశించు కున్న పనిని రద్దు చేసుకుంటారు. చాలా కాలానికి ఊళ్ళోకి వచ్చిన స్నేహితురాలిని కలవాలనుకుంటారు. కానీ ఇంటిపనుల కోసం రాజీపడుతుంటారు. 'నా కోసం నేను బతకాలి' అనుకున్నప్పుడు ఈవిధంగా వ్యవహరించరు. తమ ప్రాధాన్యాల్ని సరిగా నిర్దేశించుకుంటారు.
- నెలక్కు ఒకసారయినా మీరెలా వున్నారో, మీరనుకుంటున్నట్టు జీవితం వున్నదో లేదో పరిశీలించుకోవాలి. ఎక్కడ, ఎందుకు, ఏ కారణం వల్ల అసంతృప్తి చెందుతున్నారో గమనించుకోవాలి. దాన్నించి బయట పడటమెలానో ప్లాన్ చేసుకోవాలి.
- ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా, ఏం బట్టలు ధరించాలన్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా స్వయంగా నిర్ణయాలు తీసుకోండి. ఇతరుల అవసరాలు తీర్చడమే మీ బాధ్యత అనుకోవద్దు. మీ కోసం మీరు కొంచెం బాధ్యతగా స్పృహతో వ్యవహరిస్తే జీవితం ఆనందంగా ఉంటుంది.
- మీకు సంగీతం, నృత్యం పట్ల ఆసక్తి ఉంటే ఆవిధమైన కార్యక్రమా లకు హాజరు కావడానికి ప్రయత్నించాలి. అందుకు అనుగుణంగా మీ టైమ్ ప్లాన్ చేసుకోవాలి.
- కవిత్వం, కథ రాయాలనే ఆలోచన ఉంటే అందుకు అనుగుణంగా టైమ్ సెట్ చేసుకోవాలి. ఇష్టంగా ఒక పుస్తకం చదవాలన్నా అందుకు తగిన సమయం సర్దుబాటు చేసుకోవాలి.
- మీకు ఇష్టమైన ప్రదేశాలు పర్యటించాలనుకుంటే- మూడురోజులయినా, నాలుగు రోజులయినా వెళ్ళాలనిపిస్తే ఎక్కువగా ఆలోచించవద్దు. ఆ నాలుగురోజులు ఇల్లు ఏమైపోతుందోనని రంది పడొద్దు. మీ ఇష్టానికి అనుగుణంగా గడపటానికి ప్రయత్నించండి. ఆఫీసుకు సెలవు పెట్టండి. మీరు చేయాలనుకున్న టూర్‌కు సంబంధించి ప్లాన్ చేసుకోండి.
- ఈవిధంగా మీకు నచ్చినట్టు మీరు గడిపితేనే జీవితంలో ఆనందం, హాయి ఉంటుంది. లేదంటే ఎవరికో బకాయి పడినట్టుగా కాలం గడిపిన బాధే మిగులుతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని జ్ఞాపకాలయినా మిగలవు. బతికిన క్షణాలు కనిపించవు. కనుక తాము ఆనందంగా, హాయిగా ఉండడం ఎలానో ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా కాలాన్ని ప్లాన్ చేసుకోవాలి.