Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఒకసారి ఒకరు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు అంటే అది వారి వ్యక్తిగత బలహీనత అనుకోవచ్చు. కానీ అదే తంతు నిరంతరంగా సమాజంలో సాగుతుందంటే అది వ్యక్తిగత బలహీనత కాదు. సమాజ బలహీనత. ప్రభుత్వాలు ప్రజలను నిర్లక్ష్యం చేయడంలో నుండి ఉద్భవించిన బలహీనత. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వందల మంది రైతులు నిత్యం ప్రాణాలు వదులుతూనే ఉన్నారు. వీరిలో ఎక్కువగా కౌలు రైతులే. ప్రభుత్వ హత్యలని అంటున్నది తెలంగాణ సమాజం. 2021 మార్చి 24న ఒక నిండు కుటుంబాన్ని బలి తీసుకున్నదీ ప్రభుత్వం. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కెపల్లికి చెందిన కౌలు రైతు జంజిరాల రమేశ్ అతని భార్య, కొడుకు, కూతురు, కూతురు కడుపులో ఉన్న శిశువును కూడా కలిపి మొత్తంగా ఐదుగురిని బలి తీసుకున్నది.
''ఒడ్డు చేరే దాకా ఓడ మల్లప్ప ఒడ్డు దాటినాక బోడి మల్లప్ప'' అనె సామెత మన ముఖ్యమంత్రికి సరిగ్గా సరిపోతది. ఉద్యమ కాలంలో సబ్బండ వర్గాల శ్రేయస్సే తెలంగాణ సాధనకు లక్ష్యమని ప్రకటించి... నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో వచ్చిన కేసీఆర్ చెప్పిన ప్రతి మాటను ఈ తెలంగాణ ప్రజ తమ మనుసుల్లో పెట్టుకున్నది. తెలంగాణ వస్తే ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోడని అంటే గుడ్డిగా నమ్మింది. తెలంగాణ సాధన కోసం ఎంతో మంది రైతులు తమ పంట పొలాలను వదిలి రోడ్లపై ఉద్యమం చేసారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నేడు రైతు ఆత్మహత్యలు ఆగకపోగా మరింత పెరిగాయి. తెలంగాణ వచ్చిన కొత్తలోనే 2017లో మద్దతు ధర అడిగిన మిర్చి రైతులపై హత్యా యత్నం(సెక్షన్307) కేసు నమోదు చేసి సంకెళ్లు వేసి జైలుకి తీసుకెళ్లిన సంఘటన వీరు తీరును చెప్పకనే చెప్పింది. అయితే తనపై వచ్చిన అపవాదులను, ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను దారి మళ్లించి తాను రైతు పక్షపాతిని అనిపించుకోవడానికే 2018 మేలో ''రైతుబంధు'' పథకాన్ని ప్రకటించాడు. ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు కేసీఆర్ పట్ల అతని విధానాల పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ రైతులకు ఎంతో కొంత లాభం జరుగుతుందని చాలామంది హర్షాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఈ రైతు బందు పేరుతో కేసీఆర్ భూమి లేని, కాస్తో కూస్తో భూమి ఉండి కష్టపడే కౌలు రైతుల పొట్ట కొట్టడమే కాక వారి ప్రాణాలను కూడా తీసుకుంటున్నారు. రైతు అంటే భూమిలో వ్యవసాయం చేసేవారే అని తెలుసు మనకి. కానీ రైతు అనేదానికి కేసీఆర్ తన భూస్వామ్య భావజాలపు దొరతనంతో ఓ కొత్త నిర్వచనం ఇచ్చి నిండు సభలో కౌలు రైతులను ఇంట్లో కిరాయి దారులతో పోల్చి అవమానించాడు. ''రైతు బంధు'' సాగు చేసే రైతుల్ని ఆర్థికంగా ఆదుకొని వారి వ్యవసాయానికి ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రకటించిందే కదా! మరి నేడు ఎంతమంది భూమిని సాగు చేస్తూ ''రైతుబంధు'' తీసుకుంటున్నారు? చిన్న, సన్నకారు రైతులకు కాస్త లాభం జరుగొచ్చు కానీ ఎక్కువగా ఎకరాలకు ఎకరాలు ఉన్న భూయజమానులకే లబ్ది చేకూరుస్తున్నారు. 2018 సంవత్సరాంతంలో రైతు స్వరాజ్య వేదిక, టాటా ఇన్సిటిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌తో కలసి రైతు బంధు పథకం అమలు తీరును పరిశీలించడానికి తెలంగాణలోని 3 జిల్లాలలో శాంపుల్ సర్వే చేసింది ఈ సర్వేలో విస్తుపోయే కొన్ని నిజాలు బయటపడ్డాయి. సర్వే చేసిన గ్రామాలలో ఎక్కువ మొత్తం రైతు బంధుని పొందే మొదటి పది మంది లబ్ధిదారులలో దాదాపు ఎవరూ ఆ గ్రామాలలో లేరని తేలింది. ఎక్కువ మొత్తం రైతుబంధు తీసుకునే ఆ మొదటి పదిమంది సుమారుగా 20 నుంచి 30 ఎకరాలు ఉన్న భూ యజమానులు తప్ప సాగుచేసే రైతులు కాదు. సాగు భూమిలో కాలు పెట్టని వ్యక్తులకి లక్షల్లో రైతు బంధు ఇస్తున్నారు. ఆరుగాలం పంట చేలల్లో కష్టపడే కౌలు రైతుల్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. అసలు కౌలు రైతులను రైతులుగానే గుర్తించడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు లైసెన్స్డ్ కల్టివేటర్ చట్టం 2011 ఆధారంగా 2013లో 53 వేల కౌలు రైతులను గుర్తించి లోన్ ఎలిజిబిలిటీ కార్డ్స్(ఎల్ఈసీ) ఇచ్చింది. దీని ద్వారా కౌలు రైతులు బ్యాంకులలో రుణాలు పొందారు. ఇవి వారి వ్యవసాయానికి ఎంతో కొంత ఆసరాగా నిలిచేది. కానీ తెలంగాణ వచ్చాక ఆ ఊసే లేదు. కౌలు రైతులు రైతులే కాదని సాక్షాత్తు ముఖ్యమంత్రిగారే మాట్లాడక వారిని ఎవరు గుర్తిస్తారు. రాష్ట్రంలో ఒక్క కౌలు రైతును కూడా గుర్తించిన ధాఖలాలూ లేవు. కానీ, మనతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌలు రైతుల సమస్యల అధ్యయనం కోసం అక్కడి ప్రభుత్వం రాధాకష్ణ కమిషన్ని నియమించింది. 35లక్షల మంది కౌలు రైతులు ఆ రాష్ట్రంలో ఉన్నట్టుగా గుర్తించింది. 2019లో క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డు(సీసీఆర్)ని తీసుకువచ్చి దాని ద్వారా లక్ష మంది కౌలు రైతులకి ''వైఎస్ఆర్ రైతు భరోసా'' పథకాన్ని అమలు పరిచారు. ఇది సంఖ్యా పరంగా వాస్తవ బాధితులతో పోల్చి చూస్తే వ్యత్యాసం ఉన్నా మన రాష్ట్రంతో పోల్చినప్పుడు మాత్రం ''గుడ్డిలో మెల్ల''గా చెప్పుకోవచ్చు. అక్కడ ఏ రైతు ఎట్లా మరణించినా వ్యవసాయ సంక్షోభంలో భాగంగా సంభవించిన మరణంగానే గుర్తించి ''రైతు భరోసా'' పథకాన్ని అమలు పరుస్తున్నారు. అదే మన రాష్ట్రంలో మాత్రం పట్టా పాసు పుస్తకంలో పేరు ఉన్న రైతు చనిపోతే మాత్రమే పరిహారం వర్తిస్తుంది. ఆ రైతు కుటుంబంలో ఇంకెవరు మరణించినా ఎటువంటి ప్రభుత్వ లబ్ధి లభించదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు, కౌలు రైతుల కుటుంబాలను కలవడానికి మానవ హక్కుల వేదిక,రైతు స్వరాజ్య వేదిక విడివిడిగా, కొన్ని సందర్భాల్లో ఉమ్మడిగా వెళ్ళినపుడు అన్ని రైతు కుటుంబాలు ఒకే రకమైన సమస్యలు చెప్పేవారు. ఉన్న ఒక ఎకరా, రెండు ఎకరాలు వ్యవసాయం చేస్తే ఏమి మిగులటం లేదని మరికొంత భూమిని కౌలుకు చేస్తున్నారు. ఆ భూమిని సాగు చేయడానికి ప్రభుత్వం ఎట్లాగు సాయం చేయడం లేదని ప్రయివేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెస్తున్నారు. అకాల వాతావరణ సమస్యల వల్ల పంట నష్టం జరుగుతుంది. ఈసారి కాకపోయినా వచ్చే ఎడాదైనా కలిసి రాకపోతుందా? అని ఆశతో మళ్ళీ వ్యవసాయానికి అప్పులు తెస్తూ తెస్తూ పంట దిగుబడి సరిగా రాక, ప్రభుత్వాలు గిట్టుబాటు ధరకు పంటను కొనకపోవడం వల్ల రైతులు పీకల లోతు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఈ అప్పులు తీర్చలేక, అప్పుల వాళ్లకు మొఖం చూపించలేక పరువు పోతుందని దానికన్నా జీవిడుసుడే నయం అని ఆత్మహత్య చేసుకుంటున్నారని చెపుతూ కన్నీరు పెట్టని కుటుంబంలేదు. నేడు తెలంగాణలో. ఈ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే అధికం. కౌలు రైతులను రైతులు గానే గుర్తించి వారికి కూడా ప్రభుత్వం అన్ని రకాల సాయాన్ని అందించాలి. రైతు బంధుని వ్యక్తి యూనిట్‌గా కాకుండా కుటుంబం యూనిట్‌గా అందించాలి. రైతులకి అవసరమైన నాణ్యమైన ఎరువులు, పురుగు మందుల్ని ప్రభుత్వమే అందించాలి. రైతులకి సాగుకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వమే అందించి రైతులకు అప్పుల నుంచి విముక్తి కల్పించాలి. దీని ద్వారా రైతులకి ప్రయివేటు వ్యక్తుల నుంచి అప్పుల బాధ తప్పడమే కాదు పరువు అనే సామాజిక కుంగుబాటు కూడా దూరమవుతుంది. రైతు పంటకు స్వామి నాధన్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా తగినంత మద్దతు ధరని ప్రకటించాలి. అడుగక ముందే తెలంగాణ సకలజనుల ప్రయోజనాలు నెరవేరుస్తున్నామనీ, బంగారు తెలంగాణ రూపొందించడమే తమ లక్ష్యమనీ ప్రగల్బాలు పలికే పాలకులు రైతులు కోరే పై డిమాండ్లను నెరవేర్చాలి. వాటిని నెరవేరిస్తే బంగారు తెలంగాణ ఏమోకానీ, కనీసం రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణనైనా చూడగలమని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.
- వి. దిలీప్
సెల్:8464030808