Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్త్రీలు, బాలికలు జననాంగాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన నివారించదగిన అనేక అనారోగ్యాలు, వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. రుతుస్రావ సమయంలో జననాంగాలకు ఇన్ఫెక్షన్ సోకకుండా సహజంగా రక్షణను కల్పించే రసాయన వాతావరణం మారి పునరుత్పత్తి వ్యవస్థకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువవుతుంది. కనుక రుతుస్రావ సమయంలో మరింత శ్రద్ధతో జననాగాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
రుతుస్రావ పరిశుభ్రత - పాటించవలసిన అంశాలు
- ప్రతి రోజూ స్నానం చేసి శుభ్రమైన దుస్తుల్ని వేసుకోవాలి.
- స్నానం చేసేటప్పుడు, ప్రతిసారి మూత్ర విసర్జన, మలవిసర్జన తరువాత, జననాంగాల్ని నీటితో శుభ్ర పరచుకోవాలి. అలా శుభ్రపరచు కునేటప్పుడు నీరు మలద్వారం వైపు నుండి యోని, మూత్ర ద్వారం వైపుకు వెళ్ళకుండా జాగ్రత్తపడాలి.
- ప్యాడ్‌ని మార్చుకునేటప్పుడు, ప్రతిసారి ప్యాడ్‌ని పెట్టుకునే ముందు జననాంగాలకు అంటిన రక్తాన్ని, రక్తపు గడ్డల్ని శుభ్రంగా కడుక్కుని తొలగించాలి.
- శానిటరీ నాప్ కిన్స్ లేక తడిని పీల్చగల మెత్తటి, పొడి గుడ్డ ప్యాడ్లను రుతుస్రావాన్ని పీల్చేందుకు ఉపయోగించాలి. - ప్యాడ్లను ప్రతి 6-8 గంటలకు లేక అవసరమైనంత వ్యవధిలో తరచుగా మార్చుకోవాలి.
- ఎక్కువ సేపు మార్చుకోకపోతే దుర్వాసన రావడం, తొడలు కొట్టుకుపోయి, సూక్ష్మగాయాలై సులభంగా లోపలి జననాంగాలకు ఇన్ఫెక్షన్స్ చేరతాయి.
- సింథటిక్ గుడ్డను వాడగూడదు. అది సరిగ్గా తడిని పీల్చలేదు, చర్మంమీద దద్దుర్లు రావొచ్చు.
- నూలుతో చేసిన లోదుస్తుల్ని ధరించాలి.
- ఒకవేళ గుడ్డ ప్యాడ్స్‌ని వాడుతున్నట్లయితే వాటిని సబ్బు నీటితో శుభ్రం చేసి ఎండలో బాగా ఆరబెట్టిన తరువాత శుభ్రమైన సంచి లేక పెట్టెలో భద్రపరచి తిరిగి ఉపయోగించాలి.
- ఎండ అన్ని రోగక్రిముల్ని చంపు తుంది. తడిగా ఉన్న లేక మురికి గుడ్డల్ని వాడితే ఇన్ఫెక్షన్లు సోకుతాయి.
- రుతుస్రావ పరిశుభ్రతను పాటించకపోతే తెల్లబట్ట అవడం, మూత్రంలో మంట, నొప్పి, జననాంగాల దగ్గర దురదలు వస్తాయి.
- ఉపయోగించిన ప్యాడ్స్‌ని జాగ్రత్తగా పారేయాలి. నీటితో శుభ్రపరచి, పిండేసి, పాత న్యూస్ పేపర్లో చుట్టి మూత ఉన్న బకెట్లో వేసి వాటిని సవ్యంగా పారేయాలి. లేక కాల్చేయాలి లేక మట్టి కింద కప్పెట్టాలి.
రుతుస్రావ పరిశుభ్రతకు ఉపయోగించేవి
మళ్ళీ వాడగల గుడ్డ పాడ్స్
- టాంపూన్స్
- డిస్పోజబుల్ శానిటరీ నేప్ కిన్స్
- మెన్ట్స్రువల్ కప్స్
శానిటరీ నేప్కిన్స్, మళ్ళీ వాడే గుడ్డ పేడ్స్ని సురక్షితంగా పారేయడం:
- నేప్కిని టాయిలెట్స్‌లో పారేయగూడదు.
- టాయిలెట్ గదిలో ఒక మూల మూత ఉన్న డస్ట్ బిన్ ఉండాలి. చెడు వాసన రాకుండా ఉండడానికి తడిచిన నేప్ కిన్ని ఉతికి, నీళ్లను పిండి సిద్ధంగా ఉంచుకున్న పాత న్యూస్ పేపర్లో చుట్టి మూలన ఉంచిన మూత ఉన్న డస్టలో పడేయాలి.
- బిన్ నిండగానే శానిటేషన్ వ్యవస్థ ద్వారా వాటిని పారేయాలి. మీ నివాస ప్రాంతంలో అలాంటి వ్వవస్థీకత ఏర్పాటు లేకపోతే మీ పెరట్లోనే ఒక గొయ్యి తీసి పాతి పెట్టాలి లేక కాల్చేయాలి.
- పాడ్స్‌ని ఎక్కడబడితే అక్కడ పారేయడం వలన అసహ్యకరంగా ఉండడమే కాక హిపటైటిస్.బి అనే వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.
నేప్కిన్స్ పారేయడానికి ఇంకా మెరుగైన చర్యలు :
నేప్కిన్స్ని కాల్చడానికి వాడే ఇన్సినరేటర్స్ పర్యావరణహిత మార్గదర్శకాలననుసరిస్తూ ఉపయోగిస్తే తక్కువ కాలుష్యం ఉంటుంది. వీటిని పాఠశాలల్లో, మహిళలు పనిచేసే ప్రదేశాల్లో, మురికి వాడల్లో సామూహికంగా ఉపయోగ కరంగా ఉండేలా ఏర్పాటు చెయ్యాలి.
మెస్ట్స్రువల్ కప్
ఇది స్త్రీలు రుతుస్రావ సమయంలో యోనిలో అమర్చుకునే సాధనం. పాడ్స్, గుడ్డలు, టాంపూన్స్తో పోలిస్తే మెన్ట్స్రువల్ కప్ సురక్షితమైనది, ఆరోగ్యానికి తక్కువ హానిని కలగజేస్తుంది.
- మెస్ట్స్రువల్ కప్స్ పెద్ద, చిన్న సైజుల్లో లభిస్తాయి.
- ప్రతి 4-12 గంటలకొకసారి కప్పును బయటకు తీసి, రుతు స్రావాన్ని ఒంపేసి, కప్పును శుభ్రపరచి, మళ్ళీ యోని లోపల అమర్చుకోవాలి. రుతుస్రావం ఆగి పోయాక కప్పును మరుగుతున్న నీటిలో కనీసం 5 నిమిషాలు ఉంచి మళ్ళీ నెల ఉపయోగించడానికి భద్రపరచాలి.
- ఒక కప్పును 5-10 సంవత్సరాల పాటు ఉపయోగించవచ్చు. సుమారుగా 300 రూపాయలు ఖరీదు చేసే కప్పుని ఉపయోగించడం వలన ప్రతి నెల పాడ్స్‌కి ఖర్చుచేసే డబ్బు ఆదా అవుతుంది.
- మెస్ట్స్రువల్ కప్స్ పర్యావణ హితమైనవి. ప్రతి నెల పాడ్స్, వాటిని పారేయడానికి వాడే పాత న్యూస్ పేపర్లు మొదలైన వాటివలన వచ్చే వ్యర్థాల బెడద మెస్ట్స్రువల్ కప్‌తో ఉండదు.
- మెస్ట్స్రువల్ కప్స్‌లో పాడ్‌లోనూ, టాంపూన్లోనూ ఉపయోగించే బ్లీచ్, డయాక్సిన్ లాంటి రసాయనాలు ఉండవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రసాయనాలవలన కేన్సర్ రావచ్చని తెలిపింది
- మెస్ట్స్రువల్ కప్పుని ఉపయోగించేటప్పుడు అలవాటయేదాకా మొదట్లో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. స్త్రీల ఆరోగ్య అంశాలు, ముఖ్యంగా రుతుస్రావ పరిశభ్రత గురించి అవగాహన, ఉపయోగించిన పాడ్స్‌ని సురక్షితంగా పారేయడం లేక రుతుస్రావ సమయంలో సురక్షితమైన పద్ధతుల్ని ఉపయోగించడం మొదలైనవి ఐక్యరాజ్యసమితి ప్రపంచం ముందు ఉంచిన సుస్థిర అభివద్ధి లక్ష్యాల సమగ్ర సాధనలో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి.
- డా.ఆలూరి విజయలక్ష్మి, 9849022441
శ్రీశ్రీ సూలిస్టిక్ హాస్పిటల్, హైదరాబాద్