Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 49 బంతుల్లోనే 103 నాటౌట్
- గుజరాత్‌పై ముంబయి గెలుపు
నవతెలంగాణ-ముంబయి
సూర్యకుమార్ యాదవ్ (103 నాటౌట్, 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) శివమెత్తాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 49 బంతుల్లో శతకం సాధించిన సూర్యకుమార్ యాదవ్ ముంబయి ఇండియన్స్‌కు ఒంటిచేత్తో భారీ స్కోరు అందించాడు. సూర్యకుమార్ యాదవ్ వన్‌మ్యాన్ షోతో ముంబయి ఇండియన్స్ తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగులు భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (31, 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ శర్మ (29, 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), విష్ణు వినోద్ (30, 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. 219 పరుగుల భారీ ఛేదనలో గుజరాత్ టైటాన్స్ చేతులెత్తేసింది. ఛేదనలో తిరుగులేని రికార్డున్న గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులే చేసింది. 27 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. సీజన్లో ఏడో విజయంతో ముంబయి ఇండియన్స్ (14) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.
రషీద్ పోరాటం వృథా : భారీ ఛేదనలో టైటాన్స్ ముందే చతికిల పడింది. సాహా (2), గిల్ (6), హార్దిక్ (4), అభినవ్ మనోహర్ (2), రాహుల్ తెవాటియ (14) విఫలమయ్యారు. విజరు శంకర్ (29), డెవిడ్ మిల్లర్ (41) మెరిసినా 103 పరుగులకే గుజరాత్ 8 వికెట్లు చేజార్చుకుంది. ఈ పరిస్థితుల్లో రషీద్ ఖాన్ (79 నాటౌట్, 32 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్స్‌లు) సిక్సర్ల వర్షం కురిపించాడు. ధనాధన్ ఇన్నింగ్స్ నమోదు చేసిన రషీద్ ఖాన్ టైటాన్స్ గౌరవప్రద ఓటమి అందించాడే కానీ..పరాజయం తప్పించలేకపోయాడు. 20 ఓవర్లలో 8వికెట్లకు టైటాన్స్ 191 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లలో ఆకాశ్ (3/37), పియూశ్ చావ్లా (2/36), కుమార్ కార్తికేయ (2/37) రాణించారు.
సూర్య విశ్వరూపం : సొంతగడ్డపై తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ముంబయి ఇండియన్స్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (31), కెప్టెన్ రోహిత్ శర్మ (29) తొలి వికెట్‌కు మెరుపు ఆరంభాన్ని అందించారు. పవర్‌ప్లేలో ముంబయి ఇండియన్స్ ఏకంగా 61 పరుగులు పిండుకుంది. మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ చేజారుతున్న తరుణంలో స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ మ్యాజిక్ చేశాడు. వరుస ఓవర్లలో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లను అవుట్ చేసి గుజరాత్ టైటాన్స్‌ను ముందంజలో నిలిపాడు. కానీ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం ముంగిట రషీద్ ఖాన్ మాయజాలం నిలువలేదు. రషీద్ ఖాన్ మరో ఇద్దరు బ్యాటర్లు నేహల్ వధేరా (15), టిమ్ డెవిడ్ (5)లను అవుట్ చేసినా.. ముంబయి ఇండియన్స్ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 32 బంతుల్లోనే అర్థ సెంచరీ కొట్టాడు. శతకం కోసం సూర్యకుమార్ యాదవ్ మరింత వేగంగా పరుగులు పిండుకున్నాడు. 11 ఫోర్లు, ఆరు సిక్సర్ల అండతో 49 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఆరో వికెట్‌కు కామెరూన్ గ్రీన్ తోడుగా 18 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన సూర్యకుమార్ యాదవ్.. గుజరాత్ టైటాన్స్ కండ్లుచెదిరే ఇన్నింగ్స్ నమోదు చేశాడు. విష్ణు వినోద్, వధేరాలు సైతం ధనాధన్ వేటలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.