Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పట్టుచీరలంటే ఇష్టపడని మహిళలుండరు. ధర ఎక్కువగా ఉండటంతో వాటిని కొనుగోలు చేయడం కష్టసాధ్యమైనపని. అయితే కనీసం ఒకటి, రెండు చీరలయినా కొనడం, వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోవడం ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు. మరి అంత విలువైన చీరలు పది కాలాలపాటు మన్నాలంటే ఈ దిగువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
క్రిమికీటకాదులు, దుమ్ము-ధూళి లేనిచోట జాగ్రత్త పెట్టుకోవాలి.
తేమ, వెలుతురు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వీటిని ఉంచకూడదు.
పట్టుబట్టలను కాటన్ వస్త్రంలో చుట్టి పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ సంచులలో పెట్టి దాచుకోవడం మంచిది కాదు.
అవకాశం దొరికినపుడు వీటిని బయటకు తీసి గాలి తగిలేటట్లు చేయాలి.
మరకలు తొలగించడం ఎలా?
పాల మరకలు: ఈ మరకలు పోయేవరకు కార్బన్ టెట్రాక్లోరైడ్ ద్రావణంతో శుభ్రంచేసి ఆ తరువాత నీటిలో పులిమి, ఉతికి నీడలో ఆరబెట్టి ఆ తరువాత ఇస్త్రీ చేయించుకోవాలి.
ఆయిల్ మరకల విషయంలో ఆయిల్‌ను స్పాంజ్‌ను మరక ఉన్న ప్రాంతంలో ఉంచాలి. ఆయిల్‌ను స్పాంజ్ పీల్చేసిన తరువాత పై పనులు చేయాలి.
ఇంక్ మరకలు & లిప్‌స్టిక్ మరకలు: మరక ఉన్న వైపు పట్టువస్త్రాన్ని ఒక తెల్ల కాగితంపై ఉంచాలి. రెండవ వైపున ఆల్కహాలుతో మరకవున్న ప్రాంతాన్ని నురుగు వచ్చేలా రుద్దితే మరక పోతుంది. మరక పోయిన తరువాత నీటిలో పులిమి, ఉతికి, నీడలో ఆరవేసి ఇస్త్రీ చేయించుకోవాలి.
గ్రీజు మరకలు: గ్రీజు మరకల మీద టాల్కమ్ పౌడరు చల్లాలి. ఆ తరువాత డ్రైక్లీనింగ్ ద్రావణంతో మరక వెనుక భాగం శుభ్రం చేయాలి. ఆ తరువాత బట్టను నీటిలో జాడించి నీడలో ఆరబెట్టాలి.
వైన్ మరకలు: చన్నీటిలో నానబెట్టి, లిక్విడ్ డిటర్జెంటుతో శుభ్రం చేయాలి.
కాఫీ, టీ మరకలు: ఈ మరక ఎండిన తరువాత ఆ ప్రదేశంలో బట్టపై కార్బన్ టెట్రాక్లోరైడ్‌తో నురుగువచ్చేలా బాగా రుద్దాలి. మరకలు పోతాయి. ఒకవేళ పోకపోతే కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపిన వేడినీటిలో బట్టను తడిపి ఉతికి ఆరబెట్టుకుని ఇస్త్రీ చేయించుకోవాలి.
పెయింట్ మరకలు: వేడినీటిలో బట్టను పులిమితే సాధారణంగా పోతాయి. అలా పోకపోతే కొద్దిగా టర్పంటైన్ లేదా కిరో సిన్‌తో ఆ ప్రాంతంలో బట్టను తడిపితే పెయింట్ మరకలు పోతాయి. ఆ తరు వాత బట్టను ఉతికి, ఆరబెట్టుకుని ఇస్త్రీ చేసుకోవచ్చు.
చెమట మరకలు: బాగా విలీన హైడ్రో క్లోరికామ్లంలో బట్టను శుభ్రం చేసుకుని, తరువాత నీటిలో పులిమి, నీడ పట్టున ఆరవేయాలి.
షూ పాలిష్ మరకలు: జాగ్రత్తగా దొరికిన మేర పాలిష్‌ను ఏదైన కర్రపుల్ల వంటి దానితో తొలగించాలి. ఆ తరువాత మరకవున్న భాగాన్ని లిక్విడ్ డిటర్జంట్‌తో శుభ్రం చేసుకోవాలి. ఆపైన ఆల్కహాల్‌తో బాగా రుద్దాలి.
నెయిల్ పాలిష్ మరకలు: ఎసిటోన్తో మరకపై నురుగువచ్చేలా రుద్ది ఆ తరువాత నీటిలో పులిమి, ఆరవేసి ఇస్త్రీ చేసుకోవాలి.
పండ్ల రసాల మరకలు: ఆల్కలీ, ఆల్కహాల్లను సమపాళ్లలో కలుపుకుని తయారుచేసిన ద్రావణంతో మరకను బాగా రుద్దితే మరకపోతుంది.
చాక్లెట్ మరకలు: వెచ్చని నీటితో శుభ్రం చేస్తే మరకలు పోతాయి.