Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నేను చీకట్లో కూర్చొని, చీకటిని తిట్టుకోవడం కన్నా, చిన్న దీపం వెలిగించే ప్రయత్నం చేస్తాను. విజయం నన్ను తప్పక వరిస్తుందనే' అంటూ విషయాన్ని నమ్మి, కష్టాలను లెక్కచేయకుండా శ్రమించి నేడు ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ''సర్ ఐజాక్ న్యూటన్'' వెలుగొందుతున్నారు. మార్చి 20న ఆయన వర్థంతి.
ప్రపంచానికి విశ్వరహస్యాలను విప్పి చెప్పిన ''సర్ ఐజాక్ న్యూటన్'' ఒక భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త, తత్వవేత్త. ప్రకృతి సిద్ధమైన తత్వశాస్త్రం సైన్సుగా ఎలా పరిణామం చెందిందన్న అంశంపై చేసిన ఎనలేని కృషికిగానూ ఆధునిక ప్రపంచం అంతా ఆయనను ''సైన్సు పితామహుడు'' అని పిలుచుకుంటోంది.
1643లో జనవరి 4న నవమాసాలు నిండ కుండానే జన్మించిన చిన్నారి, పెరిగి పెద్దయి ప్రపంచంలోనే మేటి శాస్త్రవేత్తల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఆ బక్కచిక్కిన చిన్నారే ''సర్ ఐజాక్ న్యూటన్''. ఈ రోజు అంతరిక్షంలోకి రాకెట్లలో వెలుతూ, శాస్త్రపరిజ్ఞానంలో అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నామంటే అందుకు ''న్యూటన్ గమన నియమాలే'' ఆధారం.
విశ్వ రహస్యాలను మానవాళికి విశ్లేషించి చెప్పిన న్యూటన్ ఇంగ్లండ్‌కు దగ్గరలోగల ''ఉల్‌తోప్'' అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. న్యూటన్ జన్మించిన సమయంలో అతను నెలలు నిండక మునుపే పుట్టడం వలన పసికందుగా ఉన్నపుడు న్యూటన్ చాలా బరువు తక్కువగాను, బలహీనంగాను ఉండేవాడు. చూసినవాళ్లంతా అసలీ శిశువు బతుకుతాడా లేదా అనుకున్నారు. న్యూటన్ తండ్రి, న్యూటన్ జననానికి మూడు నెలల ముందు మరణించడం, న్యూటన్ తన తల్లి దగ్గర మూడేండ్ల వయస్సు వరకు పెరగడం, తరువాత ఆమె ''బార్ స్మిత్'' అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకోవడం వల్ల న్యూటన్ తన చిన్నతనంలో తన తల్లితండ్రుల ప్రేమ కోల్పోయి తన అమ్మమ్మ-తాతల వద్ద పెరగవలసి వచ్చింది.
న్యూటన్ తన బలహీనమైన ఆరోగ్యం వలన ఆటల వైపు ఎక్కువగా ఆసక్తి చూపించక, చాలా తక్కువగా మాట్లాడుతూ, ఎక్కువగా ఆలోచించే వాడు. న్యూటన్ చిన్నప్పుడు తరగతి గది చదువుకంటే ఇతర సైన్సు పుస్తకాలు చదవటం, పెద్ద వస్తువుల్ని చూసి వాటినే చిన్న సైజులో తయారు చేసేవాడు. ఆయన చేతిలో రూపుదిద్దుకున్న ఈ వస్తువులన్నీ ఇప్పటికీ ''లండన్ రాయల్ సొసైటీ మ్యూజియంలో'' ఉన్నాయి. ఉన్నత చదువుల కొరకు స్కాలర్షిప్ అవసరమని గ్రహించిన న్యూటన్, స్కాలర్ షిప్ కోసం ఎంత ప్రయత్నించినా, మార్కులు తక్కువ వచ్చిన కారణంగా స్కాలర్షిప్ పొందలేకపోయాడు. అయినప్పటికి యూనివర్సిటీ బోర్డు సభ్యులు ఆయనకు నాలుగు సంవత్సరముల వరకు స్కాలర్షిప్ ఇచ్చి, తనకు నచ్చిన అంశాలపై పరిశోధించడం కోసం ప్రోత్సాహం ఇచ్చినందున చాలా సంతోషించాడు. ఈ వచ్చిన అవకాశాన్ని వీలైనంత సద్వినియోగం చేసుకోవాలని న్యూటన్ నిశ్చయించుకొని, పూర్తి సమయం ''లెక్కలు, భౌతిక శాస్త్రం'' అభ్యాసానికే వినియోగించాడు. న్యూటన్ యూనివర్సిటీలో గ్రీకు, లాటిన్, హిబ్రు భాషలను, లాజిక్, జ్యామితి, త్రికోణమితి లాంటి విషయాలను నేర్చుకుంటూ, గొప్ప శాస్త్రవేత్తల గురించి బాగా చదివేవాడు.
న్యూటన్ 1661లో ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరి గణిత, భౌతిక, ఖగోళ శాస్త్ర పరిశోధనలపై ఉన్న మక్కువతో అక్కడే ప్రొఫెసర్‌గా నియమితుడయ్యాడు. 1667లో ''పరావర్తన దూరదర్శినిని'' నిర్మించి సంచలనం సృష్టించి, చిన్నతనంలో చెట్టు నుంచి రాలిన యాపిల్‌ను గమనించిన న్యూటన్ అందుకు కారణాన్ని అన్వేషించే క్రమంలో ''గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని'' కనుగొన్నాడు. ''న్యూటన్ మూడు గమన నియమాలుగా'' ప్రసిద్ధిగాంచిన గొప్ప విషయాలను ప్రపంచానికి అందించి, భౌతిక శాస్త్ర భావనలను వివరిస్తూ ''ప్రిన్సిపియా మేథమేటికా'' అనే గ్రంథాన్ని కూడా రచించాడు.
న్యూటన్ 1969లో ట్రినిటీ కాలేజిలో ఉండే సమయంలో తన ఆలోచనలను రాసుకున్న పుస్తకాలను పరిశీలిస్తే, ఆ పుస్తకాలు ఇప్పటికీ ఎంతో ముఖ్యమైనవిగా గుర్తించబడ్డాయి. న్యూటన్ 1665లో ''కేంబ్రిడ్జి యూనివర్సిటీ'' నుండి ''బాచిలర్ డిగ్రీ'' పొంది, ప్లేగు వ్యాధి వలన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం రెండేండ్ల పాటు మూసివేసినందున, న్యూటన్ ''ఉల్‌తోప్''కు తిరిగి వచ్చి భౌతిక, గణిత శాస్త్ర అధ్యయనంలో రెండు సంవత్సరాల కాలం గడిపారు. ఈ కాలంలో, రకరకాల పరిశోధనలు చేశాడు. అదే సంవత్సరంలో న్యూటన్ ''ప్రిన్సిపియా'' అని ఒక సంకలనం తయారు చేశారు. అది న్యూటన్ యొక్క మహత్తర పుస్తకంగా, 1687లో ప్రచురించబడినది.
న్యూటన్‌కు 1672లో ''రాయల్ సొసైటీ ఫెలోషిప్'' లభించింది. అప్పటి వరకూ ప్రకృతి శాస్త్రంలో ఒక భాగంగా ఉన్న భౌతిక శాస్త్రాన్ని న్యూటన్ ఆవిష్కరణలు, సిద్ధాంతాల వల్ల ప్రత్యేక శాస్త్రంగా గుర్తించారు. అందుకే న్యూటన్ను ''భౌతిక శాస్త్ర పితామహుడు'' అంటారు. 1705లో బ్రిటిష్ ప్రభుత్వం ''సర్'' అని బిరుదునిచ్చి సత్కరించింది. ఇక అప్పటినుంచి ఐజాక్ న్యూటన్, ''సర్ ఐజాక్ న్యూటన్‌గా'' మారిపోయారు. అనేక సందర్భాలలో అతను ఇరవైనాలుగు గంటలలో పద్దెనిమిది లేదా పందొమ్మిది గంటలు అధ్యయనంలో గడిపేవారు. రాయల్ సొస్కెటీ అధ్యక్షుడు ''రాబర్ట్ హ్కు'' 1703 లో మరణించినందున అప్పుడు ప్రొఫెసర్ న్యూటన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. న్యూటన్ అద్భుతమైన రచయిత, అతను అనేక శాస్త్రీయ, అశాస్త్రీయ విషయాల మీద ఎన్నో పుస్తకాలను రాశాడు. ప్రొఫెసర్ న్యూటన్ జీవితం మొత్తం భౌతిక శాస్త్రం, గణిత శాస్త్ర సేవలకే అంకితం చేశారు.
లక్ష్యం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, కష్టాలు వచ్చినా మార్గం, గమ్యం మార్చకూడదనే నియమాన్ని నమ్మి, నేడు విశ్వవ్యాప్తంగా వెలుగొందుచున్న సర్ ఐజాక్ న్యూటన్ ''మార్చి 20, 1727'' రోజున మరణించాడు. న్యూటన్ జీవితం, న్యూటన్ ప్రయోగాలు మానవ మనుగడ ఉన్నన్నాళ్లు సజీవం, ఆదర్శం.
- జి. రఘుపతిరావు
సెల్: 9963499282