Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుంది. అమ్మమ్మ దగ్గర పెరిగింది. ప్రేమించిన వ్యక్తినే పెండ్లి చేసుకుంది. ఇక తన జీవితంలో కష్టాలకు చోటే లేదనుకుంది. బతుకంతా ఆనందమయమనుకుంది. ముద్దులొలికే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఇలా ఆనందంగా సాగిపోతున్న ఆమె జీవితంలో పెను ఉప్పెన. భర్తలో వచ్చిన మార్పు ఆమెను తీవ్రంగా కలచివేసింది. ప్రేమను పంచాల్సిన వ్యక్తి అర్ధాంతరంగా బయటకు గెంటేశాడు. అత్తమామలు పట్టించుకోరు. ఆదరించే కన్నవారు లేరు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి...
''మేడమ్ నా పేరు స్వప్న. నాకు ఏడేండ్లప్పుడు అమ్మానాన్న ఓ ప్రమాదంలో చనిపోయారు. ఓ చెల్లి కూడా వుంది. మా ఇద్దరినీ అమ్మమ్మనే పెంచి పెద్ద చేసింది. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా వీధిలోనే వుండే సురేష్ పరిచయమయ్యాడు. అప్పుడు అతను ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చాలా అందంగా వుంటాడు. మంచివాడు. ఏడాది తిరిగే లోపు ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అతని ఇంజనీరింగ్ పూర్తయి ఉద్యోగం వచ్చిన తర్వాత పెండ్లి చేసుకోవాలనుకున్నాం. ఈ లోపు విషయం మా ఇంట్లో తెలిసింది.
అమ్మమ్మ నాకు వేరే పెండ్లి చేయాలనుకుంది. సురేష్‌ను కాదని వేరే వాళ్ళతో పెండ్లి చేస్తే చనిపోతా అనడంతో అమ్మమ్మ భయపడింది. మా పెండ్లికి ఒప్పుకుంది. అయితే సురేష్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. చదువు అయిపోయిన తర్వాతే పెండ్లి అన్నారు. అలా ఏడాది గడిచింది. నేను ఇంటర్ పూర్తి చేశాను. సురేష్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇంట్లో వాళ్ళను ఒప్పించి సురేష్ నన్ను పెండ్లి చేసుకున్నాడు.
సురేష్ నన్ను పెండ్లి చేసుకోవడం వాళ్ళ అమ్మకు ఇష్టం లేదు. ఎప్పుడూ సూటి పోటి మాటలు అంటుంది. బూతులు తిట్టేది. ఇవేవీ నేను పట్టించుకోను. సురేష్ ఉద్యోగం ఏమీ చేయడు. జాబ్ చూసుకోమంటే చూసుకోడు. వాళ్ళ అమ్మ కూడా ''కోట్ల ఆస్తి వుంది. మా వాడికి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు'' అంటుంది. ఊరికే కూర్చొని తింటున్నావంటూ నన్ను మాత్రం తిడుతుంది.
ఓరోజు నాకు ఫోన్ వచ్చింది. ఎవరో అమ్మాయి 'మీ ఆయన మంచి వాడు కాదు. అతనికి వేరే అమ్మాయిలతో సంబంధాలు వున్నాయి' అని చెప్పింది. ఆమె ఎవరని తెలుసుకుంటే ఆ అమ్మాయితోనే మా ఆయనకు సంబంధం వుందని తెలిసింది. నాకు తెలిసిన దగ్గర నుంచి సురేష్ నన్ను విపరీతంగా కొట్టేవాడు. ప్రేమించి పెండ్లి చేసుకున్న వ్యక్తి ఇలా చేస్తుంటే భరించలేక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టా.
కేసు కోర్టు వరకు వెళ్ళి మా ఆయన, అత్త, మామ కొన్ని రోజులు జైల్లో కూడా వున్నారు. ''ఇకపై నిన్ను మంచిగా చూసుకుంటా కేసు వెనక్కు తీసుకో'' అని మా ఆయన బతిమలాడాడు. ఆయన మాటలు నమ్మి కేసు వెనక్కు తీసుకున్నా. నన్ను కొట్టడం మానేశాడు. కానీ ఆమె దగ్గరకు వెళ్ళడం మాత్రం మానుకోలేదు. నేను మళ్ళీ నెల తప్పాను. బాబు పుట్టాడు. ఆయనలో మాత్రం మార్పు లేదు. రెండో సారి పాప పుట్టింది. గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. నన్నూ పిల్లల్ని ఇంట్లో నుండి గెంటేశారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరకు వచ్చా'' అంటూ కన్నీరు పెట్టుంది.
స్వప్న సమస్యంతా విన్న ఐద్వా లీగల్‌సెల్ సభ్యులు వచ్చే వారం వాళ్ల అమ్మను తీసుకు రమ్మనమని సురేష్‌కు లెటర్ పంపారు. చెప్పిన ప్రకారమే వాళ్ళు వచ్చారు.
సురేష్‌తో మాట్లాడుతూ ''నువ్వు స్వప్నను ప్రేమించి పెండ్లి చేసుకున్నావు. తల్లిదండ్రులు లేని పిల్ల నిన్ను నమ్మి వచ్చేసింది. చక్కని భార్య వుంటే వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నావు. ఒకవేళ నువ్వు ఆ అమ్మాయిని పెండ్లి చేసుకోవాలన్నా చట్ట ప్రకారం కుదరదు. ఇటు స్వప్న జీవితం, అటు ఆ అమ్మాయి జీవితం రెండూ నాశనం చేస్తున్నావు. నీకు ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళ భవిష్యత్ ఏమౌతుందో అర్థమవుతుందా?
ఉద్యోగం ఏమీ చేయకుండా ఇతరులపై ఆధారపడి బతుకుతున్నావు. అనవసరంగా లేనిపోని సమస్యలు తెచ్చుకోకు. స్వప్నను మంచిగా చూసుకో. లేదంటే పరిస్థితి మరో విధంగా వుంటుంది. స్వప్న మళ్ళీ కేసు పెట్టిందంటే నువ్వు సంబంధం పెట్టుకున్న అమ్మాయి కూడా రోడ్డు మీదకు రావల్సి వస్తుంది. మరో విషయం మీనాన్నది ప్రభుత్వ ఉద్యోగం. ఆయన ఉద్యోగానికి కూడా సమస్య తప్పదు. అప్పుడంటే స్వప్నకు తోడు ఎవ్వరూ లేరని నిన్ను నమ్మింది. కేసు వెనక్కు తీసుకుంది. ఇప్పుడు అలా వుండదు. తనకు తోడుగా మేమున్నాం. అన్ని విధాలుగా ఆమెకు న్యాయం జరిగేలా చూస్తాం.
ఇవన్నీ ఎందుకు అనుకుంటే స్వప్నను పిల్లల్ని మంచిగా చూసుకో. వెంటనే ఉద్యోగం చూసుకో. భార్యా పిల్లలతో సంతోషంగా వుండు. ఏదైనా నిర్ణయం నీదే. స్వప్న దేనికైనా సిద్ధంగా వుంది'' అన్నారు.
సురేష్ తల్లిని పిలిచి ''మీరు పెద్ద వారు. తల్లిదండ్రులు లేని అమ్మాయి మీ ఇంటికి వచ్చింది. మిమ్మల్ని ఓ తల్లిగా భావిస్తుంది. పెండ్లయి మీ ఇంటికి వచ్చిన నాటి నుండి మీరు ఎన్ని మాటలు అన్నా భరించింది. భర్త పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుంటే ఏ భార్య అయినా భరిస్తుందా? మీరూ ఓసారి ఆలోచించండి. పనీ పాట లేకుండా తాగి తిరుగుతున్న కొడుకును సమర్థిస్తున్నారు. దీని వల్ల భవిష్యత్‌లో మీకూ నష్టమే. ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి. స్వప్నను అర్థం చేసుకోండి. మీ మనవడు, మనవరాలిని అక్కున చేర్చుకోండి'' అన్నారు.
తల్లీ కొడుకులు ఇద్దరూ బయటకు వెళ్ళి పావుగంట మాట్లాడుకొని వచ్చి...
''మీరు చెప్పింది బాగానే వుంది. కానీ స్వప్న ప్రతి విషయానికి గోల చేస్తుంది. మమ్మల్ని రోడ్డుపైకి ఏడ్చింది. అలాంటి ఆమెను ఇంట్లో ఎలా వుంచుకోవాలి'' అంది సురేష్ తల్లి.
''భర్త తనకు అన్యాయం చేస్తున్నాడు, మీరు అతనికే సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఇలా చేస్తుంది. అదే మీరు తనకు సపోర్ట్ చేసి మీ కొడుకును బెదిరించో, బుజ్జగించో మార్చుకుని వుంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదుగా'' అన్నారు.
''మీరు చెప్పింది కూడా నిజమే. ఇకపై ఆమెను బాగానే చూసుకుంటాం. మా వాడికి నేను కూడా గట్టిగా చెబుతా. ముందు ఆమెను ఆ కేసుల జోలికి పోవద్దని చెప్పండి'' అంది.
''అది మీ చేతుల్లోనే వుంది. ఇప్పుడు ఆమె మీ ఇంటికే వస్తుంది. మీతోనే వుంటుంది. తనకు ఎప్పుడు ఏ కష్టం వచ్చిన తోడుగా మేముంటాము. మీకు తనని చక్కగా చూసుకుంటే కేసులేమీ వుండవు'' అన్నారు.
''మీరు చెప్పినట్టే స్వప్నను, పిల్లల్ని మంచిగా చూసుకుంటాం. ఉద్యోగం కూడా చేస్తా. తనని నాతో రమ్మని చెప్పండి'' అన్నాడు సురేష్.
స్వప్న నిర్ణయం అడిగితే ''నన్నూ, పిల్లల్ని ప్రేమగా చూసుకుంటే నేను మాత్రం ఎందుకు బయటకు వస్తాను. కేసులు ఎందుకు పెడతాను. నాకు కావాల్సింది ఆయన నుండి కాస్త ప్రేమ. కానీ తర్వాత నన్ను ఇబ్బంది పెడితే మాత్రం కచ్చితంగా కేసు పెడతా'' అంది.
స్వప్న చెప్పిన దానికి సురేష్ కూడా అంగీకరించి ఆమెనూ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నాడు. ఇద్దరూ వారం వారం లీగల్‌సెల్‌కు వచ్చి ఎలా వుంటున్నారో చెప్పి వెళ్ళాలని బాధ్యులు రాతపూర్వంగా రాయించుకుని పంపించారు.