Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిఎం కప్ మండల స్థాయి పోటీల ప్రారంభోత్సవంలో
శాట్స్ చైర్మెన్ ఆంజనేయ గౌడ్
- రాష్ట్ర వ్యాప్తంగా సిఎం కప్ పోటీలు ఆరంభం
- ఐదు క్రీడాంశాల్లో పోటీలు షురూ
నవతెలంగాణ-హైదరాబాద్ :
'ఇది యువ సంబురం. గుడి, బడి మాదిరిగానే మైదానాలనూ గౌరవించాలి. యువత ఐక్యత, ఆరోగ్య తెలంగాణకు క్రీడలే కీలకమని' రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మెన్ డాక్టర్ ఈడిగ ఆంజనేయ గౌడ్ అన్నారు. సిఎం కప్ 2023 మండల స్థాయి పోటీల ఆరంభోత్సవంలో శాట్స్ చైర్మెన్ పాల్గొన్నారు. అబ్దుల్లాపూర్మెట్లో జరిగిన మండల స్థాయి పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన శాట్స్ చైర్మెన్ సిఎం కప్ టోర్నీని అధికారికంగా ప్రారంభించారు. మండల ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన ఆంజనేయ గౌడ్ పోటీల ఆరంభం సందర్భంగా వాలీబాల్ ఆడి అలరించారు. కబడ్డీ పోటీలను ఆరంభించి ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పోటీలను తిలకించారు. మండల స్థాయిలో సిఎం కప్ పోటీలు సోమ, మంగళ, బుధ వారాల్లో జరుగుతాయి. మండల స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను జిల్లా స్థాయి సిఎం కప్ పోటీలకు ఎంపిక చేయనున్నారు.
క్రీడలకు పెద్దపీట : సిఎం కప్ 2023 మండల స్థాయి పోటీలను ఆరంభించిన శాట్స్ చైర్మెన్ ఆంజనేయగౌడ్ ఈ సందర్భంగా మాట్లాడారు. ' తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుతో క్రీడలకు పెద్దపీట వేసింది. క్రీడాకారులకు ఉద్యోగాల్లో రెండు శాతం, ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాల్లో 0.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుంది. యువత ఐక్యత, ఆరోగ్య తెలంగాణకు క్రీడలే కీలకం. 615 మండలాల్లో సిఎం కప్ పోటీలతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా స్ఫూర్తి వెల్లివిరిసింది. ఇది తెలంగాణ యువ సంబురం. ఇక నుంచి ప్రతి ఏడాది సిఎం కప్ పోటీలు నిర్వహిస్తాం. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు శాట్స్ అకాడమీల్లో శిక్షణ ఏర్పాటు చేస్తామని' ఆంజనేయ గౌడ్ తెలిపారు.
పండుగలా పోటీలు : చీఫ్ మినిస్టర్ కప్ 2023 పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో మొదలయ్యాయి. 615 మండల కేంద్రాల్లో ఐదు క్రీడాంశాల్లో పోటీలు షురూ చేశారు. గజ్వెల్లో జరిగిన పోటీల ఆరంభోత్సవంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ వంటేరు ప్రతాపరెడ్డి, మున్సిపల్ చైర్మెన్ రాజమౌళి గుప్త తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్లో జరిగిన పోటీలను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు మండల స్థాయి పోటీల ఆరంభ కార్యక్రమంలో విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
పకడ్బందిగా ఏర్పాట్లు! : ఇక రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సిఎం కప్ పోటీలకు ఏర్పాట్లు పకడ్బందిగా సాగుతున్నాయి. నాలుగు రోజుల పాటు సాగే క్రీడా సంబురంలో 33 జిల్లాల నుంచి సుమారు 10,000 మంది క్రీడాకారులు రాజధానికి రానున్నారు. క్రీడాకారులు, కోచ్లు, అధికారులకు వసతి, బస, భోజన ఏర్పాట్లు సహా రాష్ట్ర క్రీడల నిర్వహణకు ఇప్పటికే రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) 14 సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. పోటీలు నిర్వహించే స్టేడియాలు, క్రీడాకారులు బస చేసే హోటళ్లులపై శాట్స్ వీసీ అండ్ ఎండీ సందీప్ కుమార్ సుల్తానియ సోమవారం తన కార్యాలయంలో సమీక్ష చేశారు. రాష్ట్ర స్థాయి సిఎం కప్ పోటీలకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని, ఎటువంటి అడ్డంకులు రాకూడదని ఈ సందర్భంగా శాట్స్ అధికారులను ఆదేశించారు.