Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి: భారతమ్మా తల్లి భారతమ్మా
బాధలే రైతులకెందుకమ్మా
చెల్లమంటు నల్ల చట్టాలను
ఢిల్లీకే లక్షల్లో చేరిరమ్మా
కల్లకపటం లేని రైతు కూలీల మీద
కార్పొరేట్ల జులుం పెరుగుతుందోయమ్మ ||భారతమ్మా||
1. మూడు చట్టాలతో మూడుతుంది
మన దేశవాళీ వ్యవసాయమూ
మద్దతు ధరల ఢోకాలేదట
చట్టమంటే ఎందుకో భయమూ
బహిరంగ మార్కెట్ ఎంత ముద్దుమాట
నచ్చెనట ఆదాని అంబానీకి
ఒద్దురో అయ్యాని మొత్తుకుంటే వినరు రైతులే వద్దన్న ఎవరి కొరకు
చలిలోన చస్తున్న కనికరమెరుగరూ ఇంకెన్ని గుండెలో ఆగేవరకు
||భారతమ్మా||
2. కంపెనోడి సరుకు కంపెనీదే ధర
రైతు కెందుకు లేదు అవకాశమూ
ఆరుగాలం కష్టపడేటి రైతుకు
ఆత్మహత్యలేన సదుపాయము
పంట విత్తనాలె పండించే రైతుకు
మార్కెట్లో ఎదురాయెనా మోసము
రైతును రాజుగా జేసేటి చట్టాలు కావంటు రైతులే జెప్పుతుంటే
రాబంధులకు మంచి చుట్టాలవుతాయని ఢిల్లీ పెద్దలంత చాటుతుంటే
||భారతమ్మా||
3. ట్రాక్టర్లె ఇండ్లాయె లంగర్లొవంటాయె
ఢిల్లీ సరిహద్దులాయె పొలము
ముసలీ ముతకా ఆడామొగయనె
తేడాలెరుగనీ ఉద్యమమూ
పోలీసు ఆకలిని తీర్చినా రైతుకు
ప్రేమేమతమైన అనుబంధమూ
మంత్రులా మాటల్లో కుట్రలూ కుహనాలు రైతులే విదేశీఏజెంట్లా
పోరాడె వాల్లంత నేరస్థులైపోతే దేశమే అతిపెద్ద జైలవునా
||భారతమ్మా||
4. భారత్ బందై దేశమే అట్టుడికె
మారరా పాలకులు ప్రజల కోసం
కోట్లాది కార్మికులు హర్తాళ్ళు జేసినా
కనలేర పోరుజన సందేశం
కాలినడక తోటి కదిలినా రైతులు
లాంగ్ మార్చయి చాటే ఆదేశం
ఆత్మనిర్భర్ అంటు మాటల గారడీ పంటలు భూములు మటుమాయం
అన్నధాత మీదే యమధూతలై తిరిగే కార్పొరేట్లదేరా మాయాజాలం
||భారతమ్మా||
5. ఇల్లిడ్సి పొలమిడ్సి ఢిల్లీకి చేరిన
రైతుకెందుకు చెప్పరాని ఘోస
సలిలోన ఆకలితో నల్గుతున్నాగాని
మేలుజరుగునన్న ఒక్క ఆశా
ఆ ఆశపై జలదాడి భాష్పగోళాలు
అణిచివేతే సర్కారు ద్యాసా
వారాలు పక్షాలు గడిచిపోతా ఉన్న ఏ రోజు రాదాయె కొత్తమాట
వెచ్చాలు దినుసులు ఒడ్సిపోయెదాక చర్చలంటు సాగదీస్తరంట
భారతమ్మా తల్లి భారతమ్మా
రైతు కూలీల కాపాడ కదలవమ్మా
దేశభక్తి మట్టి మనిషి స్వంతం
రైతుకె పట్టం గట్టవమ్మా
దేశ సంపద దోసే కేటుగాళ్ళే
దేశ ద్రోహులంటు చాటవమ్మా
భారతమ్మా తల్లి భారతమ్మా
దేశ ప్రజలను కాపాడరావమ్మా
- మిత్ర