Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ పోలీసులకు మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశం
- మేజిస్ట్రేట్ ఎదుట మైనర్ వాంగ్మూలం నమోదు
- ఉదృతంగా సాగుతున్న రెజ్లర్ల ఆందోళన
నవతెలంగాణ-న్యూఢిల్లీ
మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) లోక్‌సభ సభ్యుడు, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెజ్లింగ్ క్రీడాకారుల ఆందోళన గురువారం మరింత ఉదృతంగా కొనసాగింది. నిరసన కార్యక్రమంలో భాగంగా మే 11 (గురువారం) 'బ్లాక్ డే'గా పాటించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు మల్లయోధులు, మద్దతుదారులు జంతర్‌మంతర్ వద్ద బ్లాక్ డే పాటించారు. బ్లాక్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా, జంతర్ మంతర్ వద్ద రెజ్లింగ్ క్రీడాకారులకు అపూర్వ మద్దతు లభించింది.
మే 12న నివేదిక ఇవ్వండి : బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసులో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ అంశంలో పోలీసుల దర్యాప్తును న్యాయమూర్తి పర్యవేక్షణలో జరిపించాలని కోరుతూ భారత అగ్రశ్రేణి రెజ్లర్లు ఢిల్లీ మేజిస్ట్రేట్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై ఎప్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు తీవ్రమైన కేసులో ఇప్పటివరకు బిజెపి ఎంపీని అరెస్టు చేయలేదు. దర్యాప్తులో బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు అనుకూలత కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు రెజ్లర్లు అనుమానం వ్యక్తం చేశారు. మల్లయోధుల పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మేజిస్ట్రేట్ న్యాయస్థానం ఢిల్లీ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై నమోదు చేసిన రెండు ఎఫ్ఐఆర్ల్లో దర్యాప్తు స్టేటస్ రిపోర్టును అందజేయాల్సిందిగా ఆదేశించింది. మే 12లోగా ఢిల్లీ పోలీసులు స్టేటస్ రిపోర్టు సమర్పించాలని, ఆ రోజుకు పిటిషన్‌పై వాదనలను వాయిదా వేసింది.
ఎట్టకేలకు వాంగ్మూలం : లైంగిక వేధింపులకు గురైన బాధిత రెజ్లర్లకు న్యాయం కల్పించటంలో ఢిల్లీ పోలీసులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై పోక్సో చట్టం, 2012 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోక్సో కేసులో బాధితురాలి వాంగ్మూలాన్ని నేరుగా మేజిస్ట్రేట్ నమోదు చేస్తారు. రెజ్లర్ల ఆందోళన 20వ రోజుకు చేరుకున్నప్పటికీ.. ఢిల్లీ పోలీసులు ఆ పని చేయలేదు. తాజాగా క్రిమినల్ పీనల్ కోడ్, సెక్షన్ 164 ప్రకారం మైనర్ మహిళా రెజ్లర్ వాంగ్మూలం బుధవారం న్యాయమూర్తి ఎదుట నమోదు చేశారు. మరో ఆరుగురు మహిళా రెజ్లర్ల వాంగ్మూలాలు సైతం న్యాయమూర్తి త్వరలోనే నమోదు చేయనున్నట్టు సమాచారం.
ఫిర్యాదుల కమిటీలు ఎక్కడీ : లైంగిక వేధింపుల నిరోధక చట్టం, 2013 ప్రకారం క్రీడా సమాఖ్యల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) ఏర్పాటు చేయాలి. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ లేదు. రెజ్లింగ్ సమాఖ్యతో పాటు మరో 15 జాతీయ క్రీడా సమాఖ్యలు అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సి) గురువారం నోటీసులు జారీ చేసింది. కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ, భారత క్రీడా ప్రాధికార సంస్థ (సారు), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) సహా మరో 15 నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్‌కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది.