Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి, బెంగళూర్ ఢ నేడు
- రోహిత్ శర్మ ఫామ్‌పై అందరి దృష్టి
నవతెలంగాణ-ముంబయి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 లీగ్ దశ చివరి అంకంలోకి ప్రవేశించింది. పది జట్టు పది మ్యాచులు ఆడేశాయి. టాప్-4లో నిలిచిన నాలుగు జట్లు 11 చొప్పున మ్యాచులు ఆడేశాయి. పాయింట్ట పట్టికలో అట్టడుగున నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు సైతం ప్లే ఆఫ్స్ తలుపులు తెరిచే ఉండటంతో ఇప్పుడు ప్రతి మ్యాచ్ కీలకంగా మారుతుంది. పాయింట్ట పట్టికలో వరుసగా 5, 6 స్థానాల్లో కొనసాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, ముంబయి ఇండియన్స్ టాప్-4లోకి అడుగుపెట్టేందుకు ఎదురు చూస్తున్నాయి. పది మ్యాచుల్లో ఐదేసి విజయాలు, పరాజయాలతో నిలిచిన బెంగళూర్, ముంబయి నేడు విజయంతో ఏకంగా టాప్-3లోకి నిలిచేందుకు చూస్తున్నాయి. చిన్నస్వామిలో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై బెంగళూర్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. నేడు వాంఖడెలో బెంగళూర్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్‌సేన సిద్ధంగా ఉంది.
రోహిత్ మెరిసేనా? : ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌట్‌గా నిలిచిన చెత్త రికార్డును మూటగట్టుకున్న రోహిత్ శర్మ.. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదు పరుగులే సాధించాడు. రోహిత్ శర్మ వైఫల్యం జట్టుపై ప్రభావం చూపుతోంది. ఆరంభం నుంచి మిశ్రమ ఫలితాలు సాధిస్తున్న ముంబయి ఇండియన్స్ నిలకడ చూపించలేదు. చివరి దశ మ్యాచుల్లో నిలకడ లేకపోతే ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కదు!. టెస్టు జట్టులో చోటు దక్కిన ఆనందంలో ఇషాన్ కిషన్ నేడు మెరుపు ఇన్నింగ్స్‌పై కన్నేయనున్నాడు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్ ముంబయి ఇండియన్స్‌కు కీలకం కానున్నారు.
టాప్‌పైనే భారం! : ఐపీఎల్లో సీజన్లు మారుతున్నా రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ సమస్య మారటం లేదు. ఆరంభం నుంచి బెంగళూర్ స్టార్ క్రికెటర్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. అదే ఆ జట్టు బలం, బలహీనతగా మారింది. విరాట్ కోహ్లి, డుప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్ బెంగళూర్ బ్యాటింగ్ భారం మోస్తున్నారు. ఈ ముగ్గురు అంచనాలు అందుకోవటంలో విఫలమైతే.. బెంగళూర్ బ్యాటింగ్ కుదేలైతుంది. కీలక మ్యాచుల్లో బెంగళూర్ ఈ సమస్యను అధిగమిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగవుతాయి. బౌలర్లు జోశ్ హాజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్‌ల, వానిందు హసరంగ కీలకంగా మారనున్నారు.
ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మ్యాచ్‌కు వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది. వాంఖడెలో సంప్రదాయ పిచ్‌ను సిద్ధం చేశారు. ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచుల్లో మూడు సార్లు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టును విజయం వరించింది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది.