Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇషాన్ కిషన్, నేహల్ ధనాధన్
- బెంగళూర్‌పై ముంబయి ఘన విజయం
నవతెలంగాణ-ముంబయి
సూర్యకుమార్ యాదవ్ (83, 35 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సూర్య ప్రతాపానికి ఇషాన్ కిషన్ (42, 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), నేహల్ వాదెర (52 నాటౌట్, 34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ మెరుపులు జతకలవటంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌పై ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలోనే ఛేదించింది. ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ (7) విఫలమయ్యాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడగా.. ఆ తర్వాత సంగతి సూర్యకుమార్ యాదవ్ చూసుకున్నాడు. నెహల్ వదెరాతో కలిసి మూడో వికెట్‌కు 140 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించిన సూర్య.. ముంబయి ఇండియన్స్‌కు సీజన్లో ఆరో విజయాన్ని అందించాడు. సూర్య ఆరు సిక్సర్లు, ఏడు బౌండరీలు బాదగా.. నేహల్ నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో దండెత్తాడు. బెంగళూర్ బౌలర్లలో హసరంగ, విజరుకుమార్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసింది.
గ్లెన్ మాక్స్వెల్ (68, 33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), డుప్లెసిస్ (65, 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో విరుచుకుపడ్డారు. విరాట్ కోహ్లి (1), అనుజ్ రావత్ (6)లు విఫలమైన వేళ బెంగళూర్ ఒత్తిడిలో పడింది. కెప్టెన్ డుప్లెసిస్, మాక్స్వెల్ మూడో వికెట్‌కు 120 పరుగులు జోడించి బెంగళూర్‌కు భారీ స్కోరు అందించారు. చివర్లో దినేశ్ కార్తీక్ (30, 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.