Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నోటికి కాస్త కారం కారంగా తింటుంటే చప్పబడిన నాలుకకు ప్రాణం లేచి వస్తుంది. అందుకో కాస్త నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంతో తింటే అబ్బా... ఎంత కమ్మగా వుంటుందో కదా... ఈ వానాకాలంలో కూరగాయలతో పాటు అప్పుడప్పుడు కొన్ని రకాల పచ్చళ్ళు కూడా ప్రయత్నించండి. ఇవి అన్నంలోకే కాదు ఉదయం పూట టిఫెన్లలోకి కూడా ప్రత్యేకంగా వేరే పచ్చడి చేయాల్సిన అవసరం లేకుండా తినేయవచ్చు. కొత్త రుచితో పాటు మీకూ కాస్త పని తగ్గుతుంది.
కాలిఫ్లవర్ పచ్చడి
కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ - ఒకటి, కారం -నాలుగు చెంచాలు, ఉప్పు - మూడు చెంచాలు, ఆవపిండి -నాలుగు చెంచాలు, మెంతిపిండి - చెంచా, వెల్లుల్లి రెబ్బలు - పది, నూనె - తగినంత.
తయారు చేసే విధానం: కడాయిలో పెట్టి నూనె వేసి అందులో తరిగిపెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలని వెయ్యాలి. మూత పెట్టకుండా కాస్త ఎరుపు రంగు వచ్చేదాకా వేయించి ఒక బౌల్ లోకి తీసి పెట్టుకోవాలి. ఆ ముక్కలలో కారం, ఉప్పు, మెంతి పిండి, ఆవపిండి, పసుపు వేసి కలుపుకోవాలి. కాస్త పులుపు కావాలనుకుంటే రెండు చెంచాల నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇలా తయారయిన మిశ్రమంలో వెల్లుల్లితో పోపు పెట్టుకుంటే చాలు. ఘుమ ఘుమలాడే కాలీ ఫ్లవర్ పచ్చడి రెడీ అయినట్టే.
కాకరకాయ పచ్చడి
కావాల్సిన పదార్థాలు : కాకరకాయలు - కేజీ, చింతపండు గుజ్జు - కప్పు, బెల్లం - కప్పు, మెంతి పొడి - టీ స్పూన్, ఆవపొడి - టీ స్పూన్, కారం పావు కప్పు, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, వెల్లుల్లి రెబ్బలు - పదీ పన్నెండు, పోపు దినుసులు - కొన్ని, నువ్వుల నూనె - అర లీటరు.
తయారు చేసే విధానం : ముందుగా చింతపండుని వేడినీళ్ళల్లో నానబెట్టి గుజ్జులా తీసి ఉంచుకోవాలి. అలాగే కాకరకాయలని కడిగి, తుడిచి పొడుగ్గా గాని, లేదా చిన్న ముక్కలుగా గాని తరుగుకుని ఉంచుకోవాలి. వాటిని ఒక కడాయిలో నూనె వేసి కాస్త ఎరుపు రంగు వచ్చేలాగా వేయించుకోవాలి. అలా వేగినవి కాస్త చల్లారాకా ఒక బౌల్లో వేసి అందులో మెంతిపొడి, ఆవపొడి, చింతపండు గుజ్జు, బెల్లం తురుము, కారం, ఉప్పు కలపాలి. అందులో పావులీటరు నూనె కలిపి ఉంచాలి. మరో కడాయిలో మిగిలిన నూనె వేసి కాగాకా సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి పోపు పెట్టుకోవాలి. ఆ పోపుని ముందుగా చేసిపెట్టుకున్న కాకరకాయ మిశ్రమంలో వేసి బాగా కలపి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఉంచుకోవటమే. అంతే కాస్త వెరైటీగా ఉండే కాకర కాయ పచ్చడి రెడీ.
క్యాప్సికమ్ పచ్చడి
కావలసినవి : క్యాప్సికమ్ - పావు కిలో, కారం - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, చింతపండు - సరిపడా, అల్లం, వెల్లుల్లి ముద్ద - టేబుల్ స్పూన్, నూనె - తగినంత, జీలకర్ర - అర టీ స్పూన్, పసుపు - కొద్దిగా, జీలకర్ర పొడి - స్పూన్, మెంతిపొడి - ఒక స్పూన్,
తయారు చేసే విధానం: ముందుగా క్యాప్సికమ్ కడిగి, తుడిచి, అంగుళం ముక్కలుగా కట్ చేసి గింజలు తీసేసు కోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు చిక్కగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడిచేసి జీలకర్ర వేసి వేగాక క్యాప్సికమ్ ముక్కలు, పసుపు వేసి కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు మెత్తబడ్డాక కారం, అల్లం, వెల్లుల్లి ముద్ద, తగినంత ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు వేయించాలి. తర్వాత జీలకర్ర పొడి, మెంతిపొడి, చింతపండు పులుసు వేసి బాగా కలిపి మూతపెట్టి ఉడికించాలి. ముక్కలు మసాలా ఉడికి నూనె తేలగానే స్టవ్ ఆఫ్ చేసి పొడి సీసాలో భద్రపరచుకోవాలి...
మునగాకు పచ్చడి
కావలసిన పదార్ధాలు : మునగాకు - పావు కేజీ, చింతపండు - కొద్దిగా, ఎండుమిర్చి - రెండు, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - రెండు కట్టలు, వెల్లులి - నాలుగు రెబ్బలు, జీలకర్ర - అర చెంచా, ఉప్పు - తగినంత, పసుపు - ముప్పావు స్పూను, పల్లీలు - పావు కప్పు, నూనె - సరిపడినంత, తాలింపుగింజలు - కొద్దిగా.
తయారు చేసే విధానం: మునగాకు కడిగి ఆరబెట్టి పుల్లలు, ఈనెల లేకుండా దూసి ఉంచుకోవాలి. పాన్లో నూనె వేడిచేసి పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, వెల్లులి, జీలకర్ర వేయించాలి. అవివేగాక మునగాకు వేసి వేయించుకోవాలి. పసుపు వేసి అవి పూర్తిగా వేగుతున్న సమయంలో కొత్తిమీర ఆకులువేసి ఉప్పు, చింతపండు వేసి మూతపెట్టి మగ్గనిచ్చి పొయ్యిమీద నుండి దించి చల్లారనివ్వాలి. ఈ లోగా పల్లీలు దోరగా వేయించుకోవాలి. ఇవ్వన్నీ కలిపి పచ్చడిలా రుబ్బుకోవాలి. ఈ పచ్చడిని విడిగా గిన్నెలోకి తీసుకుని పైన నూనెలో వేయించిన తాలింపుగింజలు, కరివేపాకు వేసుకోవాలి. ఈ పచ్చడి చాలా బావుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలామంచిది.