Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాయంతో సెమీస్ బౌట్‌కు దూరం
- టీమ్ ఇండియా కాంస్య తీన్మార్
తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ తీన్మార్. బాక్సింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్ చరిత్ర లోనే తొలిసారి మూడు పతకాలు సాధించిన భారత్..తాష్కెంట్లో కంచు మోత మోగించింది. తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ సహా దీపక్ బొరియా, నిషాంత్ దేవ్‌లు కాంస్య పతకాలతో చరిత్ర సృష్టించారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు) అప్రతిహత విజయాలకు మోకాలి గాయం చెక్ పెట్టింది!. మోకాలి గాయం కారణంగా సెమీఫైనల్ బౌట్‌కు హుసాముద్దీన్ బరిలోకి దిగలేకపోయా డు.ఉత్కంఠగా సాగిన క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ మోకాలు గాయానికి గురయ్యాడు. గాయం తీవ్రత దృష్ట్యా సెమీఫైనల్ బౌట్లో హుసాముద్దీన్ బరిలోకి దిగటం మంచిది కాదని వైద్య బృందం సూచించింది. దీంతో భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) శుక్రవారం అతడిని సెమీస్ పోటీకి నుమతించలేదు. సెమీఫైనల్లో ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చిన హుసాముద్దీన్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో హుసాముద్దీన్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. 'గాయం కారణంగా హుసాముద్దీన్ సెమీఫైనల్ బౌట్‌కు ఫిట్నెస్ సాధించలేదు. క్వార్టర్స్‌లో హుసామ్ మోకాలికి గాయం అయింది. వాపు ఇంకా తగ్గలేదు.అతడిని బౌట్‌కు అనుమతించలేదు' అని బీఎఫ్ఐ ఒక ప్రకటనలో తెలిపింది. మరో రెండు సెమీఫైనల్స్ బౌట్లలో దీపక్ భొరియా (51 కేజీలు), నిషాంత్ దేవ్ (71 కేజీలు) ఓటమి పాలై కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2019లో మన బాక్సర్లు ఓ రజతం, ఓ కాంస్యం గెలుచుకోగా.. ఈ సారి మూడు కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి ఇప్పటి వరకు విజేందర్ సింగ్ (2009 కాంస్యం), వికాస్ కష్ణన్ (2011 కాంస్యం), శివ థాపా (2015 కాంస్యం), గౌరవ్ బిధురి (2017 కాంస్యం), అమిత్ పంగల్ (2019 రజతం), కౌషిక్ (2019 కాంస్యం), ఆకాశ్ కుమార్ (2021 కాంస్యం) పతకాలు గెలిచారు.