Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చదువు, ఉద్యోగం, ఇతరత్రా పనుల వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే స్నేహితులు, బంధువుల ఇళ్లకు అతిథులుగా వెళ్లాల్సిన సందర్భాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలను బట్టి లేదా ఇంకో విధంగానైనా అవతల వారికీ ఇబ్బంది కలుగవచ్చు. ఈ పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి.
మీరు వెళ్లాలనుకున్న ప్రయాణం ముందుగా నిర్ణయమైనప్పుడు, అవతలి వాళ్ల ఇంటికి వెళ్లేందుకు కనీసం వారం ముందుగానే మీ రాక వివరాలను తెలియజేయండి. ఈరోజుల్లో ఫోన్ సౌకర్యం ఉంది కాబట్టి ముందుగానే ఆ సమాచారాన్ని అందించవచ్చు. అలాగే మీ వెంట వారికి తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తున్నప్పుడు కచ్చితంగా ఆ వివరాలూ తెలియజేస్తే మంచిది. దీంతో వారిలో ఎలాంటి అనుమానాలకు తావు ఉండదు. అతిథికి మర్యాద కూడా బాగానే ఉంటుంది. అదేవిధంగా, మీరక్కడ ఎన్ని రోజులు ఉంటారనేదీ చెబితే దానికి తగ్గట్టుగా వారు తమ పనుల సర్దుబాటు చేసుకుంటారు.
మీ ఇంట్లో మీరెంత సౌకర్యంగా ఉన్నా బయటికెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడం తప్పనిసరి. అలాకాకుండా 'మా ఇంట్లో అయితే ఇలా చేస్తాం, అలా చేస్తాం' అంటూ అవతలి వారిని తక్కువ చేసేట్లు ప్రవర్తించకూడదు. అదేవిధంగా, అవతలి వారి నిద్రాహారాలూ, ఇంట్లో పాటించే పద్ధతులూ, అలవాట్లను తెలుసుకుని ప్రవర్తిస్తే మంచిది. దీనివల్ల మీకే కాదు, అవతలి వారికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఇతరుల ఇంటికి వెళ్లినప్పుడు వెంట ఏదో ఒక బహుమతి తీసుకెళ్లడం సాధారణంగా పాటించే సంప్రదాయం. వయసుని బట్టి, వారు మెచ్చేవి తీసుకెళితే సరి. వారూ సంతోషిస్తారు. ఇవి ఖరీదైనవే కావాల్సిన అవసరం లేదు. చదువూ, ఉద్యోగరీత్యా కొద్దిగా ఎక్కువ రోజులే ఉండాల్సి వస్తే, వారికి భారం కాకుండా ఇంటి పనుల్లో సాయం చేయండి.
సాధ్యమైనంత వరకూ మీరు వాడే వస్తువులను మీరే వెంట తీసుకెళ్లడం మంచిది. ఒకవేళ మీ స్నేహితుడి ఇంటికి వెళ్లినప్పుడు అతని తల్లిదండ్రులు, ఇంట్లో ఉండే పెద్దవారితో క్రమశిక్షణతో మెలుగుతూ, వారికి నచ్చేవిధంగా ఉండడం మంచిది.
మీరు చేసే చేతలు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసుకోవాలి. ఏం వండి పెట్టినా తినండి, అది బాగా లేదు, ఇది బా గా లేదు అంటూ వంకలు పెట్టకూడదు. ఇవన్నీ పాటించడం వల్ల అతిథిగా మీకు సౌకర్యాలు కల్పిస్తారు. మీరు సంతోషంగా ఉండగలుగుతారు.