Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బయటి ఫుడ్ అంటే చాలు.. చిన్నా పెద్దా తేడా లేకుండా లొట్టలేసుకుంటూ తింటారు. నోటికి ఎప్పుడూ కొత్త కొత్త రుచులు కావాలి. బయట చూస్తే ప్రస్తుత పరిస్థితి బాగోలేదు. కరోనా కేసులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. ఇలాంటప్పుడు బయటి ఫుడ్ అస్సలు మంచిది కాదు. అలా అని నోటిని కట్టేసుకుని కూర్చో లేము. కొందరు పిల్లలైతే చాట్ అంటే పడి చస్తారు. దాని కోసమే మారాం చేస్తారు. తిండి విషయంలో పెద్దలనే కంట్రోల్ చేయడం కష్టం. ఇక పిల్లల్ని ఏం చేస్తాం. అందుకే ఇంట్లోనే కొన్ని రకాల చాట్లను చేస్తే ఇంటిల్లిపాది చక్కగా తినేయవచ్చు... మరి ఆరోగ్యకరమైన నోరూరించే కొన్ని చాట్లను ఎలా చేయాలో ఈ రోజు నేర్చుకుందాం...
సేవ్పూరీ
కావల్సిన పదార్థాలు : మైదా - రెండు కప్పులు, కారప్పూస - అరకప్పు, పెరుగు - అరకప్పు, ఉడికించిన ఆలూ ముక్కలు - కప్పు, ఉల్లిగడ్డ ముక్కలు - అరకప్పు, చాట్‌మసాలా - టీ స్పూను, కారం - టీస్పూను, జీలకర్రపొడి - టీస్పూను, రెడ్ చట్నీ - నాలుగు టేబుల్ స్పూన్లు, గ్రీన్ చట్నీ - రెండు టేబుల్ స్పూన్లు, మంచినీళ్లు - కప్పు, ఉప్పు - సరిపడా, నూనె - వేయించడానికి సరపడా.
తయారు చేసే విధానం : మైదాలో ఉప్పు వేసి, నీళ్లు పోసి పిండిలా కలపాలి. 20 నిమిషాలపాటు తడిబట్ట వేసి కప్పి ఉంచాలి. తర్వాత దీన్ని గుండ్రని చిన్న పూరీల్లా చేసి నూనెలో వేయించి తీయాలి. వీటిని ఓ ప్లేటులో ఉంచి వాటిమీద కొద్దిగా కారప్పూస, ఆలూ ముక్కలు, పెరుగు వేయాలి. తర్వాత రెడ్ చట్నీ, గ్రీన్ చట్నీ వేసి కారం, జీలకర్ర, చాట్ పొడులు చల్లితే సెవ్పూరీ రెడీ.
పాప్రీ చాట్
కావల్సిన పదార్థాలు : బియ్యప్పిండి - రెండు కప్పులు, మైదా - నాలుగు కప్పులు, పెరుగు - ఆరు కప్పులు, ఉడికించిన ఆలూ (మీడియం సైజువి) - నాలుగు, కారం - నాలుగు టీ స్పూన్లు, పసుపు - టీస్పూను, జీలకర్రపొడి - రెండు టీ స్పూన్లు, షాజీరాపొడి - రెండు టీ స్పూన్లు, కొత్తిమీర - కట్ట, కొబ్బరి తురుము - కప్పు, చాట్‌మసాలా - టీస్పూను, రెడ్ చట్నీ - ఆరు టీ స్పూన్లు, ఉప్పు - సరిపడా, కరివేపాకు - కొద్దిగా, నూనె - సరిపడా.
తయారు చేసే విధానం : బియ్యప్పిండి, మైదా, షాజీరాపొడి, జీలకర్రపొడి, కారం, పసుపు అన్నీ కలపాలి. ఈ మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసి గట్టి పిండిలా కలపాలి. పిండిని పూరీల్లా ఒత్తుకుని వేయించి తీపి ముక్కలుగా చిదమాలి. ఓ గిన్నెలో పెరుగు వేసి స్పూనుతో మృదువుగా కలపాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి టీస్పూను నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి. దించాక పెరుగు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. రెట్చట్నీ రెడీగా ఉంచుకోవాలి. విడిగా మరో గిన్నెలో ఉడికించిన ఆలూ ముక్కల్లో చాట్ మసాలా వేసి చిదిమినట్లుగా కలిపి ఉంచాలి. ఓ ప్లేటులో చిదిమిన పూరీలను కొన్ని పెట్టి, వాటి మీద టేబుల్ స్పూను చిదిమిన ఆలూ వేయాలి. నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు వేయాలి. ఆపైన టీస్పూను రెడ్ చట్నీ వేసి చాట్ మసాలా, కొత్తిమీర తురుము చల్లి అందించాలి.
దహీ పావడ్ చాట్
కావల్సిన పదార్థాలు : అప్పడాలు (వేయించినవి) - 24, ఉడికించి కోసిన బంగాళా దుంప ముక్కలు - 4 కప్పులు, మొలకల పెసలు - అరకప్పు, పెరుగు - ఒకటిన్నర కప్పులు, జీలకర్రపొడి - టీస్పూను, దానిమ్మ గింజలు - రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత, పంచదార - టేబుల్ స్పూను, ఎండుమిర్చి, వెల్లుల్లి కలిపి రుబ్బిన చట్నీ - పావుకప్పు, గ్రీన్ చట్నీ - పావుకప్పు, స్వీట్ రెడ్ చట్నీ - పావు కప్పు, చాట్‌మసాలా - అర టీస్పూను, తాజా కొత్తిమీర - రెండు టేబుల్ స్పూన్లు, కారప్పూస - తగినంత.
తయారు చేసే విధానం : పెరుగులో ఉప్పు, పంచదార వేసి స్పూనుతో బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. ప్లేటులో అప్పడాల ముక్కలు పెట్టి ఒక్కోదాని మీద కొన్ని ఆలూ ముక్కలు ఉంచాలి. ఇప్పుడు మొలకల పెసలు వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి చట్నీ, గ్రీన్ చట్నీ, తీపి చింతపండు చట్నీలు కొంచెం కొంచెంగా వేయాలి. తరువాత జీలకర్రపొడి, చాట్ మసాలా, కారం, ఉప్పు చల్లి పెరుగు వేయాలి. వీటిమీద మళ్లీ కొత్తిమీర తురుము, దానిమ్మ గింజలు, కారప్పూస చల్లి అందించాలి.
స్వీట్ పొటాటో చాట్
కావల్సిన పదార్థాలు : మోరంగడ్డలు(మీడియం సైజువి) - మూడు, ఆలూ(మీడియం సైజువి) - మూడు, పచ్చిమిర్చి - మూడు, జీలకర్ర, టీస్పూను, కారం - అర టీస్పూను, చాట్‌మసాలా - టీస్పూను, చింతపండు - చిన్న నిమ్మకాయంత, ఉప్పు - తగినంత, పంచదార - అరటీస్పూను, నూనె - రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీదర తురుము - పావుకప్పు, నిమ్మరసం - టేబుల్ స్పూను.
తయారు చేసే విధానం : అలూ, మోరంగడ్డలు ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా కోయాలి. చింతపండు నానబెట్టి గుజ్జు తీయాలి. పాన్‌లో ఓ టేబుల్‌స్పూను నూనె వేసి జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత ఆలూ, మొరంగడ్డ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించి తీసి మరో గిన్నెలో వేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు అదే పాన్‌లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, చాట్‌మసాలా, కారం వేసి కొద్దిగా వేయించి దుంపముక్కల మీద చేయాలి. తర్వాత వీటిమీద చింతపండు గుజ్జు, పంచదార, కొత్తిమీర తురుము వేసి కొద్దిగా నిమ్మరసం పిండి కలిసి అందించాలి. బబ
చాట్ చట్నీలు
గ్రీన్ చట్నీ : అరకప్పు కొత్తిమీర తురుము, అరకప్పు కొబ్బరి తురుము, రెండు పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి మిక్సీలో రుబ్బాలి. చివరగా రెండు చుక్కల నిమ్మరసం పిండితే గ్రీన్ చట్నీ రెడీ. కొత్తిమీర బదులు పుదీనా కూడా వేసుకోవచ్చు.
రెడ్ చట్నీ : ఎండు ఖర్జూరాలు, నిమ్మకాయంత చింతపండు తీసుకుని తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత మెత్తగా రుబ్బి ఉప్పు, కారం కలిపితే రెడ్చట్నీ రెడీ. కావాలనుకుంటే కాస్త నూనెతో తాలింపు వేసుకోవచ్చు.
స్వీట్ రెడ్ చట్నీ : రెడ్ చట్నీలో కాస్త బెల్లం లేదా పంచదార చేరిస్తే స్వీట్ చట్నీ తయార్.