Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శుభ్‌మన్ సూపర్ షో గుజరాత్ టైటాన్స్ 188/9
నవతెలంగాణ-అహ్మదాబాద్: యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (101, 58 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) శతక విన్యాసంతో చెలరేగాడు. 56 బంతుల్లోనే ఐపీఎల్లో తొలి సెంచరీ నమోదు చేసిన శుభ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్‌కు భారీ స్కోరు అందించాడు. శుభ్‌మన్ గిల్‌కు తోడుగా సాయి సుదర్శన్ (47, 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. గిల్, సుదర్శన్ మినహా టైటాన్స్ శిబిరంలో మరో బ్యాటర్ రెండెంకల స్కోరు సాధించలేదు. అయినా, శుభ్‌మన్ శతక గర్జనతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (5/30) ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించాడు.
ఇద్దరే అదరగొట్టారు : అహ్మదాబాద్‌లో టాస్ నెగ్గిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఛేదనలో టైటాన్స్ రికార్డును దృష్టిలో ఉంచుకుని సన్‌రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ ప్రణాళిక బాగానే సాగుతుందని అనిపించినా.. టైటాన్స్ శిబిరంలో ఇద్దరు బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్ వృద్దిమాన్ సాహా (0)ను తొలి ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (101)తో జతకలిసిన సాయి సుదర్శన్ (47) మూడో వికెట్‌కు 146 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. తొమ్మిది ఫోర్ల సాయంతో 22 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన శుభ్‌మన్ గిల్.. అదే ఊపులో కెరీర్ తొలి ఐపీఎల్ శతకం కొట్టాడు. అర్థ సెంచరీ ముంగిట సాయి సుదర్శన్ నిష్క్రమణతో.. టైటాన్స్ బ్యాటర్ల వైఫల్యం మొదలైంది. కెప్టెన్ హార్దిక్ పాండ్య (8), డెవిడ్ మిల్లర్ (7), రాహుల్ తెవాటియ (3), రషీద్ ఖాన్ (0), నూర్ అహ్మద్ (0), మహ్మద్ షమి (0) తేలిపోయారు. భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. గిల్, సుదర్శన్ మెరుపులతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 188 పరుగులు నమోదు చేసింది.