Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాట్స్ చైర్మెన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్
- ఉత్సాహంగా రెండో రోజు సిఎం కప్ పోటీలు
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ క్రీడా పండుగ 'సిఎం కప్ 2023' టోర్నీ మండల స్థాయి పోటీలు రెండో రోజు ఉత్సాహంగా సాగాయి. మండల స్థాయి పోటీల్లో భాగంగా మహిళలు, పురుషులకు ఐదు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. అథ్లెటిక్స్, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఆటల్లో గ్రామీణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మండల స్థాయిలో రెండో రోజుల పోటీల సందర్భంగా రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మెన్ డాక్టర్ ఈడిగ ఆంజనేయ గౌడ్ మంగళవారం భువనగిరి మండల కేంద్రంలో సిఎం కప్ సంబురాల్లో పాల్గొన్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి రెండో రోజు వాలీబాల్, కబడ్డీ పోటీలను ఆంజనేయ గౌడ్ ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారులతో కలిసి కబడ్డీ, వాలీబాల్ ఆడిన ఆంజనేయ గౌడ్, శేఖర్ రెడ్డి యువతలో క్రీడా స్ఫూర్తిని నింపారు. ' తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. క్రీడా ప్రాంగణాల సంరక్షణ యువత బాధ్యత. మైదానాలు నిత్యం ఆటల పోటీలతో కళకళలాడేలా యువత చొరవ తీసుకోవాలి. సిఎం కెసిఆర్ ప్రోత్సాహంతో ఎంతోమంది గ్రామీణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో అసమాన విజయాలు సాధిస్తున్నారు. తెలంగాణ క్రీడా విజేతలకు భారీ నగదు ప్రోత్సాహకాలు, విలువైన ఇండ్ల స్థలాలతో ముఖ్యమంత్రి ప్రోత్సాహం అందిస్తున్నారు. స్పోర్ట్స్ రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకుని యువత విద్య, ఉద్యోగాలలో రాణించాలని' శాట్స్ చైర్మెన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. సిఎం కప్ 2023 మండల స్థాయి పోటీల్లో బుధవారం రోజు పోటీలు ఆఖరు. బుధవారం తుది పోటీల అనంతరం విజేతలను జిల్లా స్థాయి సిఎం కప్ పోటీలకు ఎంపిక చేయనున్నారు.
విజయవంతం చేయాలి :
సిఎం కప్ 2023 పోటీలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర క్రీడా, శాట్స్ అధికారులను క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. సిఎం కప్ మండల స్థాయి పోటీలు బుధవారంతో ముగియనుండగా.. జిల్లా స్థాయి సిఎం కప్ పోటీలు మే 22 నుంచి ఆరంభం కానున్నాయి. జిల్లా స్థాయి పోటీలకు నిర్వహణ కమిటీలు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. జిల్లా మంత్రులు, స్థానిక శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్లు సమన్వయం చేసుకుని పోటీలను విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియ, శాట్స్ డిప్యూటీ డైరెక్టర్ దీపక్ పాల్గొన్నారు.