Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాస్వామ్యానికి మంగళం పాడేస్తూ, సైనిక పాలన షురూ అయ్యింది మయన్మార్‌లో. సైన్యం అరాచకాల్ని ప్రజలు ప్రశ్నించడంతో రక్తం ఏరులై పారుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దాదాపు ఐదు దశాబ్దాల పాటు సైనిక పాలన కొనసాగడం, 1962 నుంచి అంతర్జాతీయంగా ఏకాకిగా మారడం, ఎన్నికలు జరిగి, ప్రజాస్వామ్యం దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామం ఆ దేశ భవిష్యత్తును మరోసారి ప్రశ్నార్థ్ధకంగా మార్చింది. ప్రజాస్వామ్యం కోసం అనేక ఏండ్లపాటు గహ నిర్బంధంలో గడిపిన, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని సైనిక జుంటా అధికారం నుంచి తొలగించి తిరిగి నిర్బంధంలోకి పంపడంతో ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. మయన్మార్‌లో సైన్యం రాజకీయ నేతలను నిర్బంధించడంపై అనేక దేశాలు నివ్వెరపోయాయి.
అక్కడ నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. 'నిర్బంధంలో ఉంచిన రాజకీయ నేతలు, ప్రభుత్వాధికారులను సైనిక పాలకులు వెంటనే విడుదల చేసి, ప్రజాభీష్టానికి లోబడి వ్యవహరించాల్సిన అవసరం వుంది. మయన్మార్‌లో పరిణామాలు ప్రజాస్వామ్య సంస్కరణలకు తీవ్ర విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి చీఫ్ గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది.
గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సూకీకి చెందిన ఎన్ఎల్డీ ఘన విజయం సాధించగా సైన్యం మద్దతు ఉన్న ప్రతిపక్ష యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ ఓటమి పాలు కావడం గమనార్హం. దీంతో సైనిక తిరుగుబాటుకు అవకాశాలున్నాయంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలు నిజమేనని తేలిపోయింది. దేశ రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలు.. అత్యవసర పరిస్థితుల్లో పాలనా బాధ్యతలను సైన్యం హస్తగతం చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నాయని సైనిక నేతలు సమర్థించుకుంటున్నారు. అయితే, ఇది సైనిక తిరుగుబాటు కిందికే వస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎన్నికల్లో తాము మద్దతిచ్చిన రాజకీయ పార్టీలు ఓటమి పాలుకావడం జీర్ణించుకోలేకే సైనిక నేతలు ఈ క్లాజ్‌ను ఉపయోగించుకున్నారని చెబుతున్నారు....
పాలనా పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్న సైన్యం.. ఆందోళనకారులను జంతువుల్లా వేటాడుతోంది. ఆంగ్ సాన్ సూకీ నుంచి పాలనను లాక్కున్న సైనిక అధికారులు అప్పటి నుంచి మారణహౌం సష్టిస్తున్నారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సామాన్యులపై తుపాకీ పంజా మోతున్నారు. ఇప్పుడు మరోసారి సామాన్యులపై సైనికులు జరిపిన కాల్పుల్లో సుమారు వంద మందికి పైగా చనిపోయారు.
ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగిస్తోంటే, సైన్యం మాత్రం అత్యంత పాశవికంగా మారణహౌమం సృష్టిస్తోంది. ప్రజలపై పగబట్టినట్లుగా సైన్యం వ్యవహరిస్తున్న తీరుపై ప్రపంచ దేశాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. మృతుల్లో చిన్నారులు కూడా ఉండడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. మయన్మార్ మారణ ఖాండను 'రక్తపాత దినం'గా అభివర్ణించారు ఐక్యరాజ్య సమితి మయన్మార్ అధికార ప్రతినిథి క్రిస్టిన్ స్కరనర్.
ఆందోళనకారులపైనే కాదు, ఈ మారణహౌమాన్ని చూపిస్తోన్న మీడియాపైనా దాడులకు దిగుతోంది మయన్మార్ సైన్యం. యాంగాన్, మాండలే, మెన్యవా నగరాల్లో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. ఏ క్షణం ఎటువైపునుంచి మృత్యువు తమ మీదకు వస్తుందో తెలియక జనం విలవిల్లాడుతున్నారు. ఆందోళనకారులనే కాదు, సామాన్యుల్నీ సైన్యం విడిచిపెట్టడంలేదు.
- జె. దినేష్
సెల్:666238266