Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మగువకు కురులే అందం. కానీ పెరుగుతున్న కాలుష్యం, మానసిక ఒత్తిడి వంటి కారణాలతో జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఇలవ ప్రతిరోజూ శిరోజాలు రాలిపోతుంటే దిగులుపడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అయితే జుట్టు కాపాడుకోడానికి పెద్ద కష్టపడక్కర్లేదు.... ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకుంటే చాలు అంటున్నారు నిపుణులు. అవేమిటో చూడండి...
- జుట్టు పెరగడం లేదే అని బెంగపడటం కూడా జుట్టు రాలిపోవడానికి కారణం.. ఎక్కువగా దిగులు పడేవాళ్లు, ఒత్తిడి పడేవాళ్లకి జుట్టు త్వరగా ఊడిపోవడమే కాదు, పెరిగే లక్షణాన్ని కూడా కోల్పోతుందట. మహా అయితే జుత్తు నెలకు అరంగుళం పెరుగుతుందంతే. కాబట్టి రాత్రికి రాత్రే పెరిగిపోవాలని ఆశపడటం అనవసరం.
- జుత్తు కట్ చేస్తే పొట్టిగా అయిపోతుందని దిగులుపడుతుంటారు. కానీ జుత్తును ఎంతగా కత్తిరిస్తే అంతగా పెరుగుతుందన్నది నిజం. కాబట్టి పది పన్నెండు వారాలకోసారి జుత్తుని ఒక అంగుళం కత్తిరించడమే మంచిది.
- ప్రతిరోజూ తలస్నానం చేయకూడదు. తలంటుకున్నప్పుడు మాత్రం మురికి పూర్తిగా వదిలేలా చూసుకోవాలి. అలాగే తలస్నానం చేసిన ప్రతిసారీ కండిషనర్ అప్లై చేయాలి.
- వారానికోసారి తలకు బాగా నూనె పట్టించి మసాజ్ చేయాలి. దానివల్ల తలలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. తలపై ఉన్న చర్మంలో తేమ పెరుగుతుంది. అది జుత్తు పెరుగుదలకు దోహదపడుతుంది.
- జుట్టును ఎడా పెడా దువ్వేయకూడదు, రుద్దేయకూడదు. కొందరు నూనె రాసుకునేటప్పుడు, దువ్వుకునేటప్పుడు కురులను అటూ ఇటూ వేసేస్తుంటారు. అది తప్పు. జుట్టును ఎప్పుడూ ఒకే డైరెక్షన్లో దువ్వుకోవాలి. అప్పుడే పాడవకుండా ఉంటుంది. ఎక్కువ రాలకుండానూ ఉంటుంది.
- తలంటుకున్న తర్వాత వెంట్రుకలను టవల్‌తో మరీ గట్టిగా కట్టేసుకోకూడదు. తడిసిన జుట్టు చాలా బలహీనంగా ఉంటుంది. అలాంటప్పుడు బిగించి కట్టడం వల్ల చిట్లిపోవడం, తెగిపోవడం జరుగుతుంది.
- మరీ వేడి నీటితో తలంటుకోకూడదు. చల్లని లేక గోరు వెచ్చని నీటితో మాత్రమే తలస్నానం చేయాలి. షాంపూని ఒకే పద్ధతిలో పెట్టుకోవాలి. మురికి పోవాలి కదా అని ఇష్టం వచ్చినట్టు రుద్దేసుకోకూడదు.
- జుత్తుకీ దిండుకీ సంబంధం ఉందంటే మీరు నమ్మగలరా? కానీ ఉందట. గట్టిగా ఉండే దిండు మెడ, తల కండరాలకే కాదు... జుత్తుకి కూడా హాని చేస్తుందంటారు నిపుణులు. అందుకే మెత్తగా ఉండే దిండు మాత్రమే వాడాలి. అలాగే ఉన్ని, ఖద్దరు దిండు కవర్లు వాడకూడదు. అవి జుత్తుని డ్యామేజ్ చేస్తాయట. వీలైనంత వరకూ శాటిన్ కవర్లు వాడటమే మంచిదట.